ఉదయగిరి: టీడీపీ ఉదయగిరి టికెట్ కాకర్ల సరేష్‌కు ఇవ్వడంతో మాజీ ఎమ్మెల్యే, ఆ పార్టీ ఉదయగిరి నియోజకవర్గ ఇన్‌చార్జి బొల్లినేని రామారావు అధిష్టానంపై ఫైర్ అయ్యారు. ‘కాకర్ల ఎలా గెలుస్తారో నేను చూస్తా.. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి నా సత్తా ఏంటో చూపిస్తా.. పన్నెండేళ్లుగా పార్టీ కోసం సర్వం అర్పించా.. ఉదయగిరిలో పార్టీకి దిక్కు లేని సమయంలో పార్టీని, క్యాడర్‌ను కాపాడుకున్నా.. ఆర్థికంగా ఎంతో నష్టపోయా.. ఇప్పుడు డబ్బు సంచులకు అమ్ముడుపోయి, కనీసం రాజకీయ అనుభవం లేని వ్యక్తికి ఉదయగిరి టికెట్ ఇచ్చి నా గొంతు కోశారు..’ అంటూ తన ఆంతరంగికుల వద్ద బొల్లినేని రామారావు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఉదయగిరిలో బొల్లినేని శుక్రవారం టీడీపీ కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో చంద్రబాబు తనను మోసం చేయరు అని చెప్పి 12 గంటలు గడవక ముందే నియోజకవర్గ అభ్యర్థిగా కాకర్ల సురేష్ పేరు ప్రకటించడంతో బొల్లినేని షాక్‌కు గురయ్యారు.
నమ్మిన వారిని నట్టేట ముంచే గుణం ఉన్న చంద్రబాబు బొల్లినేని విషయంలో అలాగే చేశారని ఆయన అనుచరులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘ఉదయగిరి నుంచి మా నాయకుడు బొల్లినేని బరిలో ఉంటారు.. ఇక్కడ చంద్రబాబు ఆటలు సాగవు.. కాకర్ల సురేష్ పేరును వెంటనే విత్‌డ్రా చేసుకుని బొల్లినేనిని అభ్యర్థిగా ప్రకటించాలి.. లేకపోతే మా సత్తా ఏంటో ఎన్నికల్లో చూపిస్తాం..’ అంటూ బొల్లినేని అనుచర వర్గం తీవ్ర ఆగ్రవేశాలతో రగిలిపోతున్నారు. ఉదయగిరిలో ఎన్ని ఊర్లు ఉన్నాయో, ఏ పంచాయతీలో టీడీపీ నాయకుడు ఎవరో కూడా తెలియని వ్యక్తికి టికెట్ ఎలా ప్రకటిస్తారంటూ టీడీపీ అధిష్టానంపై విరుచుకుపడుతున్నారు. ‘లోకేశ్ డబ్బులు తీసుకొని టికెట్ అమ్ముకున్నారు.. కాకర్లను ఎలా గెలిపిస్తారో చూస్తాం.. మీరేమీ అధైర్యపడొద్దు’ అంటూ బొల్లినేనికి ఆయన అనుచరులు ధైర్యం చెప్పినట్లు తెలుస్తోంది.
చంద్రబాబుపై ఫైర్
టీడీపీ జాబితా మరో గంటలో ప్రకటించే ముందు చంద్రబాబు బొల్లినేనికి ఫోన్ చేసి.. ‘కాకర్ల సురేష్‌కు ఉదయగిరి టికెట్ ఇస్తున్నాం.. మీకు రాజ్యసభ సీటు ఇస్తాం’ అని చెప్పబోతుండగా బొల్లినేని తీవ్రంగా స్పందించినట్లు సమాచారం. ఇన్నేళ్లుగా తనను వాడుకొని, ఇప్పుడు కరివేపాకులా తీసిపడేయడం ఏంటని గట్టిగా అధినేతపై ఫైర్ అయినట్లు తెలిసింది. అయితే చంద్రబాబు వారించేందుకు ప్రయత్నించగా.. ఉదయగిరిలో టీడీపీ ఎలా గెలుస్తుందో చూస్తానంటూ బొల్లినేని ఫోన్ కట్ చేసినట్లు సమాచారం. వెంటనే తన అనుచరులతో మాట్లాడుతూ ‘కాకర్లను ఓడించి తీరాలి.. అవసరమైతే స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలబడి మన సత్తా చూపిద్దాం..’ అని బొల్లినేని అన్నట్లు తెలిసింది. త్వరలో సమావేశం నిర్వహించి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని అనుచరులతో అన్నట్లు సమాచారం. చంద్రబాబు తనకు చేసిన అన్యాయాన్ని జీర్ణించుకోలేని బొల్లినేని వైఎస్సార్‌పీపీ పెద్దలతో టచ్‌లోకి వెళ్లినట్లు తెలిసింది.
రాజీనామా బాటలో బొల్లినేని అనుచరులు
టీడీపీ ఉదయగిరి టికెట్ కాకర్ల సురేష్‌కు ప్రకటించడంతో తీవ్రంగా రగిలిపోతున్న బొల్లినేని అనుచరుల్లో కొంతమంది ఆ పార్టీకి, పార్టీ పదవులకు రాజీనామాలు చేస్తున్నారు. టీడీపీ దుత్తలూరు మండల కేంద్రం ఇన్‌చార్జి కండగుంట్ల వెంకటరెడ్డి పదవికి రాజీనామా చేశారు. ఇదే బాటలో మరి కొంతమంది ఉన్నట్లు తెలుస్తోంది. పలు మండలాల్లో ఆదివారం సమావేశాలు నిర్వహించి పార్టీకి, పదవులకు రాజీనామాలు చేసే యోచనలో ఉన్నట్లు అసమ్మతి నేతలు చెబుతున్నారు. మొత్తమ్మీద ఉదయగిరి టీడీపీ టికెట్ ప్రకటన కాకర్ల వర్గీయుల్లో ఆనందాన్ని నింపితే.. బొల్లినేని వర్గీయులను నిరుత్సాహానికి గురిచేసింది. ఈ పరిణామం పార్టీకి తీవ్ర నష్టం చేకూరుస్తుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment