టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. గతేడాది జరిగిన ఆసియాకప్‌లో తొలి టీ20 సెంచరీతో చెలరేగిన విరాట్.. అనంతరం టీ20 ప్రపంచకప్, బంగ్లాదేశ్ సిరీస్‌లలో సత్తా చాటాడు. తాజగా శ్రీలంకతో జరిగిన తొలి వన్డేలో అద్భుతమైన సెంచరీ సాధించిన కోహ్లి.. క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ పలు రికార్డులను బ్రేక్ చేశాడు.
ఈ క్రమంలో అంతర్జాతీయ క్రికెట్‌లో సచిన్ 100 సెంచరీల రికార్డును కూడా కింగ్ కోహ్లి బ్రేక్ చేస్తాడు అని పలువురు భారత మాజీ క్రికెటర్‌లు అభిప్రాయపడ్డారు. ఇప్పటివరకు విరాట్ కెరీర్‌లో 73 అంతర్జాతీయ సెంచరీలు ఉన్నాయి. కాగా వన్డేల్లో 45, టెస్టుల్లో 29, టీ20ల్లో ఒక సెంచరీ ఉంది.
కాగా వన్డేల్లో సచిన్(49) సెంచరీల రికార్డుకు కోహ్లి కేవలం 4 సెంచరీల దూరంలో మాత్రమే ఉన్నాడు. రాబోయే రోజుల్లో సచిన్ వన్డేల రికార్డును విరాట్ బ్రేక్ చేసే అవకాశం ఉంది. అయితే టెస్టుల్లో సచిన్ సెంచరీల రికార్డును కోహ్లి బ్రేక్ చేయలేడని భారత మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ అభిప్రాయపడ్డాడు.
"టెస్టుల్లో సచిన్ సెంచరీల రికార్డును బద్దలు కొట్టడం కోహ్లికి కఠిన సవాలు వంటిది. వన్డేల్లో విరాట్ ఆల్‌టైమ్ గ్రేట్. అదే విధంగా టెస్టుల్లో కూడా విరాట్ అద్భుతమైన ఆటగాడు అనడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే టెస్టుల్లో సచిన్ 51 సెంచరీలు సాధించాడు. టెస్టు క్రికెట్‌లో అన్ని సెంచరీలు చేయడం అంతసులభం కాదు. కాబట్టి విరాట్‌కు ఇది అసలైన ఛాలెంజ్. కోహ్లి తన అద్భుత ఫామ్‌ను కొనసాగించి సచిన్ రికార్డును బ్రేక్ చేయాలని ఆశిస్తున్నాను" అని స్టార్ స్పోర్ట్స్ క్రికెట్ లైవ్ షోలో పేర్కొన్నారు.
చదవండి: IND vs SL: వన్డేల్లో శ్రీలంక అత్యంత చెత్త రికార్డు.. ప్రపంచంలోనే తొలి జట్టుగా
Comments
Please login to add a commentAdd a comment