దళితులపై దాడి.. టీడీపీ నేతలపై కేసు | Sakshi
Sakshi News home page

దళితులపై దాడి.. టీడీపీ నేతలపై కేసు

Published Tue, May 7 2024 5:00 AM

-

కందుకూరు: లింగసముద్రం మండలం పెదపవని గ్రామ దళితులపై దాడి చేసిన నలుగురు తెలుగుదేశం నాయకులపై కేసు నమోదు చేసినట్లు లింగసముద్రం ఎస్సై ఎం.బాజీబాబు తెలిపారు. సోమవారం ఆయన వివరాలు వెల్లడించారు. ఆదివారం రాత్రి పెదపవని గ్రామంలో టీడీపీ అభ్యర్థి ఇంటూరి నాగేశ్వరరావు ప్రచారం నిర్వహించారు. ఈ క్రమంలో ఎస్సీ కాలనీలో వైఎస్సార్‌సీపీ సానుభూతిపరుల ఇళ్ల వద్ద టీడీపీ నాయకులు కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. ఇదేమని అడిగిన పాపానికి ఆ పార్టీ వారిపై టీడీపీ నాయకులు, కార్యకర్తలు దాడి చేశారు. కె.కోటేశ్వరరావు, చరణ్‌ అనే ఇద్దరికి తీవ్ర గాయాలయ్యారు. కందుకూరులోని ఏరియా వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు. కోటేశ్వరరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు టీడీపీ నాయకులు రామిశెట్టి మాలకొండయ్య, గొర్రెపాటి సాంబయ్య, తాటిపర్తి దిలీప్‌, కృష్ణపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. అదే సందర్భంలో టీడీపీ నాయకులిచ్చిన ఫిర్యాదు మేరకు వైఎస్సార్‌సీపీకి చెందిన కొంతమందిపై కేసు నమోదు చేశారు.

కుటుంబ కలహాలతో

వ్యక్తి బలవన్మరణం

నెల్లూరు సిటీ: కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ వ్యక్తి బలవన్మరణానికి పాల్పడిన ఘటన ఆదివారం జరిగింది. పోలీసుల కథనం మేరకు.. రూరల్‌ మండలంలోని గుండ్లపాళెం గ్రామంలో ఎన్‌.బాబు (53) నివాసం ఉంటున్నాడు. అతని కుమారుడు సురేష్‌, కోడలికి మధ్య విభేదాలున్నాయి. దీంతో ఇటీవల కోడలు తన తల్లి ఇంటికి వెళ్లిపోయింది. బాబు వెళ్లి కాపురానికి రావాలని కోరగా ఆమె నిరాకరించింది. అప్పటి నుంచి అతను ఫూటుగా మద్యం తాగుతూనే ఉన్నాడు. ఆదివారం మత్తులో గడ్డి మందు తాగాడు. స్థానికులు గమనించి కుటుంబసభ్యులకు తెలియజేశారు. అప్పటికే మృతిచెందాడు. సోమవారం సురేష్‌ రూరల్‌ పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

తల్లి మరణంతో

కుంగిపోయి..

తనయుడి ఆత్మహత్య

నెల్లూరు(క్రైమ్‌): తల్లి మరణంతో కుంగిపోయిన ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన నెల్లూరులో సోమవారం జరిగింది. పోలీసుల కథనం మేరకు.. నగరంలోని కామాటివీధికి చెందిన మోహన్‌ మురళి, దాక్షాయణి దంపతులకు ఇద్దరు సంతానం. కుమార్తెకు వివాహమై వేరుగా ఉంటోంది. కుమారుడు సర్వజ్ఞ (26) బీటెక్‌ పూర్తి చేసి ఆర్టీసీ బస్టాండ్‌ సమీపంలోని ఏ1 ల్యాప్‌టాప్‌ సర్వీస్‌ సెంటర్‌లో పనిచే స్తున్నాడు. దాక్షాయణి ఏడాది క్రితం మృతిచెందింది. తల్లి మృతితో సర్వజ్ఞ మానసికంగా కుంగిపోయారు. తండ్రి అతడిని ఓదారుస్తున్నా ఫలితం లేకుండా పోయింది. సోమవారం మోహన్‌ మురళి కుమారుడికి నగదు ఇచ్చి టిఫిన్‌ చేయమని చెప్పి ఇంట్లో నుంచి బయటకు వెళ్లాడు. సర్వజ్ఞ చీరతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయాన్ని గమనించిన బంధువులు ఇంటి వెనుక వైపు తలుపు పగులగొట్టి అతడిని కిందకు దించి వెంటనే చికిత్స ఓ ప్రైవేట్‌ హాస్పిటల్‌కు తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే సర్వజ్ఞ మృతిచెందాడని నిర్ధారించారు. బాధిత తండ్రి సంతపేట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇన్‌స్పెక్టర్‌ ఎ.సుబ్బరాజు హాస్పిటల్‌కు చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. శవపరీక్ష నిమిత్తం జీజీహెచ్‌కు తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.

 
Advertisement
 
Advertisement