
ఐసీసీ ఈవెంట్లలో టీమిండియా స్టార్ క్రికెటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి తొలిసారి ఓపెనర్లుగా బరిలోకి దిగారు. టీ20 ప్రపంచకప్ 2024లో భాగంగా ఐర్లాండ్‌తో ఇవాళ (జూన్ 5) జరుగుతున్న మ్యాచ్‌లో రోహిత్-కోహ్లి జోడీ భారత ఇన్నింగ్స్‌ను ప్రారంభించింది. ఐర్లాండ్ నిర్దేశించిన 97 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన టీమిండియాకు ఆదిలోనే షాక్ తగిలింది.
THE ICONIC ENTRY. 🥶
- Rohit & Kohli opening for India in World Cup. 🇮🇳 pic.twitter.com/Tk2KlOwyvp— Johns. (@CricCrazyJohns) June 5, 2024
నిరాశపరిచిన కోహ్లి..
రోహిత్‌తో జతగా తొలిసారి ఓపెనింగ్ చేసిన కోహ్లి 5 బంతుల్లో కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసి ఔటయ్యాడు. కోహ్లి.. మార్క్ అదైర్ బౌలింగ్‌లో బెంజమిన్ వైట్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ బాట పట్టాడు. కోహ్లి.. రోహిత్‌కు జోడీగా ఓపెనర్‌గా బరిలోకి దిగిన తొలి మ్యాచ్‌లోనే విఫలం కావడంతో భారత క్రికెట్ అభిమానులు నిరాశ చెందుతున్నారు.
దీనికి ముందు భారత బౌలర్లు మూకుమ్మడిగా విజృంభించడంతో ఐర్లాండ్ 96 పరుగులకే కుప్పకూలింది. న్యూయార్క్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టీమిండియా టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది. భారత బౌలర్లలో ముఖ్యంగా పేసర్లు ఈ మ్యాచ్‌లో ఇరగదీశారు. హార్దిక్ పాండ్యా (4-1-27-3), అర్ష్‌దీప్ సింగ్ (4-0-35-2), సిరాజ్ (3-0-13-1), బుమ్రా (3-1-6-2), అక్షర్ పటేల్ (1-0-3-1) ధాటికి ఐర్లాండ్ 16 ఓవర్లలోనే చాపచుట్టేసింది.
ఐర్లాండ్ ఇన్నింగ్స్‌లో లోర్గాన్ టక్కర్ (10), కర్టిస్ క్యాంపర్ (12), గెరాత్ డెలానీ (26), జాషువ లిటిల్ (14) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. ఆఖర్లో డెలానీ మెరుపులు మెరిపించడంతో ఐర్లాండ్ ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది. ఐర్లాండ్ ఇన్నింగ్స్‌లో ఆండ్రూ బల్బిర్నీ (5), పాల్ స్టిర్లింగ్ (2), హ్యారీ టెక్టార్ (4), జార్జ్ డాక్రెల్ (3), మార్క్ అదైర్ (3), బ్యారీ మెక్ కార్తీ (0) దారుణంగా విఫలమయ్యారు.
లక్ష్యం దిశగా సాగుతున్న భారత్..
97 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన టీమిండియా ఆడుతూపాడుతూ విజయం దిశగా దూసుకెళ్తుంది. ఆదిలోనే కోహ్లి ఔటైనా.. రోహిత్ శర్మ (28), పంత్ (10) నిలకడగా ఆడుతుండటంతో భారత్ లక్ష్యం దిశగా సాగుతుంది. 7 ఓవర్ల అనంతరం భారత్ స్కోర్ 43/1గా ఉంది. 13 ఓవర్లలో మరో 54 పరుగులు చేస్తే భారత్ విజయం సాధిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment