మట్టి తవ్వకం.. వెంచర్లకు పంపకం | Sakshi
Sakshi News home page

మట్టి తవ్వకం.. వెంచర్లకు పంపకం

Published Thu, May 9 2024 4:45 AM

మట్టి తవ్వకం.. వెంచర్లకు పంపకం

సాక్షి ప్రతినిధి, నెల్లూరు: మైపాడులో కోట్లాది రూపాయల విలువజేసే మట్టిని కొల్లగొట్టేందుకు స్కెచ్‌ వేసిన భూబకాసురుడు దువ్వూరు కల్యాణ్‌రెడ్డి.. దాన్ని చేజిక్కించుకోవడంలో సఫలీకృతులయ్యారు. పేరుకు ఇరిగేషన్‌, రెవెన్యూ నుంచి అనుమతులు పొంది.. పరిమితులను పక్కనబెట్టి యంత్రాల సాయంతో రాత్రీ, పగలనే తేడా లేకుండా ఇష్టానుసారంగా మట్టిని తవ్వించారు. ఆపై తీర ప్రాంతంలోని రియల్‌ ఎస్టేట్‌ వెంచెర్లకు వీటిని విక్రయించి భారీగా సంపాదించారు.

అనుకూలంగా మార్చుకొని..

వాస్తవానికి మైపాడు చెరువు నుంచి మైపాడు, కొరుటూరు తదితర గ్రామాల్లోని పొలాలకు సాగునీరందుతోంది. దీంతో ఈ చెరువులో మట్టిని తవ్వి మరమ్మతులు చేపడితే నీటి నిల్వతో భూగర్భ జలాలు పెరిగేందుకు అవకాశం ఉంటుంది. ఈ తరుణంలో తవ్వకాలకు ప్రభుత్వం అనుమతులిచ్చింది. నిబంధనల మేరకు తవ్విన మట్టిని రైతుల అవసరాలకే వినియోగించుకోవాలి. అయితే దీన్ని తనకు అనుకూలంగా మార్చుకొని మైపాడుకు చెందిన దువ్వూరు కల్యాణ్‌రెడ్డి భారీగా వెనుకేసుకున్నారు. ఇలా దాదాపు రూ.రెండు కోట్లకుపైగా అక్రమంగా సంపాదించారు.

భారీగా గుంతలు

ఆయకట్టును దృష్టిలో ఉంచుకొని ఈ తవ్వకాలను చేపట్టాల్సి ఉంది. అయితే దీనికి విరుద్ధంగా భారీగా చేపట్టారు. చెరువు నుంచి బయటకు తీసుకెళ్లడం సులభంగా ఉండటంతో వీరి ఆగడాలకు అడ్డూఅదుపూ లేకుండాపోయింది. ఈ క్రమంలో 30, 40 అడుగుల లోతులో భారీ గుంతలు ఏర్పడ్డాయి. చెరువులో పాడి రైతులు పశువులను మేపుతుంటారు. ఈ తరుణంలో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని ఆందోళన చెందుతున్నారు.

రియల్‌ ఎస్టేట్‌ వెంచర్‌కు దారి

పంచాయతీ పరిధిలోని సుమారు 20 ఎకరాల్లో లేఅవుట్‌ను వేశారు. ప్రధాన రహదారి నుంచి ఈ లేఅవుట్‌కు వెళ్లాలంటే ఎనిమిది అడుగుల దారి మాత్రమే ఉంది. దీంతో కల్యాణ్‌రెడ్డిని సదరు యజమానులు కలిసి నగదును ముట్టజెప్పడంతో సుమారు 40 అడుగుల మేర దారిని లేఅవుట్‌కు కల్పించారు. శివాలయ భూమిలో ఈ దారిని ఏర్పాటు చేసినా చైర్మన్‌ కనుపూరు సురేంద్ర నోరు మెదపలేదు. ఆయనకూ నగదును ముట్టజెప్పారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మట్టిని అమ్ముకొని డబ్బును సంపాదించడంపైనే దృష్టి పెట్టిన కల్యా ణ్‌రెడ్డి.. గ్రామాభివృద్ధిపై దృష్టి పెట్టలేదని స్థానికులు పేర్కొంటున్నారు.

బెదిరించి.. ఆపై ఆక్రమించి

ప్రకృతి వనరులను కొల్లగొడుతూ కొందరు భూబకాసురులు రాజ్యమేలుతున్నారు. దోపిడీకి కాదేదీ అనర్హమనే రీతిలో చెలరేగిపోతూ మైపాడు చెరువులో కోట్లాది

రూపాయల విలువజేసే మట్టిని మింగేశారు. దీన్ని రియల్‌ ఎస్టేట్‌ వెంచర్లకు తరలించి భారీగా సొమ్ము చేసుకున్నారు. బడుగు, బలహీనవర్గాలకు చెందిన వారి భూములను లక్ష్యంగా చేసుకొని ఈ దమనకాండకు తెరదీశారు. ఊళ్లో పెద్ద మనిషిగా చెలమణీ అయ్యే కల్యాణ్‌రెడ్డి కనుసన్నల్లో ఈ అక్రమాలు అడ్డూఅదుపులేకుండా సాగాయి.

మైపాడులో భూబకాసురుడు

కల్యాణ్‌రెడ్డి కనుసన్నల్లో

భారీగా అక్రమాలు

పరిమితుల్లేకుండా చెరువులో

యథేచ్ఛగా తవ్వకాలు

రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులకు విక్రయం

బడుగు, బలహీనవర్గాల

భూముల్లో దౌర్జన్యం

చెరువులో కొద్దిపాటి పొలంలో నిరుపేదలు వ్యవసాయం చేసుకొని కాలం గడుపుతుంటారు. అయితే వీరిని లక్ష్యంగా చేసుకొని దౌర్జన్యంగా పొలాలను అక్రమంచి లోతుగా తవ్వేశారు. దీనిపై ప్రశ్నిస్తే కల్యాణ్‌రెడ్డి అనుచరులు దౌర్జన్యానికి తెగబడుతున్నారు. ఊళ్లో పెద్ద మనిషి కావడంతో ఎదురు మాట్లాడలేకపోతున్నారు. తమ పొట్టగొట్టొద్దని కోరినా ఆయన కనికరించడంలేదు. ఈ చెరువు మట్టిని కల్యాణ్‌రెడ్డి అనుచరుడు, మత్స్యకార నేత నరసింహ తమ అవసరాలకు తరలించారు.

Advertisement
Advertisement