నేడు భారత్, శ్రీలంక మధ్య తొలిపోరు
మ్యాచ్‌కు వర్షం ముప్పు
మరో క్లీన్‌స్వీప్‌పై రోహిత్ సేన దృష్టి
కోహ్లి రాకతో మరింత పటిష్టం
లంకకు కొత్తగా గాయాల బెడద
మధ్యాహ్నం గం. 2:30 నుంచి సోనీ స్పోర్ట్స్‌లో ప్రత్యక్ష ప్రసారం
కొలంబో: ఓ పరిమిత ఓవర్ల సమరాన్ని వైట్‌వాష్ చేసిన భారత జట్టు ఇప్పుడు రెట్టించిన ఉత్సాహంతో మరో ఫార్మాట్‌నూ క్లీన్‌స్వీప్ చేసేందుకు సిద్ధమైంది. ఆతిథ్య శ్రీలంకతో శుక్రవారం నుంచి మూడు వన్డేల సిరీస్ ఆరంభమవుతోంది. పొట్టి ఫార్మాట్‌లో సూర్యకుమార్, కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ కాంబినేషన్ విజయవంతమైంది. ఇప్పుడు రోహిత్–గంభీర్‌ల వంతు వచ్చి0ది. తొలి మ్యాచ్‌లో శుభారంభం చేయడం ద్వారా సిరీస్‌పై పట్టుసాధించాలని టీమిండియా భావిస్తోంది.
టి20 ప్రపంచకప్ విజయానంతరం రోహిత్, కోహ్లి ఆడుతున్న తొలి సిరీస్ ఇదే. వీరిద్దరి రాకతో పెరిగిన బ్యాటింగ్ బలం భారత జైత్రయాత్రకు కచ్చితంగా దోహదం చేస్తుందనడంలో అతిశయోక్తి లేదు. మరోవైపు సొంతగడ్డపై మూడు టి20ల్లో ఓడిన శ్రీలంక జట్టు కనీసం వన్డే ఫార్మాట్‌లోనైనా పుంజుకోవాలని ఆశిస్తోంది. మారిన ఫార్మాట్‌లో ఓటమి రాతను మార్చుకోవాలని గంపెడాశలతో బరిలోకి దిగుతోంది.
రోహిత్, కోహ్లి చేరడంతో...
భారత టాప్‌స్టార్లు రోహిత్ శర్మ, కోహ్లిలు లేని భారత జట్టు టి20 ఫార్మాట్‌లో క్లీన్‌స్వీప్ చేసింది. ఆఖరి పోరు అయితే హైలైట్! ఓటమి కోరల్లోంచి సూపర్ విజయం దాకా సూర్యకుమార్ సేన పోరాటం ఆకట్టుకుంది. అలాంటి జట్టుకు ఇప్పుడు రోహిత్, కోహ్లిలు కలవడంతో బ్యాటింగ్ దుర్బేధ్యంగా మారింది. దీంతో 20 ఓవర్లకే ఆపసోపాలు పడిన లంక బౌలర్లకు వన్డేల్లో మరింత కష్టాలు తప్పవేమో!
హార్దిక్, సూర్య వన్డే జట్టులో లేకపోవడంతో హిట్టర్లు దూబే, పరాగ్‌కు లక్కీ చాన్స్ కానుంది. మూడు వన్డేల్లో వీరిలో ఎవరికి ఎక్కువ అవకాశాలొస్తాయో చూడాలి. భారత్ ఇద్దరు స్పిన్నర్లు అక్షర్, కుల్దీప్‌లతో పాటు ముగ్గురు పేసర్ల తో బరిలోకి దిగాలనుకుంటే ఖలీల్ అహ్మద్ లేదంటే హర్షిత్ రాణాల్లో ఒకరు సిరాజ్, అర్ష్‌దీప్‌లతో బంతిని పంచుకుంటారు.
అయ్యో... కష్టాల లంక!
టి20 ఫార్మాట్‌లో చేతులెత్తేసిన శ్రీలంక ఇప్పుడు వన్డేల్లో అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. గత సిరీస్ ఫలితాన్ని పక్కనబెట్టి కొత్త ఫార్మాట్‌ను తాజాగా ఆరంభించాలనుకుంటుంది. ఓపెనర్లు నిసాంక, కుశాల్ మెండీస్ ఫామ్‌లో ఉన్నప్పటికీ... తర్వాత బ్యాటింగ్ ఆర్డర్‌లో వచ్చేవారిలో కెప్టెన్ చరిత్ అసలంక సహా ఎవరికి నిలకడే లేదు. ఇదే లంక బ్యాటింగ్ దళానికి శాపంగా మారింది. ఇప్పుడున్న కష్టాలు చాలవన్నట్లు వన్డేలకు ముందు గాయాల బెడద లంకను పీడిస్తోంది.
50 ఓవర్ల మ్యాచ్‌లకు కీలకమైన పేసర్లు పతిరణ, మదుషంక గాయాల కారణంగా దూరమయ్యారు. ఆఖరి టి20లో క్యాచ్ కోసం డైవ్ చేసిన పతిరణ కుడి మోచేతికి గాయమైంది. ఫీల్డింగ్ ప్రాక్టీస్‌లో మదుషంక ఎడమకాలి తొడ కండరాలు పట్టేయడంతో ఇద్దరు మొత్తం వన్డే సిరీస్‌కే అందుబాటులో లేకుండా పోయారు. ఇలాంటి పరిస్థితుల్లో భారత్‌ను ఎదుర్కోవడమంటే ఏటికి ఎదురీదడమే తప్ప ఏమాత్రం సులువు కానేకాదు.
పిచ్, వాతావరణం
బ్యాటింగ్‌కు అనుకూలమైన పిచ్. భారీస్కోరు ఆశించొచ్చు. అలాగే స్పిన్నర్లకు తిప్పేసే చాన్స్ ఉంది. కానీ మ్యాచ్‌కు శుక్రవారం వానముప్పు ఉంది. రోజంతా భారీవర్షం కురిసే అవకాశముందని స్థానిక వాతావరణ శాఖ తెలిపింది.
జట్లు (అంచనా)
భారత్: రోహిత్ (కెప్టెన్ ), గిల్, కోహ్లి, అయ్యర్, కేఎల్ రాహుల్/పంత్, దూబే/ పరాగ్, కుల్దీప్, అక్షర్, సిరాజ్, అర్‡్షదీప్, హర్షిత్.
శ్రీలంక: అసలంక (కెప్టెన్ ), నిసాంక, కుశాల్ మెండీస్, సమరవిక్రమ, కమిండు, జనిత్, కురణరత్నే, హసరంగ, తీక్షణ, షిరాజ్/ఇషాన్ మలింగ, ఫెర్నాండో.
Comments
Please login to add a commentAdd a comment