కేఎల్ రాహుల్ (PC: IPL)
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 సీజన్‌తో తాను కొత్త ప్రయాణం మొదలుపెట్టాలనుకుంటున్నానని టీమిండియా స్టార్ క్రికెటర్ కేఎల్ రాహుల్ తెలిపాడు. స్వేచ్ఛాయుత వాతావరణంలో తనను తాను కొత్తగా ఆవిష్కరించుకునే ప్రయత్నం చేస్తానన్నాడు. కాగా ఈ ఏడాది ఐపీఎల్ మెగా వేలం జరుగనున్న విషయం తెలిసిందే.
లక్నో సూపర్ జెయింట్స్‌ను వీడిన కేఎల్ రాహుల్
సౌదీ అరేబియాలోని జిద్దా నగరం వేదికగా నవంబరు 24, 25 తేదీల్లో వేలంపాట నిర్వహించేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ఏర్పాట్లు చేసింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే పది ఫ్రాంఛైజీలు తాము అట్టిపెట్టుకునే ఆటగాళ్ల జాబితాను విడుదల చేశాయి.
ఈ సందర్భంగా లక్నో సూపర్ జెయింట్స్‌తో కేఎల్ రాహుల్ బంధం తెంచుకున్నట్లు వెల్లడైంది. అయితే, ఇందుకు గల కారణాన్ని ఈ టీమిండియా స్టార్ తాజాగా బయటపెట్టాడు. ‘‘నా ప్రయాణాన్ని సరికొత్తగా మొదలుపెట్టాలనుకుంటున్నాను. నాకు ఉన్న ఆప్షన్లను పరిశీలించాలని భావిస్తున్నా. ముఖ్యంగా ఎక్కడైతే నాకు స్వేచ్ఛగా ఆడే వీలు ఉంటుందో అక్కడికి వెళ్లాలనుకుంటున్నాను.
కొన్నిసార్లు కఠిన నిర్ణయాలు తీసుకోకతప్పదు
అక్కడి వాతావరణం కాస్త తేలికగా, ప్రశాంతంగా ఉండగలగాలి. అందుకే మన మంచి కోసం మనమే కొన్నిసార్లు కఠిన నిర్ణయాలు తీసుకోకతప్పదు’’ అని కేఎల్ రాహుల్ ఇండియా టుడేతో పేర్కొన్నాడు. కాగా 2022లో లక్నో ఫ్రాంఛైజీ ఐపీఎల్‌లో అడుగుపెట్టింది. తమ కెప్టెన్‌గా కేఎల్ రాహుల్‌ను నియమించుకుంది.
కెప్టెన్‌గా రాణించినా
అయితే, యాజమాన్యం అంచనాలకు తగ్గట్లుగానే రాహుల్.. లక్నోను అరంగేట్ర సీజన్‌లోనే ప్లే ఆఫ్స్‌నకు చేర్చాడు. ఆ తర్వాతి ఎడిషన్‌లోనూ టాప్-4లో నిలిపాడు. అయితే, ఐపీఎల్-2024లో మాత్రం లక్నో ప్లే ఆఫ్స్‌నకు అర్హత సాధించలేకపోయింది. పద్నాలుగు మ్యాచ్‌లకు గానూ.. ఏడే గెలిచి పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో నిలిచింది.
ఇదిలా ఉంటే.. లక్నో జట్టు యజమాని, ప్రముఖ వ్యాపారవేత్త సంజీవ్ గోయెంకా ఐపీఎల్ 2024లో ఓ మ్యాచ్ సందర్భంగా.. రాహుల్‌ను అందరి ముందే తిట్టాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ చేతిలో ఘోర ఓటమిని జీర్ణించుకోలేక కెప్టెన్‌పై బహిరంగంగానే ఆగ్రహం వ్యక్తం చేశాడు.
రాహుల్‌కు ఘోర అవమానం
ఇందుకు సంబంధించిన దృశ్యాలు వైరల్ కాగా.. సంజీవ్ గోయెంకాపై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. అయితే, ఆ తర్వాత అతడు నష్టనివారణ చర్యలే చేపట్టి.. రాహుల్‌ను తన ఇంటికి ఆహ్వానించి ఫొటోలు విడుదల చేశాడు. కానీ.. అందరి ముందు జరిగిన అవమానాన్ని మర్చిపోలేకపోయిన రాహుల్ ఆ జట్టును వీడినట్లు అతడి తాజా వ్యాఖ్యల ద్వారా స్పష్టమైంది.
ఇక టీమిండియా టీ20 జట్టులో పునరాగమనమే లక్ష్యంగా తాను ఇకపై అడుగులు వేస్తానని కేఎల్ రాహుల్ ఈ సందర్భంగా తన మనసులోని మాటను వెల్లడించాడు. కాగా లక్నో తరఫున కేఎల్ రాహుల్ 2022లో 616 పరుగులు చేశాడు.
గత రెండు సీజన్లలో కలిపి 23 మ్యాచ్‌లు ఆడి 800 రన్స్ స్కోరు చేశాడు. ఇక మొత్తంగా అంతర్జాతీయ టీ20లలో రాహుల్ ఇప్పటి వరకు 72 మ్యాచ్‌లు ఆడి 2265 పరుగులు సాధించాడు.
చదవండి: CT 2025: పాకిస్తాన్ కాదు... సౌతాఫ్రికా వేదికగా ఛాంపియన్స్ ట్రోఫీ!?
Comments
Please login to add a commentAdd a comment