ఇదేం ఫీల్డింగ్.. ధావన్ సెటైర్లు (PC: X)
ICC Cricket World Cup Warm-up Matches 2023- Pakistan vs Australia: పాకిస్తాన్ క్రికెట్ జట్టుపై టీమిండియా వెటరన్ ఓపెనర్ శిఖర్ ధావన్ వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. పాకిస్తాన్- ఫీల్డింగ్.. ఈ జంట ప్రేమకథ ఎప్పటికీ ముగిసిపోదంటూ సెటైర్లు వేశాడు. వన్డే వరల్డ్‌కప్-2023 నేపథ్యంలో బాబర్ ఆజం బృందం ఇప్పటికే భారత్‌కు చేరుకున్న విషయం తెలిసిందే.
ఈ క్రమంలో హైదరాబాద్‌లో సన్నాహక మ్యాచ్‌లు ఆడుతోంది. ఇందులో భాగంగా న్యూజిలాండ్‌తో తొలి వార్మప్ మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో ఓడిన పాక్.. మంగళవారం(అక్టోబరు 3) ఆస్ట్రేలియాతో తలపడుతోంది.
ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆసీస్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఆల్‌రౌండర్ గ్లెన్ మాక్స్‌వెల్ (77), కామెరాన్ గ్రీన్(50- నాటౌట్) హాఫ్ సెంచరీలతో చెలరేగడం సహా మిగతా బ్యాటర్లలో అలెక్స్ క్యారీ మినహా మిగతా వాళ్లంతా రాణించారు.
మిస్‌ఫీల్డింగ్.. వీడియో వైరల్
ఈ క్రమంలో నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 351 పరుగుల భారీ స్కోరు చేసింది కంగారూ జట్టు. పాక్ బౌలర్ల, ఫీల్డర్ల తప్పిదాలను క్యాష్ చేసుకుని పటిష్ట స్థితిలో నిలిచింది. ఈ క్రమంలో ఆసీస్‌తో మ్యాచ్‌లో పాక్ ఫీల్డర్లు మహ్మద్ వాసిం జూనియర్, మహ్మద్ నవాజ్ సమన్వయలోపంతో ఎక్స్‌ట్రా పరుగులు ఇవ్వడం ఆ జట్టు అభిమానులకు చిరాకు తెప్పించింది.
పాకిస్తాన్- ఫీల్డింగ్.. నెవర్ ఎండింగ్ లవ్‌స్టోరీ
ఇందుకు సంబంధించిన వీడియోను హైలైట్ చేస్తూ.. ‘‘పాకిస్తాన్- ఫీల్డింగ్.. నెవర్ ఎండింగ్ లవ్‌స్టోరీ’’ అంటూ ధావన్ ఎక్స్ ఖాతాలో పోస్ట్ పెట్టాడు. గబ్బర్ కామెంట్ నెట్టింట వైరల్‌గా మారింది. లైకులు, షేర్లతో దూసుకుపోతోంది. కాగా పాక్ టీమ్‌కు ఇలాంటివి కొత్తేం కాదు. మిస్‌ఫీల్డింగ్ కారణంగా ఆ జట్టు భారీ మూల్యం చెల్లించిన సందర్భాలెన్నో ఉన్నాయి.
ఇదిలా ఉంటే.. వన్డే వరల్డ్‌కప్-2023 భారత జట్టులో శిఖర్ ధావన్‌కు చోటు దక్కలేదన్న విషయం తెలిసిందే. శుబ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్ వంటి యువకులతో పోటీలో ఈ వెటరన్ ఓపెనర్ వెనుబడిపోయాడు. ఇక అక్టోబరు 5 నుంచి భారత్ వేదికగా ఈ మెగా టోర్నీ ఆరంభం కానుండగా.. టీమిండియా అక్టోబరు 8న తమ తొలి మ్యాచ్ ఆడనుంది. ఆస్ట్రేలియాతో చెన్నైలో పోటీ పడనుంది. ఇక అక్టోబరు 14న చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌ను ఢీకొట్టనుంది.
చదవండి: 1987లో జన్మించిన కెప్టెన్‌దే ఈసారి వరల్డ్‌కప్ ట్రోఫీ! లిస్టులో ఎవరంటే!
Pakistan & fielding never ending love story 🥰😄😄 #PakistanFielding #PakCricket pic.twitter.com/AJzT90hgNM
— Shikhar Dhawan (@SDhawan25) October 3, 2023
Comments
Please login to add a commentAdd a comment