సిడ్నీ టెస్టులోనూ టీమిండియా బ్యాటింగ్ కష్టాలు కొనసాగుతున్నాయి. ఆస్ట్రేలియా బౌలర్ల దూకుడు కారణంగా భారత ఓపెనర్లు ఎక్కువ సేపు క్రీజులో నిలబడలేకపోయారు. కేఎల్ రాహుల్ 14 బంతులు ఎదుర్కొని కేవలం 4 పరుగులు చేసి మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో నిష్క్రమించాడు.
పట్టుదలగా నిలబడ్డ గిల్, కోహ్లి
ఇక మరో ఓపెనర్ యశస్వి జైస్వాల్ 26 బంతుల్లో పది పరుగులు చేసి స్కాట్ బోలాండ్‌కు వికెట్ సమర్పించుకున్నాడు. ఈ క్రమంలో వన్‌డౌన్ బ్యాటర్ శుబ్‌మన్ గిల్(Shubman Gill).. నాలుగో స్థానంలో వచ్చిన విరాట్ కోహ్లి(Virat Kohli)తో కలిసి ఆసీస్ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొనే ప్రయత్నం చేశాడు.
అయితే, కంగారూ జట్టు స్పిన్నర్ నాథన్ లియాన్ ఈ జోడీని విడదీశాడు. మొత్తంగా 64 బంతులు ఎదుర్కొన్న గిల్ రెండు ఫోర్ల సాయంతో 20 పరుగులు చేసి బోలాండ్ బౌలింగ్‌లో స్టీవ్ స్మిత్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు.
నిజానికి తన ఏకాగ్రతను దెబ్బతీసేందుకు ఆస్ట్రేలియా ఆటగాళ్లు పన్నిన వ్యూహంలో చిక్కిన గిల్.. ఒత్తిడిలోనే వికెట్ కోల్పోయాడని చెప్పవచ్చు. భారత తొలి ఇన్నింగ్స్ 25వ ఓవర్‌ను బోలాండ్ వేశాడు. ఐదో బంతికి షాట్ ఆడేందుకు ప్రయత్నించి గిల్ విఫలమయ్యాడు.
గిల్‌ను స్లెడ్జ్ చేసిన స్మిత్, లబుషేన్
అనంతరం గిల్ పిచ్ మధ్యలోకి వచ్చి బ్యాట్‌ను టాప్ చేస్తూ కాస్త అసహనం ప్రదర్శించాడు. ఈ క్రమంలో మార్నస్ లబుషేన్.. ఈజీ.. ఈజీగానే క్యాచ్ పట్టేయవచ్చు అని పేర్కొన్నాడు. ఇందుకు స్టీవ్ స్మిత్ స్పందిస్తూ.. ‘బుల్‌షిట్.. ఆట మొదలుపెడితే మంచిది’ అని గిల్‌ను ఉద్దేశించి అన్నాడు.
ఇచ్చి పడేసిన గిల్!
ఇందుకు బదులిస్తూ.. ‘‘నీ టైమ్ వచ్చినపుడు చూసుకో స్మితీ.. నీ గురించి ఇప్పుడు ఎవరూ ఏమీ మాట్లాడలేదే’’ అని గిల్ పేర్కొనగా.. ‘‘నువ్వైతే ఆడు’’ అని స్మిత్ గిల్‌తో అన్నాడు.
కానీ మనోడికే భంగపాటు
దీంతో 25వ ఓవర్లో ఆఖరి బంతిని ఎదుర్కొనేందుకు గిల్ సిద్ధం కాగా.. అప్పటికే మాటలు మొదలుపెట్టిన లబుషేన్.. ‘‘స్మిత్.. నీ టైమ్ వచ్చింది చూడు’’ అని అరిచాడు. ‘‘నేను అలాగే చేస్తాను చూడు’’ అని చెప్పిన స్మిత్.. గిల్ ఇచ్చిన క్యాచ్‌ను ఒడిసిపట్టాడు. అలా శుబ్‌మన్ గిల్ ఇన్నింగ్స్‌కు తెరపడింది.
ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా గిల్ అవుటైన కాసేపటికే కోహ్లి(69 బంతుల్లో 17) కూడా నిష్క్రమించగా.. రిషభ్ పంత్(40), రవీంద్ర జడేజా(26) కాసేపు పోరాటం చేశారు.
బుమ్రా మెరుపులు
ఆఖర్లో కెప్టెన్ జస్‌ప్రీత్ బుమ్రా మెరుపు ఇన్నింగ్స్(17 బంతుల్లో 3 ఫోర్లు, ఒక సిక్సర్) కారణంగా టీమిండియా గౌరవప్రదమైన స్కోరు సాధించింది. తొలి ఇన్నింగ్స్‌లో 185 పరుగులకు ఆలౌట్ అయింది.
ఆసీస్ బౌలర్లలో పేసర్లు బోలాండ్ నాలుగు, స్టార్క్ మూడు, కమిన్స్ రెండు వికెట్లు దక్కించుకోగా.. స్పిన్నర్ నాథన్ లియాన్ ఒక వికెట్ తీశాడు.
ఇదిలా ఉంటే.. వరుస వైఫల్యాల నేపథ్యంలో రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ ఆసీస్‌తో ఆఖరిదైన ఐదో టెస్టుకు దూరంగా ఉన్నాడు. అతడి స్థానంలో బుమ్రా సారథిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు.
చదవండి: CT 2025: వన్డే కెప్టెన్‌గా రోహిత్ అవుట్!.. టీమిండియా కొత్త సారథిగా అతడే!
Comments
Please login to add a commentAdd a comment