పింఛన్లకు కత్తెర
సాక్షి, పుట్టపర్తి
‘ఇది మంచి ప్రభుత్వం’ అని చెప్పుకొని ఇంటింటికీ తిరుగుతున్న టీడీపీ నాయకులు పింఛన్ల పంపిణీలో కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారు. అర్హులపైనా ఆరోపణలు చేస్తూ పింఛన్ అందకుండా వేధింపులకు పాల్పడుతున్నారు. దీంతో ప్రతి నెలా ఒకటో తారీఖు రాగానే.. పింఛన్‌దారులు ఆవేదన వ్యక్తం చేయాల్సిన దుస్థితి నెలకొంది. మాజీ మంత్రి పరిటాల సునీత ప్రాతినిథ్యం వహిస్తోన్న రాప్తాడు, మంత్రి సత్యకుమార్ ప్రాతినిథ్యం వహిస్తోన్న ధర్మవరంలో పింఛన్ల సమస్య తలెత్తుతోంది. టీడీపీ నేతల అండ చూసుకుని గ్రామాల్లోని ఆ పార్టీ కార్యకర్తలు పింఛన్ లబ్ధిదారులపై లేనిపోని ఫిర్యాదులు చేస్తున్నారు. దీంతో అధికారులు విచారణ చేసిన తర్వాత పింఛన్ సొమ్ము అందజేస్తామని మాట దాటవేస్తున్నారు. దీంతో అధికారులు, సచివాలయాల చుట్టూ లబ్ధిదారులు ప్రదక్షిణ చేస్తున్నారు. ఒకటో తేదీ నుంచి ఐదో తేదీ వరకు ఇస్తారో? లేదో? తెలీని పరిస్థితి. కొన్ని చోట్ల నాలుగైదు తేదీల్లో కొందరికి ఇస్తున్నారు. టీడీపీ నాయకులు చెబితే... వెంటనే పింఛన్ మొత్తం ఇచ్చేస్తామని సచివాలయ ఉద్యోగులే చెబుతుండటం గమనార్హం.
అనర్హులుగా ఫిర్యాదు
గ్రామ స్థాయిలో వైఎస్సార్‌సీపీ సానుభూతిపరులను టీడీపీ నాయకులు టార్గెట్ చేశారు. వారిని అనర్హులుగా భావిస్తూ.. జాబితా సిద్ధం చేసి.. విచారణ చేయాలని అధికారులకు ఫిర్యాదు చేస్తున్నారు. కానీ అధికారులు విచారణ పూర్తి చేశారా? లేదా? అనేది తెలియరాలేదు. ఇదే విషయంపై జిల్లా అధికారులను వివరణ కోరగా.. విచారణ పూర్తయి.. అనర్హులుగా తేలితేనే జాబితా నుంచి తొలగిస్తామని, అప్పటి వరకు పింఛన్ అందజేయాల్సిందేనన్న సమాధానం వస్తోంది. సచివాలయ ఉద్యోగులు పింఛన్ ఇచ్చేందుకు సుముఖంగా ఉన్నప్పటికీ.. టీడీపీ నేతల ఒత్తిళ్లతో ఇవ్వకుండా సతాయిస్తున్నట్లు తెలుస్తోంది.
విచారణ చేసేదెన్నడు?
జూలై నెలలోనే కనగానపల్లి, రామగిరి, బత్తలపల్లి మండలాల్లో టీడీపీ నేతల నుంచి ఎంపీడీఓ లకు ఫిర్యాదులు వెళ్లాయి. వెంటనే జాబితాలో ఉన్న వారికి నోటీసులు పంపించారు. కానీ విచారణ ఎంతమేరకు పూర్తి చేశారనే విషయం తెలియరాలేదు. కానీ జాబితాలో పేర్లు ఉన్న వారందరికీ పింఛన్ల పంపిణీలో ప్రతి నెలా ఇబ్బందులు తలెత్తుతున్నాయి. అధికారులు, సచివాలయాల చుట్టూ ప్రదక్షిణ చేస్తే కానీ, దక్కని పరిస్థితి. ప్రతి నెలా ఆయా మండలాల్లో వందల మంది లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారు.
అర్హులకూ పింఛన్ అందకుండా
టీడీపీ నేతల అడ్డు
ప్రతి నెలా పింఛన్ మొత్తం పంపిణీలో సమస్య
రాప్తాడు, ధర్మవరం పరిధిలోనే అధికం
వందల మందికి ఇవ్వకుండా
కక్ష సాధింపు
విచారణ పేరుతో జాప్యం చేస్తోన్న
అధికారులు
పింఛన్ మొత్తం ఇవ్వాల్సిందే
ఎన్టీఆర్ పింఛన్ లబ్ధిదారుల అర్హతపై జిల్లాలో అక్కడక్కడా ఫిర్యాదులు అందాయి. వాటిని పరిశీలిస్తున్నాం. అయితే అనర్హులుగా తేల్చే వరకూ పింఛన్ పంపిణీ చేయాల్సిందే. ఇటీవల పలు మండలాల్లో కొందరు లబ్ధిదారులు అనర్హులంటూ ఫిర్యాదులు అందగా, వాటిని ఆయా ఎంపీడీఓలకు పంపాం. వారు క్షేత్రస్థాయిలో పరిశీలించి నివేదిక పంపుతారు. అనర్హులుగా తేలిస్తే తప్ప పింఛన్ పంపిణీ ఆగదు. అర్హులకు ఏ ఒక్కరికీ అన్యాయం చేయకూడదు. అక్టోబర్ నెలకు సంబంధించి జిల్లాలో 98.22 శాతం పింఛన్ పంపిణీ పూర్తి చేశాం.
– నరసయ్య, పీడీ, డీఆర్‌డీఏ
Comments
Please login to add a commentAdd a comment