ముదిగుబ్బ: ఓ హత్య కేసులో ముద్దాయిలకు అనంతపురం జిల్లా సెషన్స్ కోర్టు జీవిత ఖైదు విధించింది. ముదిగుబ్బ సీఐ యతీంద్ర తెలిపిన వివరాల ప్రకారం... ముదిగుబ్బ మండలం ఎస్.బండ్లపల్లి గ్రామానికి చెందిన సాకే గంగరాజుతో తన భార్య వివాహేతర సంబంధం కొనసాగిస్తోందని తలుపుల మండలం సుబ్బనగుంతపల్లికి చెందిన గుజ్జల గంగప్ప అనుమానించాడు. దీంతో గంగరాజును హత్య చేసేందుకు ప్లాన్ చేశాడు. ఇందుకు తనమిత్రుడు లోమడ ఆంజనేయులు సాయం కోరాడు. అనంతరం గంగరాజుతో స్నేహం చేశాడు. ముందుగానే వేసిన ప్లాన్‌లో భాగంగా 2016 మార్చి 2వ తేదీన గంగప్ప, అతని మిత్రుడు లోమడ ఆంజనేయులు సాకే గంగరాజు వద్దకు వచ్చారు. మేకలు కొనడానికి ముదిగుబ్బకు వెళ్దామని కోరారు. వారి మాటలు నమ్మిన గంగరాజు వారితో కలిసి బైక్‌పై బయలుదేరాడు. అయితే గంగరాజును మాటల్లో పెట్టి ముదిగుబ్బ ఓల్డ్ టౌన్ రైల్వే గేటు సమీపంలోని మిల్లు వెనుక వైపు వరకూ తీసుకువెళ్లారు. అక్కడ బైక్ నిలిపి గంగప్ప అతని మిత్రుడు ఆంజనేయులు వెంట తెచ్చుకున్న కొడవళ్లతో గంగరాజును విచక్షణా రహితంగా నరికి చంపి పారిపోయారు. మృతుడి సోదరుడు సాకే వెంగముని ఫిర్యాదు మేరకు అప్పటి ముదిగుబ్బ ఎస్‌ఐ జయా నాయక్, నల్లమాడ సీఐ శివరాముడు కేసు నమోదు చేశారు. ముద్దాయిలను అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపారు. ఈ కేసు విచారించిన అనంతపురం జిల్లా సెషన్స్ కోర్టు జడ్జి శోభారాణి బుధవారం తీర్పు వెలువరించారు. ముద్దాయిలు గుజ్జల గంగప్ప, లోమడ ఆంజనేయులు జీవిత ఖైదు విధించడంతో పాటు ఒక్కొక్కరికి రూ.5 వేల చొప్పున జరిమానా విధించారు. ముద్దాయిలకు శిక్షపడే విధంగా కేసు దర్యాప్తు చేసిన అధికారులు శివరాముడు, జయా నాయక్, ప్రస్తుత ముదిగుబ్బ సీఐ యతీంద్ర, ఏఎస్‌ఐ వెంకటగిరి, హెచ్‌సీ గంగాధర్‌లను ఎస్పీ మాధవరెడ్డి ప్రత్యేకంగా అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment