వేర్వేరు చోట్ల ఇద్దరు అదృశ్యం
నెల్లూరు(క్రైమ్): వేర్వేరు ప్రాంతాల్లోని ఇద్దరు అదృశ్యమైన ఘటనలపై పోలీసులు కేసులు నమోదు చేశారు. వారి కథనం మేరకు.. నెల్లూరు సత్యనారాయణపురానికి చెందిన బి.సుబ్బమ్మకు మతిస్థిమితం లేదు. ఈనెల 20వ తేదీన ఆమె ఇంట్లో నుంచి అదృశ్యమైంది. బాధిత కుటుంబసభ్యులు గాలించారు. ఆచూకీ తెలియకపోవడంతో నవాబుపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు.
● జీనిగలవీధిలో భానుచందర్ నివాసం ఉంటున్నారు. ఆయన ఈనెల 19వ తేదీన ఇంట్లో నుంచి అదృశ్యమైయ్యాడు. ఈ మేరకు అతడి భార్య స్వప్న నవాబుపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. రెండు ఫిర్యాదులపై కేసులు నమోదు చేశామని ఇన్‌స్పెక్టర్ అన్వర్‌బాషా గురువారం తెలిపారు.
వీఎస్‌యూలో
‘మత్స్య దినోత్సవం’
వెంకటాచలం: మండలంలోని కాకుటూరు వద్దనున్న విక్రమ సింహపురి యూనివర్సిటీలో గురువారం ప్రపంచ మత్స్య దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వర్సిటీ ఇన్‌చార్జి వీసీ విజయభాస్కరరావు మాట్లాడుతూ మత్స్య పరిశ్రమలో ఆధునిక సాంకేతికత వినియోగంపై అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. రిమోట్ సెన్సింగ్ సాంకేతికతను వినియోగించుకోవడం ద్వారా చాలా ప్రయోజనాలున్నాయని పేర్కొన్నారు. తక్కువ సమయంలో ఎక్కువ సముద్ర ఉత్పత్తులను పొందవచ్చని తెలియజేశారు. సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతల్లో మార్పులపై పరిశోధన కొనసాగించాలని సూచించారు. ఽఆధునిక సాంకేతిక వినియోగం, సముద్ర వనరుల సమర్థ వినియోగం గురించి అవంతి సీడ్స్ సీనియర్ శాస్త్రవేత డాక్టర్ శ్రీనివాస్ అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఇన్‌చార్జి రిజిస్ట్రార్ డాక్టర్ కె.సునీత, ప్రిన్సిపల్ సీహెచ్ విజయ, అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు.
పరీక్షలకు
108 మంది హాజరు
వెంకటాచలం: విక్రమ సింహపురి యూనివర్సిటీ (వీఎస్‌యూ) పరిధిలోని అనుబంధ కళాశాలల్లో గురువారం నిర్వహించిన డిగ్రీ ఐదో సెమిస్టర్ పరీక్షలకు 108 మంది విద్యార్థులు హాజరయ్యారని వర్సిటీ పరీక్షల నిర్వహణాధికారిణి డాక్టర్ ఆర్.మధుమతి తెలిపారు. 111 మందికి గానూ 108 మంది హాజరైనట్లు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment