కౌలాలంపూర్: జూనియర్ పురుషుల అండర్–21 ప్రపంచకప్ హాకీ టోర్నీలో భారత్‌కు ఊహించని ఫలితం ఎదురైంది. గురువారం వరుసగా రెండో విజయం సాధించి దర్జాగా క్వార్టర్ ఫైనల్ బెర్త్ ఖరారు చేసుకోవాలని ఆశించిన యువ భారత్ గ్రూప్ ‘సి’ రెండో లీగ్ మ్యాచ్‌లో 1–4 గోల్స్ తేడాతో స్పెయిన్ చేతిలో ఓడిపోయింది. వరుసగా రెండో విజయంతో స్పెయిన్ జట్టు క్వార్టర్ ఫైనల్ బెర్త్‌ను దాదాపు ఖాయం చేసుకుంది. తొలి మ్యాచ్‌లో దక్షిణ కొరియాపై 4–2తో నెగ్గి శుభారంభం చేసిన భారత జట్టుకు రెండో మ్యాచ్‌లో స్పెయిన్ నుంచి అనూహ్య ప్రతిఘటన ఎదురైంది.
ఆట తొలి నిమిషంలోనే పాల్ క్యాబిర్ వెర్డెల్ గోల్‌తో స్పెయిన్ 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత 18వ నిమిషంలో ఆండ్రెస్ రాఫి గోల్‌తో స్పెయిన్ ఆధిక్యం 2–0కు పెరిగింది. 33వ నిమిషంలో రోహిత్ గోల్ సాధించడంతో భారత్ ఖాతా తెరిచింది. అయితే స్పెయిన్ జోరు తగ్గించకుండా ఆడుతూ ఎనిమిది నిమిషాల తర్వాత మూడో గోల్ చేసింది. పాల్ క్యాబిర్ వెర్డెల్ గోల్‌తో స్పెయిన్ 3–1తో ముందంజ వేసింది. మ్యాచ్ చివరి నిమిషంలో ఆండ్రెస్ రాఫి గోల్‌తో స్పెయిన్ 4–1తో విజయాన్ని ఖాయం చేసుకుంది. భారత జట్టుకు ఈ మ్యాచ్‌లో ఏడు పెనాల్టీ కార్నర్‌లు రాగా కేవలం ఒక దానిని సహాకీ టోర్నీ నియోగం చేసుకుంది.
మరో మ్యాచ్‌లో దక్షిణ కొరియా 4–1తో కెనడాను ఓడించి క్వార్టర్ ఫైనల్ రేసులో నిలిచింది. శనివారం జరిగే చివరి రౌండ్ లీగ్ మ్యాచ్‌ల్లో కెనడాతో భారత్; కొరియాతో స్పెయిన్ తలపడతాయి. కొరియా–స్పెయిన్ మ్యాచ్ తర్వాతే భారత జట్టు మ్యాచ్ జరుగుతుంది. ఒకవేళ స్పెయిన్ చేతిలో కొరియా ఓడితే భారత్ తమ మ్యాచ్‌ను ‘డ్రా’ చేసుకుంటే చాలు క్వార్టర్ ఫైనల్ చేరుకుంటుంది. ఒకవేళ స్పెయిన్‌పై కొరియా గెలిస్తే మాత్రం భారత్ భారీ తేడాతో కెనడాపై తప్పనిసరిగా విజయం సాధించాల్సి ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment