టీడీపీకి టన్నుల్లో భయం | Sakshi
Sakshi News home page

టీడీపీకి టన్నుల్లో భయం

Published Sun, May 5 2024 2:55 AM

టీడీపీకి టన్నుల్లో భయం

సాక్షి ప్రతినిధి, నెల్లూరు: క్షేత్రస్థాయిలో టీడీపీ గ్రాఫ్‌ పాతాళానికి పడిపోయింది. ప్రధానంగా నెల్లూరు సిటీ టీడీపీ అభ్యర్థి పొంగూరు నారాయణకు ఒక సామాన్యుడి చేతిలో ఓటమి తప్పెటట్లు లేదనే భయం వెంటాడుతోంది. దీంతో టీడీపీ ప్రచారకర్తలందరూ నెల్లూరు సిటీలో వరుసపెట్టి మోహరించి ప్రచారం చేస్తున్నారు. సినీగ్లామర్‌ ఉన్న నందమూరి బాలకృష్ణ రోడ్‌షో నిర్వహించగా, ఆ పార్టీ అధినేత చంద్రబాబు ముస్లింలతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఆ తర్వాత లోకేశ్‌తో క్రియేటివిటీ ప్రొగ్రాం పెట్టించారు. మరో వైపు టీడీపీ వేసుకుంటున్న సెల్ఫ్‌ గోల్స్‌తో ఆ పార్టీ గ్రాఫ్‌ మరింతగా పడిపోయింది. పోలింగ్‌ తేదీ దగ్గర పడుతుండడంతో ఓటమి భయంతో మరోసారి చంద్రబాబు, పవన్‌కళ్యాణ్‌తో ప్రచారం చేయించారు.

టీడీపీ మేకపోతు గాంభీర్యం

గెలుపు మాదే అంటూ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్న టీడీపీ అంతర్లీనంగా ఓటమి తప్పదని నిర్ధారణకు వచ్చినట్లు ఉంది. అందుకే టీడీపీ క్యాంపెయినర్లు మొత్తాన్ని తీసుకువచ్చి ప్రచారం చేయిస్తోందని నగర ప్రజలు చర్చించుకుంటున్నారు. క్షేత్ర స్థాయిలో వైఎస్సార్‌సీపీ బలంగా ఉంది. ప్రధానంగా నెల్లూరు సిటీలో గత రెండు దఫాల ఎన్నికల్లోనూ ఆ పార్టీ విజయకేతనం ఎగురవేసింది. ఈ దఫా ఆ పార్టీ అధిక శాతం ఓటింగ్‌ ఉన్న ముస్లింల్లో ఒకరైన అతి సామాన్యుడికి సీటు ఇచ్చి బరిలో దింపింది. గడిచిన ఐదేళ్లుగా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అందించిన సంక్షేమం, ముఖ్యంగా కరోనా సమయంలో పనులు దొరకని పరిస్థితుల్లో ఆదుకున్న వైనంతో సామాన్య ప్రజల గుండెల్లో ఆ పార్టీ బలంగా నాటుకుపోయింది. బలంగా ఉన్న వైఎస్సార్‌సీపీని ఎదుర్కొనేందుకు టీడీపీ అభ్యర్థి నారాయణ రెండు వేల మంది సొంత టీమ్‌తో నిత్యం డోర్‌ టు డోర్‌ తిప్పుతున్నాడు. టీడీపీ అధికారంలో వస్తే మీకు ఈ విధంగా మేలు జరుగుతుందని చెబుతున్నా.. ప్రజలు నమ్మడం లేదు. ఓట్లకు నోట్లు ఇస్తామని చెబుతున్నా.. ఓట్లేస్తారనే నమ్మకం కనిపించడం లేదు. దీంతో బెంబేలెత్తుతున్న నారాయణ దింపుడు కల్లం ఆశతో చంద్రబాబు, పవన్‌ ప్రచారానికి తెచ్చుకున్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

జెండాలు తప్ప.. జన‘సేన’ ఏదీ?

