![Test is not played over 2-3 days: Rohit Sharma asserts importance ofwaiting game in Tests - Sakshi](/styles/webp/s3/article_images/2024/02/18/rohitsharma2.jpg.webp?itok=fqO8JMBm)
ఇంగ్లండ్ బజ్‌బాల్‌కు మరోసారి టీమిండియా చెక్ పెట్టింది. రాజ్‌కోట్ వేదికగా జరిగిన మూడో టెస్టులో 434 పరుగుల తేడాతో టీమిండియా భారీ విజయాన్ని అందుకుంది. 557 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్ 122 పరుగులకే కుప్పకూలింది. భారత ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా ఐదు వికెట్లతో ఇంగ్లండ్‌ను దెబ్బతీయగా.. కుల్దీప్ రెండు, అశ్విన్, బుమ్రా తలా వికెట్ సాధించారు.
ఈ మ్యాచ్‌లో ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టిన రవీంద్ర జడేజా ప్లేయర్ ఆఫ్‌ది మ్యాచ్‌గా నిలిచాడు. తొలి ఇన్నింగ్స్‌లో సైతం జడ్డూ(112) అద్భుత సెంచరీతో పాటు 2 వికెట్లు పడగొట్టాడు. జడ్డూతో పాటు యువ ఓపెనర్ యశస్వీ జైశ్వాల్(214) సంచలన ద్విశతకంతో చెలరేగాడు. ఇక ఈ విజయంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 2-1 ఆధిక్యంలోకి భారత్ దూసుకెళ్లింది. ఇక ఈ సంచలన విజయంపై మ్యాచ్ అనంతరం టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించాడు.
"టెస్టు మ్యాచ్ అనేది రెండు మూడు రోజుల్లో ముగిసిపోయేది కాదు. ఐదు రోజుల పాటు ఆడటం ఎంతో ముఖ్యమో ముందుగా అర్ధం చేసుకోవాలి. మేము ఈ మ్యాచ్‌లో అదే పనిచేశాం. ఇంగ్లండ్ సైతం తొలి ఇన్నింగ్స్‌లో బాగా ఆడి మమ్మల్ని ఒత్తిడిలోకి నెట్టింది. ముఖ్యంగా రెండో రోజు ఆటలో ఇంగ్లండ్ బ్యాటర్లు మా బౌలర్లపై ఒత్తిడి పెంచారు. కానీ మరుసటి రోజు ఆటలో మా బౌలర్లు అద్బుతమైన కమ్‌బ్యాక్ ఇచ్చారు.
అశ్విన్ వంటి అనుభవజ్ఞుడైన బౌలర్ కూడా అందుబాటులో లేనప్పటికీ మా బౌలర్లు సంచలన ప్రదర్శన కనబరిచారు. వారి ప్రదర్శన చూసి చాలా గర్వపడ్డాను. ఇక జడ్డూ తన క్లాస్‌ను మరోసారి చూపించాడు. జడేజా బంతితో పాటు బ్యాట్‌తో కూడా రాణిస్తాడని మేము ముందే ఊహించాము. సర్ఫరాజ్ అరంగేట్రంలోనే అకట్టుకున్నాడు. అతడు బ్యాట్‌తో ఏమి చేయగలడో మనం చూశాం. ఇక సెకెండ్ ఇన్నింగ్స్‌లో జైశ్వాల్, శుబ్‌మన్ గిల్ అద్బుతమైన ప్రదర్శన కనబరిచారు.
వారిద్దరూ మాకు కావాల్సిన ఆధిక్యాన్ని అందించారు. జైశ్వాల్ గురించి ఎంత చెప్పకున్న తక్కువే. అతడొక అద్బుతం.. ఇదే విషయంపై చాలా సార్లు ఇప్పటికే చెప్పాను. అతడు తన కెరీర్‌లో అద్బుతంగా ఆరంభించాడు. యశస్వీ భవిష్యత్తులో కచ్చితంగా వరల్డ్‌క్రికెట్‌ను ఏలుతాడు. ఇక ఫైనల్‌గా టాస్ కూడా మా విజయంలో కీలక పాత్ర పోషించిందని" పోస్ట్‌మ్యాచ్ ప్రేజేంటేషన్‌లో రోహిత్ పేర్కొన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment