మాంచెస్టర్/దుబాయ్: ఐపీఎల్ రెండో దశ పోటీ ల్లో పాల్గొనేందుకు భారత క్రికెటర్లు యూఏఈ చేరుకున్నారు. ముంబై ఇండియన్స్ జట్టు తమ ఆటగాళ్లు రోహిత్ శర్మ, బుమ్రా, సూర్య కుమార్ కోసం ప్రత్యేక విమానం ఏర్పాటు చేయగా... రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కూడా కోహ్లి, సిరాజ్ కోసం ఇదే తరహా ఏర్పాటు చేసింది. టెస్టు సిరీస్‌లో భాగంగా ఉండి ఐపీఎల్ కోసం యూఏఈ వెళ్లాల్సిన మిగిలిన భారత క్రికెటర్లతో (16 మంది)పాటు ఇంగ్లండ్ ప్లేయర్ స్యామ్ కరన్ మాంచెస్టర్ నుంచి కమర్షియల్ ఫ్లయిట్ ద్వారా యూఏఈకి వెళ్లారు. వీరి కోవిడ్ పరీక్షలన్నీ ‘నెగెటివ్’గా తేలాయి. యూఏఈ దేశపు నిబంధనల ప్రకారం క్రికెటర్లంతా ఆరు రోజుల పాటు తమ హోటల్ గదుల్లో క్వారంటైన్‌లో గడపాల్సి ఉం టుంది. ఆ తర్వాత తమ జట్ల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బయో బబుల్‌లో వీరు చేరతారు.
ఏదైనా జరగవచ్చని...
శుక్రవారం నుంచి ఓల్డ్‌ట్రాఫోర్డ్ మైదానంలో జరగాల్సిన భారత్, ఇంగ్లండ్ చివరి టెస్టు అనూహ్యంగా రద్దయింది. గురువారం రాత్రి భారత క్రికెటర్లందరి కోవిడ్ రిపోర్టులు ‘నెగెటివ్’గా వచి్చనా... మ్యాచ్ మధ్యలో ఏదైనా జరగవచ్చనే భయమే టీమిండియా ఆటగాళ్లను బరిలోకి దిగకుండా చేసింది. సహజంగానే కరోనా ప్రభావం కొంత ఆలస్యంగా కనిపించే అవకాశం ఉంది కాబట్టి ఆడకపోవడమే మంచిదని కోహ్లి బృందం భావించింది. మ్యాచ్ జరగాల్సిన రోజు ఉదయం సుదీర్ఘ సమయం పాటు చర్చించాక ఇరు బోర్డులు టెస్టును రద్దు చేయాలని నిర్ణ యించాయి. భారత జట్టు పూర్తి జట్టును బరిలోకి దింపే పరిస్థితిలో లేదని ఇంగ్లండ్ బోర్డు ప్రకటించగా... ప్లేయర్ల ఆరోగ్యభద్రతే తమకు అన్నింటి కంటే ముఖ్యమని బీసీసీఐ ప్రకటించింది.
విమర్శలు, ప్రతివిమర్శలు...
ఐపీఎల్‌లో ఒక్క మ్యాచ్‌కు కూడా ఇబ్బంది రాకుండా ఉండాలనే భారత క్రికెటర్లు టెస్టు నుంచి తప్పుకున్నారని, వారికి టెస్టులకంటే ఐపీఎల్ అంటేనే ప్రాధాన్యత అని ఇంగ్లండ్ మాజీ క్రికెటర్లు, మీడియా భారత జట్టుపై విరుచుకుపడ్డారు. రెండో కోవిడ్ ‘నెగెటివ్’ రిపోర్టు వచ్చాకే యూఏఈ బయల్దేరిన వీరు అదే రిపోర్టుతో ఒక రోజు ఆలస్యంగా టెస్టు ఆడితే ఏమయ్యేదని వారు ప్రశి్నంచారు. టెస్టు సిరీస్‌లో భారత్, ఇంగ్లండ్ కాకుండా చివరకు ‘డబ్బు’ గెలిచిందని వారు వ్యాఖ్యానించారు. అయితే దీనిపై భారత అభిమానులు ‘డబ్ల్యూటీసీ ఫైనల్ తర్వాత భారత జట్టు నలభై రోజులు ఖాళీగా కూర్చుంది. టెస్టు సిరీస్‌ను కాస్త ముందుగా జరపమన్నా వినలేదు. పైగా పనికిమాలిన ‘హండ్రెడ్’ కోసం రెండో, మూడో టెస్టుల మధ్య 9 రోజుల విరామం ఇచ్చారు. అలాంటిది ఇప్పుడు ఐపీఎల్‌ను విమర్శించడంలో అర్థం లేదు’ అని ఘాటుగా స్పందించారు.
సిరీస్ ఫలితం ఏమిటి?
ఐదో టెస్టు రద్దుతో సిరీస్ ఫలితంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీనిపై అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ఇంకా స్పష్టతనివ్వాల్సి ఉంది. వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) నిబంధనల ప్రకారం కోవిడ్ కారణంగా మ్యాచ్ జరిగే అవకాశం లేకపోతే మ్యాచ్‌ను రద్దు చేయవచ్చు. అలా చూస్తే భారత్ 2–1తో సిరీస్ గెలుచుకున్నట్లే. అయితే ఇంగ్లండ్ బోర్డు (ఈసీబీ) దీనిని అంగీకరించడం లేదు. మధ్యే మార్గంగా ఈ టెస్టును రాబోయే రోజుల్లో మళ్లీ ఎప్పుడైనా ఆడేందుకు తాము సిద్ధమని బీసీసీఐ ప్రకటించింది. వచ్చే ఏడాది జూన్‌లో భారత జట్టు పరిమిత ఓవర్ల సిరీస్‌ల కోసం ఇంగ్లండ్‌కు వెళ్లాల్సి ఉంది. అప్పుడు ఏమైనా ఈ టెస్టు కోసం తేదీలు సర్దుబాటు చేయవచ్చు. అయితే ఈసీబీ సీఈఓ టామ్ హారిసన్ మాత్రం దానిని ప్రస్తుత సిరీస్‌లో భాగంగా కాకుండా ‘ఏౖకైక టెస్టు’గా ప్రచారం చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.
టెస్టు ఆడలేం... ఐపీఎల్‌కు సిద్ధం!
Published Sun, Sep 12 2021 5:44 AM | Last Updated on Mon, Sep 20 2021 11:53 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment