ధర్మశాల వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదో టెస్టులో భారత యువ ఓపెనర్ యశస్వీ జైశ్వాల్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. తొలి ఇన్నింగ్స్‌లో అద్భుతమైన హాఫ్ సెంచరీతో జైశ్వాల్ చెలరేగాడు. కేవలం 58 బంతులు ఎదుర్కొన్న జైశ్వాల్.. 5 ఫోర్లు, 3 సిక్స్‌లతో 57 పరుగులు చేశాడు. అయితే ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ యువ స్పిన్నర్ షోయబ్ బషీర్ ఓవరాక్షన్ చేశాడు.
ఏమి జరిగిందంటే?
తొలి ఇన్నింగ్స్‌లో భారత ఓపెనర్ల జోరుకు అడ్డుకట్ట వేసేందుకు ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్.. స్పిన్నర్ బషీర్‌ను ఎటాక్‌లోకి తీసుకువచ్చాడు. ఈ క్రమంలో బషీర్‌కు తన తొలి ఓవర్లోనే జైశ్వాల్ చుక్కలు చూపించాడు. ఇన్నింగ్స్ 9వ ఓవర్ వేసిన బషీర్ బౌలింగ్‌లో యశస్వీ మూడు సిక్స్‌లు బాది ఏకంగా 18 పరుగులు రాబట్టాడు. అంతటితో ఆగకుండా తర్వాతి ఓవర్లలో కూడా బషీర్‌ను జైశ్వాల్ టార్గెట్ చేశాడు.
అయితే దురదృష్టవశాత్తూ బషీర్ బౌలింగ్‌లోనే జైశ్వాల్ ఔటయ్యాడు. 20 ఓవర్ వేసిన బషీర్ బౌలింగ్‌లో వరుసగా రెండు ఫోర్లు బాదిన జైశ్వాల్ తర్వాతి బంతికి భారీ షాట్‌కు ప్రయత్నించి స్టంపౌటయ్యాడు. బంతిని అంచనా వేయడంలో కాస్త విఫలమైన యశస్వీ తన వికెట్‌ను సమర్పించుకున్నాడు. ఈ క్రమంలో బషీర్ సెలబ్రేషన్స్ శృతిమించాయి. జైశ్వాల్ వైపు కళ్లు పెద్దవిగా చేసి చూస్తూ సీరియస్‌గా ఎదో అన్నాడు.
జైశ్వాల్ మాత్రం అతడిని పట్టించుకోకుండా డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లిపోయాడు. కానీ నాన్ స్ట్రైక్‌లో ఉన్న రోహిత్ శర్మ మాత్రం ఎందుకు అంత ఓవరాక్షన్ అన్నట్లు రియాక్షన్ ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఇది చూసిన అభిమానులు అరే బషీర్ నీకు మా రోహిత్ చేతిలో ఉందంటూ కామెంట్లు చేస్తున్నారు.
— Virat Kohli (@CricUpdates123) March 7, 2024
Comments
Please login to add a commentAdd a comment