SL VS PAK 1st Test: Saud Shakeel Has 2nd Best Average After Don Bradman In Tests - Sakshi
Sakshi News home page

SL VS PAK 1st Test: డాన్‌ బ్రాడ్‌మన్‌ తర్వాత ఈ పాక్‌ ఆటగాడే.. ఏకంగా 98.50 సగటు

Published Wed, Jul 19 2023 11:48 AM | Last Updated on Wed, Jul 19 2023 1:00 PM

Saud Shakeel Has 2nd Best Average After Don Bradman In Tests, Minimum 10 Innings - Sakshi

పాకిస్తాన్‌ యువ బ్యాటర్‌ సౌద్‌ షకీల్‌ ప్రపంచ క్రికెట్‌లో సంచనాలు సృష్టిస్తున్నాడు. శ్రీలంకతో జరుగుతున్న టెస్ట్‌ మ్యాచ్‌లో అజేయ డబుల్‌ సెంచరీ (208) బాదిన షకీల్‌.. క్రికెట్‌ దిగ్గజం డాన్‌ బ్రాడ్‌మన్‌ రికార్డు బద్దలు కొట్టే దిశగా అడుగులు వేస్తున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో కనీసం 10 టెస్ట్‌ ఇన్నింగ్స్‌ల తర్వాత అత్యధిక యావరేజ్‌ (99.94) రికార్డు బ్రాడ్‌మన్‌ పేరిట ఉండగా.. షకీల్‌, బ్రాడ్‌మన్‌ వెనువెంటనే ఉన్నాడు. కెరీర్‌లో 11 ఇన్నింగ్స్‌ల తర్వాత షకీల్‌ సగటు 98.50గా ఉంది. డబుల్‌ సెంచరీకి ముందు అతని స్కోర్లు 32, 125 నాటౌట్‌, 55 నాటౌట్‌, 22, 53, 23, 94, 63, 76, 37గా ఉన్నాయి. 11 ఇన్నింగ్స్‌ల్లో షకీల్‌.. 2 సెంచరీలు, 5 అర్ధ సెంచరీ సాయంతో 788 పరుగులు చేశాడు.

ఇదిలా ఉంటే, శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్ట్‌లో పాకిస్తాన్‌ మిడిలార్డర్‌ బ్యాటర్‌ సౌద్‌ షకీల్‌ చరిత్ర సృష్టించాడు. శ్రీలంకలో డబుల్‌ సెంచరీ (208 నాటౌట్‌) సాధించిన తొలి పాకిస్తాన్‌ క్రికెటర్‌గా రికార్డుల్లోకెక్కాడు. గతంలో శ్రీలంకలో అత్యధిక స్కోర్‌ రికార్డు మహ్మద్‌ హఫీజ్‌ (196) పేరిట ఉండేది. ఈ మ్యాచ్‌లో షకీల్‌.. హఫీజ్‌ రికార్డును తిరగరాశాడు. కెరీర్‌లో ఆడుతున్నది ఆరో టెస్ట్‌ మ్యాచే అయినా ఎంతో అనుభవజ్ఞుడిలా బ్యాటింగ్‌ చేసిన షకీల్‌.. వ్యక్తిగత రికార్డుతో పాటు టెయిలెండర్ల సహకారంతో తన జట్టుకు అతిమూల్యమైన పరుగులు సమకూర్చాడు.

జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు (73/4) బరిలో​కి దిగిన షకీల్‌.. అఘా సల్మాన్‌ (83), నౌమన్‌ అలీ (25), నసీం షా (78 బంతుల్లో 6) సాయంతో  తన జట్టుకు భారీ స్కోర్‌ అందించాడు. షకీల్‌ సూపర్‌ డబుల్‌ సెంచరీతో కదం తొక్కడంతో పాక్‌ తొలి ఇన్నింగ్స్‌లో 461 పరుగులకు ఆలౌటైంది. అనంతరం సెకెండ్‌ ఇన్నింగ్స్‌ ప్రారంభించిన శ్రీలంక.. మూడో రోజు ఆట ముగిసే సమయానికి వికెట్‌ నష్టపోకుండా 12 పరుగులు చేసింది. అంతకుముందు శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 312 పరుగులకు ఆలౌటైన విషయం  తెలిసిందే. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement