ICC WC 2023- Champions Trophy 2025: లక్నోలో టీమిండియాతో మ్యాచ్.. టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది.. భారత ఓపెనర్లు బ్యాటింగ్‌కు సిద్ధమయ్యారు.. ఇంగ్లండ్ పేసర్ డేవిడ్ విల్లే బౌలింగ్ అటాక్ ఆరంభించాడు.
ఆది నుంచే కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తూ.. రోహిత్ శర్మ, శుబ్‌మన్ గిల్‌లకు సవాలు విసిరాడు. ఈ క్రమంలో.. మరో పేసర్ క్రిస్ వోక్స్ 4వ ఓవర్లో గిల్‌ను బౌల్డ్ చేయడం ద్వారా ఇంగ్లండ్‌కు మంచి ఆరంభం ఇచ్చాడు.
బౌలర్లు మెరుగ్గానే ఆడారు
ఏడో ఓవర్లో మళ్లీ రంగంలో దిగిన విల్లే.. టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి రూపంలో బిగ్ వికెట్ సాధించి బ్రేక్ త్రూ ఇచ్చాడు. ఆ తర్వాత 12వ ఓవర్లో క్రిస్ వోక్స్ శ్రేయస్ అయ్యర్(4)ను మూడో వికెట్‌గా వెనక్కి పంపాడు. ఈ క్రమంలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ 36.5 ఓవర్ వరకు ఓపికగా క్రీజులో నిలబడి 87 పరుగులు సాధించాడు.
అతడికి తోడుగా వికెట్ కీపర్ బ్యాటర్ కేఎల్ రాహుల్(39), సూర్యకుమార్ యాదవ్(49) రాణించడంతో టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 229 పరుగుల నామమాత్రపు స్కోరు చేసింది.
దీంతో వరుస పరాజయాలతో డీలా పడ్డ ‘డిఫెండింగ్ చాంపియన్’ మ్యాచ్ స్వల్ప లక్ష్యాన్ని ఛేదించి గెలవడం ఖాయమే అని ఇంగ్లండ్ జట్టు అభిమానులు అంచనా వేశారు. అయితే, టీమిండియా బౌలర్ల ముందు ఇంగ్లిష్ బ్యాటర్ల పప్పులు ఉడకలేదు.
టీమిండియా బౌలర్ల దెబ్బకు తలవంచిన ఇంగ్లండ్
భారత పేసర్లు జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ ధాటికి ఇంగ్లండ్ టాపార్డర్ కుప్పకూలింది. బట్లర్ బృందం ఆట కట్టించడంలో వీరిద్దరితో పాటు తాను రేసులో ఉన్నానన్నంటూ టీమిండియా చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ మిడిలార్డర్‌ను దెబ్బకొట్టడంలో తన వంతు పాత్ర పోషించాడు.
ఇక స్పిన్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా క్రిస్ వోక్స్ రూపంలో తానూ ఓ వికెట్ తీశాడు. మొత్తంగా బుమ్రా 3, షమీ 4 వికెట్లతో దుమ్ములేపగా.. కుల్దీప్ ఇంగ్లండ్ సారథి బట్లర్, ఆల్‌రౌండర్ లియామ్ లివింగ్‌స్టోన్ రూపంలో రెండు కీలక వికెట్లు కూల్చాడు.
పాయింట్ల పట్టికలో అట్టడుగున డిఫెండింగ్ చాంపియన్
వెరసి 34.5 ఓవర్లలో 129 పరుగులకు ఆలౌట్ అయిన ఇంగ్లండ్ 100 పరుగుల తేడాతో మరో ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. టీమిండియా స్థాయిని అందుకోలేక చతికిలపడింది. వరుస ఓటములతో సెమీస్ రేసు నుంచి దాదాపుగా నిష్క్రమించి.. పాయింట్ల పట్టికలో అట్టడుగున అతుక్కుపోయింది.
ఈ నేపథ్యంలో ప్రపంచకప్-2023లో డిఫెండింగ్ చాంపియన్ అన్న హోదాకు ఏమాత్రం న్యాయంచేయక అవమానాల పాలైన ఇంగ్లండ్.. చాంపియన్స్ ట్రోఫీ-2025లో ఆడుతుందా లేదా అన్న దుస్థితికి చేరుకుంది.
అంతర్జాతీయ క్రికెట్ మండలి విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. వన్డే వరల్డ్‌కప్-2023 పాయింట్ల పట్టికలో టాప్-7లో నిలిచిన జట్లకే చాంపియన్స్ ట్రోఫీ ఆడే అర్హత దక్కుతుంది. దీంతో ఇంగ్లండ్‌కు మిగిలిన మ్యాచ్‌లలో చావోరేవో తేల్చుకోవాల్సిన పరిస్థితి.
అయితే, ఇప్పటి వరకు ఈ మెగా టోర్నీలో ఆడిన ఆరింటిలో ఐదు ఓడినప్పటికీ ఇంగ్లండ్‌కు ఇంకా టాప్-7లో నిలిచే అవకాశం ఉంది. ఆ సమీకరణలు ఇలా..
నంబర్ 1:
ఇంగ్లండ్‌కు ఈ ఈవెంట్లో ఇంకా మూడు మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. తదుపరి ఆస్ట్రేలియా, నెదర్లాండ్స్, పాకిస్తాన్‌తో బట్లర్ బృందం పోటీపడాల్సి ఉంది. ఈ మూడింటిలో రెండు తప్పక గెలవాలి.
►ఆస్ట్రేలియా ఆరంభంలో విఫలమైనా ఇప్పుడు సెమీస్ రేసులో దూసుకుపోతోంది. కాబట్టి కంగారూలపై నెగ్గాలంటే ఇంగండ్ చెమటోడ్చకతప్పదు.
►మరోవైపు.. నెదర్లాండ్స్ సౌతాఫ్రికా, బంగ్లాదేశ్‌లపై సంచలన విజయాలతో జోరు మీదుంది. మరి స్కాట్ ఎడ్వర్డ్స్ బృందాన్ని కట్టడి చేయడం బట్లర్ అండ్ కో తో అవుతుందో లేదో చూడాలి.
►ఇక పాకిస్తాన్.. నిలకడలేని జట్టుకు మారుపేరుగా పాక్‌కు అపఖ్యాతి ఉంది. ఈ టోర్నీ ఆరంభం ముందు సెమీస్ ఫేవరెట్లలో ఒకటిగా ఉన్న బాబర్ ఆజం సేన వరుస పరాజయాలతో డీలా పడింది.
►అయినప్పటికీ సాంకేతికంగా సెమీస్ రేసులో ఉండే ఛాన్స్ ఉంది కాబట్టి ఇంగ్లండ్‌తో సహా తమకు మిగిలిన అన్ని మ్యాచ్‌లలో గెలుపే లక్ష్యంగా ముందుకు వెళ్లడం ఖాయం.
నంబర్ 2:
►పాయింట్ల పట్టికలో ప్రస్తుతం ఎనిమిదో స్థానంలో ఉన్న నెదర్లాండ్స్ తమకు మిగిలిన మూడు మ్యాచ్‌లలనూ ఓడిపోవాలి. అఫ్గనిస్తాన్, ఇంగ్లండ్, టీమిండియా చేతిలో చిత్తు కావాలి.
నంబర్ 3:
►టేబుల్‌లో తొమ్మిదో స్థానంలో ఉన్న బంగ్లాదేశ్.. పాకిస్తాన్, శ్రీలంక, ఆస్ట్రేలియాలతో మిగిలిన మూడు మ్యాచ్‌లలో కనీసం రెండింట ఓడిపోవాలి.
►పై మూడు జరిగితేనే ఇంగ్లండ్ చాంపియన్స్ ట్రోఫీ-2025లో ఆడే అవకాశం ఉంటుంది. లేదంటే బట్లర్ కెప్టెన్సీ కెరీర్‌లో ఇదొక మచ్చలా మిగిలిపోతుంది.
చదవండి: WC 2023: టీమిండియా ఇక చాలు! దిష్టి తగులుతుంది.. ఆ ఒక్క గండం గట్టెక్కితే! వరల్డ్ రికార్డు మనదే
Comments
Please login to add a commentAdd a comment