జనవరిలోనే అడుగంటిన భూగర్భ జలాలు | - | Sakshi
Sakshi News home page

జనవరిలోనే అడుగంటిన భూగర్భ జలాలు

Published Wed, Jan 29 2025 12:07 AM | Last Updated on Wed, Jan 29 2025 12:07 AM

జనవరి

జనవరిలోనే అడుగంటిన భూగర్భ జలాలు

వాగులు, వంకలను వదలని వైనం

వేగంగా అడుగంటుతున్న భూగర్భ జలాలు

ఎండుతున్న పంటలు.. ఆందోళనలో అన్నదాతలు

ఉదయగిరి: తమ్ముళ్ల ఇసుక దోపిడీకి ఫలితంగా గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ దఫా భూగర్భ జలాలు పాతాళానికి పడిపోతున్నాయి. ఇంకా వేసవి కాలం రాక ముందే ఇప్పటికే బావులు, బోర్లలో నీరు అడుగంటిపోయి.. జలధారాలు తగ్గిపోతున్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉదయగిరి నియోజవర్గంలో మర్రివూట్లవాగు, పిల్లాపేరు, మన్నెరు, ఉప్పుటేరు, ఉప్పు వాగుల్లో జేసీబీలతో కుళ్ల బోడుస్తూ ట్రాక్టర్లు ద్వారా నిబంధనలకు విరుద్ధంగా ఇసుక అక్రమ రవాణా చేస్తూ రూ.కోట్లు ఆర్జిస్తున్నారు. వీటి పరీవాహక ప్రాంతాల్లో సాగు చేసిన వివిధ పంటలకు నీటి సమస్య ముప్పు పొంచి ఉంది. నియోజకవర్గంలోని సీతారామపురం, ఉదయగిరి, వరికుంటపాడు, దుత్తలూరు, వింజమూరు, కొండాపురం మండలాల్లో టీడీపీలో కీలకంగా వ్యవహరిస్తున్న నేతలు పిల్లాపేరులో ఇసుక కోసం యంత్రాలతో తోడేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఇసుక అక్రమ రవాణా చేస్తూ పిల్లాపేరును ఖాళీ చేస్తున్నారు. ఇసుక తోడేయడంతో భవిష్యత్‌ పరిణామాలు ఎలా ఉంటాయో తెలిసినా.. అధికార యంత్రాంగం చేష్టలుడిగి చూస్తోంది. నెలవారీ మామూళ్ల మత్తులో పిల్లాపేరు గర్భశోకాన్ని పట్టించుకోవడం లేదు.

ఎక్కడెక్కడ.. ఎలా?

● సీతారామపురం మండలంలో సిద్ధేశ్వరం అటవీ ప్రాంతం నుంచి ప్రవహిస్తున్న మర్రివూట్ల, పిల్లాపేరు వాగుల్లో ఇసుకను అక్రమార్కులు వదలడం లేదు. వీటి పరిధిలో ఉన్న దేవమ్మ చెరువు, బసినేనిపల్లి, పడమటి రొంపిదొడ్ల, నెమళ్లదిన్నె, పొలంగారిపల్లి ప్రాంతంలో జేసీబీలు ఉపయోగించి ఇసుకను ఖాళీ చేస్తున్నారు.

● ఉదగయగిరి మండలంలో ప్రవహిస్తున్న పిల్లాపేరులో పరీవాహక ప్రాంతం కృష్ణంపల్లి, జెట్టివారిపల్లి, గండిపాళెం, వెంగళరావు, ఉదయగిరి, తిరుమాలపురం, దున్నపోతుల వాగు ఉన్న శకునాలపల్లి, కుర్రపల్లిలో ఇసుక దోచేస్తున్నారు.

● వరికుంటపాడు మండలంలో కాంచెరువు, గువ్వాడి, చెన్నంపల్లి, జడదేవి, కనియంపాడు, రామదేవులపాడు, గణేశ్వరపురం సమీపంలో ఉన్న పిల్లాపేరు నుంచి నిత్యం యంత్రాలు ఉపయోగించి ట్రాక్టర్ల ద్వారా పెద్ద ఎత్తున ఇసుక సమీప వింజమూరు, పామూరు పట్టణాలకు తరలిస్తున్నారు. ఉప్పువాగు పరిధిలో తిమ్మారెడ్డిపల్లి, టి.కొండారెడ్డిపల్లి, తూర్పు రొంపిదొడ్ల, డక్కునూరు ప్రాంతంలో ఇసుక తరలిస్తున్నారు.

● వింజమూరు మండలంలోని జనార్దనపురం, చాకలికొండ, గోళ్లవారిపల్లి వద్ద ఉన్న పిల్లాపేరు వాగు నుంచి ఇసుక తరలిస్తున్నారు.

● కొండాపురం మండలంలో చల్లగిరిగల, గరిమెనపెంట, చల్లవారిపల్లి, కోవివారిపల్లి ప్రాంతంలో ఉన్న పిల్లాపేరు వాగు, మన్నేరు నుంచి పొట్టిపల్లి, ఇస్కదామెర్ల, మక్కెనవారిపల్లి, రేణుమాల ప్రాంతాల్లో ఇసుక అక్రమంగా కొల్లగొట్టుతున్నారు. చింతలదేవి, కోకవారిపాళెం, భీమరప్పాడు, సాయిపేట, కొండాపురం, కొమ్మి తదితర ప్రాంతాల్లో ఉన్న వాగుల నుంచి కూడా ఇసుక తరలిపోతోంది.

నిబంధనలు ఇలా...

స్థానిక అవసరాల కోసం సమీపంలో ఉన్న వాగులు, వంకలు నుంచి ఇసుక ట్రాక్టర్లు, ఎడ్ల బండ్లు, ఆటోలు, మినీ ట్రక్కుల ద్వారా ఉచితంగా సరఫరా చేసుకునే అవకాశం కల్పించింది. యంత్రాలు వినియోగించకూడదనే నిబంధనలు ఉన్నప్పటికీ నిత్యం జేసీబీలు ఉపయోగించి అందిన మేరకు ఇసుక తోడేస్తున్నారు. స్ధానిక అవసరాలకు కాకుండా పొరుగు మండలాలు, జిల్లాలకు తరలిస్తున్నారు. వాగుల నుంచి కేవలం 4 కి.మీ దూరం వరకు ఉన్న గ్రామాలకు ఉచితంగా ఇసుక సరఫరా చేయవచ్చు. అది కూడా స్థానిక సచివాలయాల ద్వారా అనుమతి తీసుకోవాలి. కానీ అలా కాకుండా అక్రమార్కులు ఇసుక తరలిస్తూ రూ.లక్షలు గడిస్తున్నారు.

టీడీపీ నేతల ధనాశ.. భూగర్భ జలవినాశానికి దారితీస్తోంది. వాగులు, వంకల్లో రాత్రింబవళ్లు తేడా లేకుండా యంత్రాలతో ఇసుక తోడేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఇసుకను తవ్వేయడంతో వీటి పరీవాహక ప్రాంతాల్లోని భూగర్భ జలాలు వేగంగా అడుగంటిపోతున్నాయి. వాగులు, వంకలు ఆధారంగా పంటలు సాగు చేసిన రైతుల పొలాల్లోని బావుల్లో నీరు తగ్గిపోవడంతో సాగునీరందక పంటలు ఎండిపోతుంటే అన్నదాతలు బావురుమంటున్నారు.

ఈ చిత్రంలో కనిపిస్తున్న రైతు పేరు తాళ్లూరు రాజయ్య. ఇతనికి దుత్తలూరు మండలం తెడ్డుపాడులో 1.50 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. పిల్లాపేరుకు ఆనుకుని ఉన్న ఈ భూమిలో బోరువెల్‌ ద్వారా వచ్చే నీటితో పైర్లు సాగు చేస్తున్నారు. వర్షాకాలంలో బోరు నుంచి వచ్చే నీటి ధార తగ్గిపోయింది. పిల్లాపేరులో ఇసుకను జేసీబీలతో తవ్వేయడంతో భూగర్భ జలాలు తగ్గిపోతున్నాయి. ఇసుక తీయకముందు వేసవిలో కూడా బోరులో నీరు తగ్గలేదని, కానీ ఇప్పుడు జనవరిలోనే పరిస్థితి ఏర్పడిందని రైతు వాపోతున్నాడు.

ఇసుక అక్రమ రవాణాను అరికట్టాలి

ఉదయగిరి, సీతారామపురం తదితర మండలాల్లో ఉన్న పిల్లాపేరు వాగు నుంచి నిత్యం అక్రమంగా వాహనాల ఇసుక రవాణా చేస్తున్నారు. వాగులో ఇసుక ఖాళీ అయి భూగర్భ జలాలు పడిపోతున్నాయి. పిల్లాపేరు పరీవాహక ప్రాంతంలో రైతులు సాగు చేసే పైర్లకు సాగు నీటి సమస్య తలెత్తుతోంది. పైర్లు ఎండిపోయే ప్రమాదం పొంచి ఉంది. సంబంధిత అధికారులు అక్రమ ఇసుక రవాణాను అరికట్టాలి. ఇసుక లోడుతున్న జేసీబీలపై కేసు నమోదు చేయాలి. – కాకు వెంకటయ్య, సీపీఎం నేత

No comments yet. Be the first to comment!
Add a comment
జనవరిలోనే అడుగంటిన భూగర్భ జలాలు1
1/6

జనవరిలోనే అడుగంటిన భూగర్భ జలాలు

జనవరిలోనే అడుగంటిన భూగర్భ జలాలు2
2/6

జనవరిలోనే అడుగంటిన భూగర్భ జలాలు

జనవరిలోనే అడుగంటిన భూగర్భ జలాలు3
3/6

జనవరిలోనే అడుగంటిన భూగర్భ జలాలు

జనవరిలోనే అడుగంటిన భూగర్భ జలాలు4
4/6

జనవరిలోనే అడుగంటిన భూగర్భ జలాలు

జనవరిలోనే అడుగంటిన భూగర్భ జలాలు5
5/6

జనవరిలోనే అడుగంటిన భూగర్భ జలాలు

జనవరిలోనే అడుగంటిన భూగర్భ జలాలు6
6/6

జనవరిలోనే అడుగంటిన భూగర్భ జలాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement