శ్రీలంకపై 6 వికెట్లతో విజయం
7 పరుగులిచ్చి 4 వికెట్లు తీసిన నోర్జే
న్యూయార్క్: మెరుపుల్లేవు... విధ్వంసక షాట్లు అసలే కనిపించలేదు... రెండు పెద్ద జట్ల మధ్య జరిగిన టి20 వరల్డ్ కప్ నాలుగో మ్యాచ్ కనీస వినోదాన్ని అందించలేకపోయింది. అనూహ్య బౌన్స్‌తో బ్యాటింగ్‌కు ఏమాత్రం అనుకూలంగా లేని పిచ్‌పై స్వల్ప స్కోర్లతో మ్యాచ్ ముగిసింది. ముందుగా శ్రీలంక పేలవ బ్యాటింగ్ ప్రదర్శన కనబర్చగా, చిన్న లక్ష్యాన్ని ఛేదిందుకు దక్షిణాఫ్రికా కూడా చాలా సమయం తీసుకుంది.
మొత్తం 35.3 ఓవర్ల మ్యాచ్‌లో పోరులో కేవలం 6 ఫోర్లు, 3 సిక్స్‌లు మాత్రమే వచ్చాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. మ్యాచ్‌లో ఇరు జట్లు కలిపి ఆడిన 214 బంతుల్లో 127 డాట్ బాల్స్ ఉన్నాయి. టి20 వరల్డ్ కప్ చరిత్రలో ఎక్కువ డాట్ బాల్స్ ఆడిన మ్యాచ్ ఇదే కావడం గమనార్హం.సోమవారం నాసా కౌంటీ క్రికెట్ స్టేడియంలో జరిగిన గ్రూప్ ‘డి’ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 6 వికెట్ల తేడాతో శ్రీలంకను ఓడించింది.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక 19.1 ఓవర్లలో 77 పరుగులకే కుప్పకూలింది. టి20ల్లో లంకకు ఇదే అత్యల్ప స్కోరు. కుశాల్ మెండిస్ (30 బంతుల్లో 19; 1 ఫోర్), ఏంజెలో మాథ్యూస్ (16 బంతుల్లో 16; 2 సిక్స్‌లు), కామిందు మెండిస్ (11) మాత్రమే రెండంకెల స్కోరు చేయగలిగారు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ ఆన్రిచ్ నోర్జే (4/7) తన స్పెల్‌లో ఓవర్‌కు ఒకటి చొప్పున నాలుగు వికెట్లు పడగొట్టడం విశేషం. కేశవ్ మహరాజ్ వరుస బంతుల్లో 2 వికెట్లు తీసి లంకను దెబ్బ కొట్టాడు. అనంతరం దక్షిణాఫ్రికా 16.2 ఓవర్లలో 4 వికెట్లకు 80 పరుగులు సాధించింది. డి కాక్ (27 బంతుల్లో 20; 1 సిక్స్), క్లాసెన్ (22 బంతుల్లో 19 నాటౌట్; 1 ఫోర్, 1 సిక్స్) గెలుపు తీరం చేర్చారు. హసరంగకు 2 వికెట్లు దక్కాయి.
Comments
Please login to add a commentAdd a comment