బజ్‌బాల్ ఆటతీరుతో టెస్టు క్రికెట్‌కు కొత్త నిర్వచనం చెప్పింది ఇంగ్లండ్ జట్టు. కెప్టెన్‌గా స్టోక్స్, హెడ్‌కోచ్‌గా బ్రెండన్ మెక్‌కల్లమ్ బాధ్యతలు తీసుకున్నాకా బజ్‌బాల్ ఆటకు మరింత పదును పెట్టింది. సౌతాఫ్రికా, పాకిస్తాన్‌లతో జరిగిన టెస్టు సిరీస్‌లో బజ్‌బాల్ దూకుడుతో సిరీస్ విజయాలను సొంతం చేసుకున్న ఇంగ్లండ్ యాషెస్ సిరీస్‌లోనూ అదే దూకుడు చూపెట్టాలని భావించింది.
అయితే తొలి రెండు టెస్టుల్లో బజ్‌బాల్ ఆటతీరుతో ఇంగ్లండ్ చేతులు కాల్చుకుంది. అప్పటికే డబ్ల్యూటీసీ టైటిల్ గెలిచి డిపెండింగ్ చాంపియన్‌గా నిలిచిన ఆస్ట్రేలియా ఇంగ్లండ్‌కు ముకుతాడు వేసింది. తొలి రెండు టెస్టులను గెలిచి ఆసీస్ 2-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. అయితే ఓటమిపాలైన తమ బజ్‌బాల్ దూకుడు మాత్రం ఆపమని కెప్టెన్ స్టోక్స్ కుండబద్దలు కొట్టాడు.
అదే బజ్‌బాల్ ఆటతీరుతో మూడో టెస్టును గెలిచిన ఇంగ్లండ్ ఆధిక్యాన్ని 2-1కి తగ్గించింది. నాలుగో టెస్టు డ్రాగా ముగిసినా ఐదో టెస్టు గెలిచి 2-2తో సిరీస్‌ను సమం చేసింది. ఇక వచ్చే ఏడాది టీమిండియా గడ్డపై నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ ఆడేందుకు ఇంగ్లండ్ వస్తోంది. బజ్‌బాల్ ఆటతీరును టీమిండియాకు పరిచయం చేస్తామని స్టోక్స్ పేర్కొనడం ఆసక్తి కలిగించింది.
అయితే ఇదే బజ్‌బాల్ స్టైల్ ను ఇండియన్ టీమ్ కూడా ఫాలో అయితే ఎలా ఉంటుందన్న సందేహాలు అభిమానుల్లో మొదలయ్యాయి. ఈ విషయంపై అశ్విన్ స్పందించాడు. "మేము టెస్ట్ క్రికెట్ బాగా ఆడుతున్నాం. కానీ త్వరలోనే పరివర్తన దిశగా వెళ్తున్నాం. ఆ దశలో పరిస్థితులు అంత సులువుగా ఉండవు. కొన్ని సమస్యలు తలెత్తుతాయి. ఒకవేళ ఈ దశలో ఇండియా బజ్‌బాల్ స్టైల్ అడాప్ట్ చేసుకుందని అనుకుందాం. హ్యారీ బ్రూక్ లాగా మన ప్లేయర్స్ కూడా బ్యాట్ ఝుళిపించడానికి ప్రయత్నించారని అనుకుందాం.
రెండు మ్యాచ్ లు ఓడిపోతాం. మనం ఏం చేస్తాం? బజ్‌బాల్ కు, ప్లేయర్స్ కు మద్దతిస్తామా? కనీసం నలుగురు ప్లేయర్స్ పై వేటు వేస్తాం. మన సంస్కృతి ఎప్పుడూ ఇలాగే ఉంది. ఇతరుల స్టైల్ వాళ్లకు మంచి ఫలితాలు ఇచ్చింది కదా అని మనం కాపీ చేయలేం. వాళ్లకు అది పని చేసింది ఎందుకంటే వాళ్ల మేనేజ్‌మెంట్, సెలక్టర్లు ఈ స్టైల్ ను ఆమోదించారు. మద్దతిచ్చారు. వాళ్ల అభిమానులు కూడా ఆమోదించారు. మనం అది చేయలేం" అని అశ్విన్ స్పష్టం చేశాడు.
ఇక వన్డే వరల్డ్ కప్ పై కూడా అశ్విన్ స్పందించాడు. అభిమానులు ఇండియన్ టీమ్ కు సానుకూలంగా మద్దతివ్వాలని కోరాడు. "వరల్డ్ కప్ గెలవడం అంత సులువు కాదు. 12 ఏళ్ల తర్వాత మళ్లీ వన్డే వరల్డ్‌కప్ మన దేశంలో జరుగుతుంది. గతాన్ని గుర్తుచేయొద్దు.. అప్పుడు ధోని సేన మ్యాజిక్ చేసింది. ఇప్పుడు అదే రిపీట్ అవుతుందని కచ్చితంగా చెప్పలేం. దాదాపు ప్రతి మేజర్ టోర్నమెంట్లో మనం సెమీఫైనల్ చేరాం. ఆ రోజు సరిగా ఆడలేకపోయాం అంతే" అని అశ్విన్ అన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment