నాలుగు విఫలం.. 13 సఫలం | - | Sakshi
Sakshi News home page

నాలుగు విఫలం.. 13 సఫలం

Published Thu, Jan 30 2025 12:14 AM | Last Updated on Thu, Jan 30 2025 12:14 AM

నాలుగ

నాలుగు విఫలం.. 13 సఫలం

సూళ్లూరుపేట: సతీష్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ షార్‌లోని రెండో ప్రయోగవేదిక నుంచి బుధవారం ఉదయం 6.23 గంటలకు జీఎస్‌ఎల్‌వీ – ఎఫ్‌15 రాకెట్‌ విజయవంతంగా రోదసీలోకి దూసుకెళ్లింది. మొత్తం ప్రయోగం 19.10 నిమిషాల్లోనే పూర్తయింది. 2,250 కిలోల బరువు కలిగిన నావిక్‌–2 ఉపగ్రహం విజయవంతంగా కక్ష్యలోకి చేరింది. నావిగేషన్‌ వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్‌కు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందించేందుకు సెకండ్‌ జనరేషన్‌ ఉపగ్రహమైన నావిక్‌–2ను ఇస్రో శాస్త్రవేత్తలు ఆర్బిట్‌లోకి ప్రవేశపెట్టారు. ఈ ప్రయోగంతో షార్‌ సగర్వంగా సెంచరీ మైలురాయి మీద నిలబడింది. ఇస్రో ప్రయోగాల పరంపరలో ఎన్నో మైలురాళ్లు దాటింది. అయితే ఇది వందో ప్రయోగం కావడంతో చరిత్ర పుటల్లోకెక్కింది.

గ్యాలరీలో వీక్షకుల సందడి

జీఎస్‌ఎల్‌వీ – ఎఫ్‌15 రాకెట్‌ ప్రయోగాన్ని వీక్షించేందుకు ఆంధ్రా, తమిళనాడు, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల నుంచి సుమారు ఆరు వేల మంది తరలివచ్చారు. వందో ప్రయోగం కావడంతో తెల్లవారుజామునే మంచును సైతం లెక్క చేయకుండా వీక్షకుల గ్యాలరీలోకి చేరుకున్నారు. రోదసీలోకి రాకెట్‌ దూసుకెళ్తుంటే జయహో భారత్‌.. జయహో ఇస్రో.. అంటూ నినాదాలు చేశారు. జాతీయ జెండాలను చేతపట్టి సగర్వంగా కేరింతలు కొట్టారు. సూళ్లూరుపేట నుంచి శ్రీహరికోట వరకు కార్లు, స్కూల్‌ వ్యాన్లు, బస్సులు బారులు తీరి కనిపించాయి.

శుభాకాంక్షల వెల్లువ

జీఎస్‌ఎల్‌వీ ఎఫ్‌15 ప్రయోగం విజయవంతం కావడంపై తిరుపతి ఎంపీ గురుమూర్తి, సూళ్లూరుపేట ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ, మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఇస్రో శాస్త్రవేత్తలకు శుభాకాంక్షలు తెలిపారు. వంద ప్రయోగాలు పూర్తి చేసి చరిత్ర సృష్టించినందుకు ఇస్రో చైర్మన్‌ డాక్టర్‌ వి.నారాయణన్‌, షార్‌ డైరెక్టర్‌ ఆర్ముగం రాజరాజన్‌, ఇతర శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు.

‘వంద’నం.. అభినందనం

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో మైలురాయిని అధిగమించింది. సతీష్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ నుంచి జీఎస్‌ఎల్‌వీ – ఎఫ్‌15 రాకెట్‌ను విజయవంతంగా ప్రయోగించింది. అంతర్జాతీయ స్థాయిలో దేశ ప్రతిష్టను ఇనుమడింపజేసింది. సెకండ్‌ జనరేషన్‌ ఉపగ్రహం నావిక్‌–2ను సమర్థవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. ఈ క్రమంలో నావిగేషన్‌ వ్యవస్థ మరింత బలోపేతం కానుంది. ప్రతిష్టాత్మక వందో ప్రయోగం పకడ్బందీగా పూర్తి కావడంతో షార్‌ శాస్త్రవేత్తల్లో ఆనందం వెల్లివిరిసింది.

జీఎస్‌ఎల్‌వీ సిరీస్‌లో ఇస్రో ఇప్పటి వరకు 17 ప్రయోగాలు చేసింది. అందులో 13 విజయవంతం కాగా, కేవలం నాలుగు ప్రయోగాలు మాత్రమే విఫలమయ్యాయి. బుధవారం నిర్వహించిన జీఎస్‌ఎల్‌వీ – ఎఫ్‌15 ఈ సిరీస్‌లో 17వ ప్రయోగం. ఇది వందో ప్రయోగం కావడంతో శాస్త్రవేత్తల్లో కొంత టెన్షన్‌ ఉంటుంది. ఎందుకంటే 2010 ఏప్రిల్‌ 15న స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో క్రయోజనిక్‌ దశతో చేసిన జీఎస్‌ఎల్‌వీ డీ3 ప్రయోగం విఫలమైంది. అదే సంవత్సరం డిసెంబర్‌ 25న జీఎస్‌ఎల్‌వీ ఎఫ్‌6 ప్రయోగంలో రష్యన్‌ క్రయోజనిక్‌ దశతో చేసినా విఫలమైంది. ఈ రాకెట్‌ నింగివైపునకు వెళ్లేటప్పుడు క్రయోజనిక్‌ దశ కింది భాగంలో ఉన్న స్టడ్‌ విరిగిపోవడంతో మిషన్‌ కంట్రోల్‌ రూమ్‌ నుంచే బ్లాస్ట్‌ చేశారు. తర్వాత 2010 నుంచి 2014 వరకూ జీఎస్‌ఎల్‌వీ ప్రయోగాల జోలికి ఇస్రో వెళ్లలేదు. క్రయోజనిక్‌ ఇంధనం లిక్విడ్‌ ఆక్సిడైజర్‌, లిక్విడ్‌ హైడ్రోజన్‌ కలిపి మైనస్‌ 220 డిగ్రీల ఉష్ణోగ్రతలో తయారు చేయాల్సి ఉంటుంది. అందుకే సంక్లిష్టమైన క్రయోజనిక్‌ టెక్నాలజీని అందుకోవడానికి తొలినాళ్లలో కాస్త ఒడిదుడుకులు ఎదుర్కొన్నా నేడు సగర్వంగా నిలబడింది.

విజయవంతంగా

జీఎస్‌ఎల్‌వీ – ఎఫ్‌15 ప్రయోగం

నిప్పులు చిమ్ముకుంటూ

నింగికేగిన రాకెట్‌

కక్ష్యలోకి చేరిన నావిక్‌– ఉపగ్రహం

షార్‌ శాస్త్రవేత్తల్లో అవధులు దాటిన ఆనందం

ప్రతిష్టాత్మక మైలురాయిని

అధిగమించిన ఇస్రో

No comments yet. Be the first to comment!
Add a comment
నాలుగు విఫలం.. 13 సఫలం 1
1/1

నాలుగు విఫలం.. 13 సఫలం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement