మహ్మద్ సిరాజ్‌తో రోహిత్ శర్మ (ఫైల్ ఫొటో- PC: BCCI)
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మపై భారత మాజీ పేసర్ ప్రవీణ్ కుమార్ ప్రశంసలు కురిపించాడు. అతడొక అద్భుతమైన నాయకుడని.. జట్టును ముందుకు నడిపించడంలో తనకు తానే సాటి అని కొనియాడాడు.
సౌరవ్ గంగూలీ లాంటి క్రమక్రమంగా వాళ్లు పటిష్ట జట్టు నిర్మిస్తే.. రోహిత్ శర్మ తనకు తానుగా జట్టును క్రియేట్ చేసుకున్న ఘటికుడని పేర్కొన్నాడు. అనుభవజ్ఞులు, యువ ఆటగాళ్ల మేళవింపుతో కూడిన టీమ్‌ను సమర్థవంతంగా నడిపిస్తున్న తీరు అమోఘమని ప్రశంసించాడు.
రన్‌మెషీన్ విరాట్ కోహ్లి నుంచి భారత కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత రోహిత్ శర్మ పరిమిత ఓవర్ల ద్వైపాక్షిక సిరీస్‌లలో దుమ్ములేపాడు. ముఖ్యంగా పొట్టి ఫార్మాట్లో టీమిండియాను తిరుగులేని జట్టుగా మార్చాడు. కానీ.. టీ20 వరల్డ్‌కప్-2022 టైటిల్ మాత్రం గెలవలేకపోయాడు.
అంతేకాదు.. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్లోనూ రోహిత్ శర్మ సేనకు పరాభవం తప్పలేదు. ఇక వన్డేల్లోనూ అదే తరహా దురదృష్టం వెంటాడింది. ద్వైపాక్షిక సిరీస్‌లో సత్తా చాటడం సహా సొంతగడ్డపై అపజయమన్నది ఎరుగక వన్డే ప్రపంచకప్-2023 ఫైనల్ దాకా వెళ్లినా.. రన్నరప్‌తోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
ఈ నేపథ్యంలో రోహిత్ శర్మ కెప్టెన్సీపై విమర్శలు వచ్చినా.. జట్టును నడిపించిన తీరు బాగుందని ప్రవీణ్ కుమార్ టైమ్స్ ఆఫ్ ఇండియాతో పేర్కొన్నాడు. ‘‘సౌరవ్ గంగూలీ జట్టును నిర్మించాడు. కానీ రోహిత్ తనకంటూ కొత్త జట్టును క్రియేట్ చేసుకున్నాడు.
సహచర ఆటగాళ్లతో తనొక స్నేహితుడిలా మెలుగుతాడు. వాళ్లు తప్పుచేసినప్పుడు మాత్రమే తిడతాడు. మళ్లీ వెంటనే వెళ్లి ఆత్మీయంగా హత్తుకుంటాడు కూడా! కెప్టెన్‌గా వాళ్లకు ఆదేశాలు ఇస్తూనే మైదానంలో స్వేచ్ఛగా కదిలే వెసలుబాటు కూడా కల్పిస్తాడు’’ అని ప్రవీణ్ కుమార్ రోహిత్ కెప్టెన్సీ తీరును ప్రశంసించాడు.
కాగా స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌తో రోహిత్ శర్మ బిజీగా ఉన్నాడు. కోహ్లి, కేఎల్ రాహుల్, మహ్మద్ షమీ వంటి సీనియర్లు లేకుండానే ఇప్పటికే ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 3-1తో గెలిచాడు.
చదవండి: IPL 2024: లక్నో అభిమానులకు గుడ్‌న్యూస్.. కెప్టెన్ వచ్చేశాడు!
Comments
Please login to add a commentAdd a comment