టీడీపీ అభ్యర్థి నారాయణ తనకు పక్కలో బల్లెంలా ఉన్న శత్రు శేషం లేకుండా చేయడానికి నెల్లూరు సిటీ నియోజకవర్గంలో జనసేన పార్టీని కూకటి వేళ్లతో సహా పెకళించేశారు. ఏకంగా పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న నేతనే పోమ్మనలేక.. పొగబెట్టి బయటకు వెళ్లేలా చేశారు. ఇప్పటికే ఆ పార్టీలోని క్రియాశీలక నేతలందరూ జనసేనకు గుడ్‌బై చెప్పేశారు. తన ప్రచారంలో జనసేన జెండాలు తప్ప.. జన‘సేన’ ఎక్కడా కనిపించడం లేదు. తాజాగా పవన్‌కళ్యాణ్‌తో ప్రచారం చేయించినప్పటికీ, ఆ పార్టీ కేడర్‌తో పాటు అభిమానులు సైతం డుమ్మా కొట్టారు. పవన్‌ సభకు అభిమానులు పలుచగా హాజరు కావడం చూస్తే టీడీపీకి ఓట్లు వేయడానికి సిద్ధంగా లేరని అర్థమవుతోంది. సినీనటుడిగా ఆయన్ను అభిమానిస్తాం కానీ.. ఓట్లు మాత్రం వేయబోమని స్పష్టం చేస్తున్నారు. జనసేనను అభిమానించిన కుటుంబాలకు సైతం వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం సంక్షేమ ఫలాలు అందించింది. ఇప్పుడు ఆ పార్టీ ఓడిపోతే జరిగే నష్టం తమకే అని పవన్‌కళ్యాణ్‌ అభిమానులు బాహాటంగా చెబుతున్నారు. క్షేత్రస్థాయిలో ఇలాంటి పరిస్థితులు నెలకొన్నప్పుడు పవన్‌కళ్యాణ్‌తో చేయించిన ప్రచారంతో టీడీపీకి పెరిగే ఓట్ల గ్రాఫ్‌ ఏమీ ఉండబోదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

సార్వత్రిక ఎన్నికలకు పట్టుమని వారం రోజులు కూడా లేవు. గత ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ జిల్లాను క్లీన్‌ స్వీప్‌ చేసింది. ప్రస్తుత ఎన్నికల్లోనూ అదే గాలి ఇంకా బలంగా వీస్తుండడంతో టీడీపీలో వణుకు పుడుతోంది. ఆ పార్టీ అభ్యర్థుల్లో టన్నుల్లో భయం కనిపిస్తోంది. ప్రధానంగా నెల్లూరు సిటీ నియోజకవర్గంలో సామాన్యుడైన వైఎస్సార్‌సీపీ అభ్యర్థి చేతిలో శ్రీమంతుడైన టీడీపీ అభ్యర్థి పొంగూరు నారాయణ ఓటమి ఖాయమా? అంటే.. క్షేత్రస్థాయిలో అవుననే సమాచారం ఉండడంతో ఆ పార్టీ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. అందుకే టీడీపీ క్యాంపెయినర్లు నెల్లూరులో మోహరించారని సామాన్య ప్రజల్లో చర్చ జరుగుతోంది.

నెల్లూరు నగర టీడీపీ అభ్యర్థి బెంబేలు

సామాన్యుడైన వైఎస్సార్‌సీపీ అభ్యర్థికి

జై కొడుతున్న జనం

టీడీపీ డబ్బులకు లొంగని సామాన్య ప్రజలు

అందుకే మోహరించిన పచ్చదండు

తొలుత బాలకృష్ణ, ఆ తర్వాత చంద్రబాబు ముస్లింలతో ఆత్మీయ సమావేశం

మొన్న లోకేశ్‌.. నిన్న చంద్రబాబు,

పవన్‌కళ్యాణ్‌తో హడావుడి

Advertisement
Advertisement