ఈ పిల్లలు ఉన్నారే.. వారెవ్వా!.. ఎవ్వరూ తగ్గేదేలే! | Ye Aajkal Ke Bacche: Rohit Praises Jaiswal Sarfaraz Jurel Like Only He Can | Sakshi
Sakshi News home page

ఈ పిల్లలు ఉన్నారే.. వారెవ్వా!.. తానే డబుల్‌ సెంచరీ చేసినట్లుగా సర్ఫరాజ్‌..

Published Mon, Feb 19 2024 3:44 PM | Last Updated on Mon, Feb 19 2024 4:36 PM

Ye Aajkal Ke Bacche: Rohit Praises Jaiswal Sarfaraz Jurel Like Only He Can - Sakshi

రోహిత్‌ శర్మ కామెంట్‌ వైరల్‌ (PC: BCCI)

ఒకరు డబుల్‌ సెంచరీతో చెలరేగితే.. మరొకరు ధనాధన్‌ ఇన్నింగ్స్‌తో.. ఇంకొకరేమో అద్భుతమైన వికెట్‌ కీపింగ్‌ నైపుణ్యాలతో అదరగొట్టారు. జట్టు విజయంలో తమ వంతు పాత్ర పోషించి అందరిచే ప్రశంసలు అందుకుంటున్నారు.

ఆ ముగ్గురు మరెవరో కాదు టీమిండియా యువ క్రికెటర్లు యశస్వి జైస్వాల్‌, సర్ఫరాజ్‌ ఖాన్‌, ధ్రువ్‌ జురెల్‌. 22 ఏళ్ల లెఫ్టాండ్‌ బ్యాటర్‌ యశస్వి ఇప్పటికే భారత టెస్టు జట్టు ఓపెనర్‌గా పాతుకుపోయాడు.

కెప్టెన్‌ రోహిత్‌ శర్మకు జోడీగా అద్భుత ప్రదర్శనలతో ఆకట్టుకుంటూ ముందుకు సాగుతున్నాడు. ఇక ఇంగ్లండ్‌తో సొంతగడ్డపై టెస్టు సిరీస్‌లో భాగంగా వైజాగ్‌ టెస్టులో ద్విశతకం బాదిన ఈ ముంబై బ్యాటర్‌.. రాజ్‌కోట్‌లో జరిగిన మూడో టెస్టులోనూ డబుల్‌ సెంచరీతో మెరిశాడు.

ఆకాశమే హద్దుగా చెలరేగి 214 పరుగులతో అజేయంగా నిలిచాడు. మరోవైపు.. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ముంబై బ్యాటర్‌ సర్ఫరాజ్‌ ఖాన్‌ ఎట్టకేలకు రాజ్‌కోట్‌ మ్యాచ్‌ సందర్భంగా అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టాడు.

తొలి ఇన్నింగ్స్‌లో 48 బంతుల్లోనే అర్ధ శతకం బాదిన ఈ 26 ఏళ్ల రైట్‌హ్యాండర్‌.. 62 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద దురదృష్టవశాత్తూ రనౌట్‌ అయ్యాడు. అయితే, రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం 68 పరుగులతో అజేయంగా నిలిచాడు సర్ఫరాజ్‌ ఖాన్‌.

మరో ఎండ్‌లో ఉన్న యశస్విని ఆద్యంతం ప్రోత్సహిస్తూ.. అతడు ద్విశతకం పూర్తి చేసుకోగానే తానే ఆ ఇన్నింగ్స్‌ ఆడినంత సంబరంగా సెలబ్రేట్‌ చేసుకున్నాడు. ఇన్నింగ్స్‌ డిక్లరేషన్‌ తర్వాత యశస్విని ముందుండి నడవమంటూ డ్రెసింగ్‌రూం వైపు దారి చూపాడు.

ఇక 23 ఏళ్ల ధ్రువ్‌ జురెల్‌ సైతం ఈ మ్యాచ్‌తోనే అరంగేట్రం చేశాడు. కేఎస్‌ భరత్‌ స్థానంలో వికెట్‌ కీపర్‌గా స్థానం దక్కించుకున్న అతడు.. తొలి ఇన్నింగ్స్‌లో 46 పరుగులతో రాణించాడు. ఇక రెండో ఇన్నింగ్స్‌లో ఈ యూపీ ఆటగాడికి బ్యాటింగ్‌ చేసే అవకాశం రాలేదు.

అయితే, అద్భుత రనౌట్‌ చేసి సత్తా చాటాడు. ఇంగ్లండ్‌ డేంజరస్‌ బ్యాటర్‌ బెన్‌ డకెట్‌ను పెవిలియన్‌కు పంపడంలో కీలక పాత్ర పోషించాడు. ఇలా ఈ ముగ్గురు టీమిండియా చారిత్రాత్మక విజయంలో తమ వంతు భూమిక పోషించడంపై కెప్టెన్‌ రోహిత్‌ శర్మ హర్షం వ్యక్తం చేశాడు.  

‘‘ఈ తరం పిల్లలు ఉన్నారే’’ అంటూ ప్రశంసలు కురిపిస్తూ.. ఒకే ఫ్రేములో ముగ్గురూ కనిపించేలా ఉన్న ఫొటోను హిట్‌మ్యాన్‌ ఇన్‌స్టా స్టోరీలో పంచుకున్నాడు. ‌చప్పట్లు కొడుతున్న ఎమోజీని ఇందుకు జతచేశాడు రోహిత్‌ శర్మ. 

కాగా మూడో టెస్టులో విజయంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో టీమిండియా 2-1తో ముందంజ వేసింది. తదుపరి.. రాంచి వేదికగా ఫిబ్రవరి 23 నుంచి ఇంగ్లండ్‌తో మొదలుకానున్న నాలుగో టెస్టుకు సన్నద్ధం కానుంది.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement