దళితుడిపై ‘తెలుగు తమ్ముడి’ దాడి
సాక్షి టాస్క్‌ఫోర్స్: జిల్లా కేంద్రం, ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రమైన పుట్టపర్తిలో తెలుగుదేశం పార్టీ కార్యకర్త రౌడీ అవతారమెత్తి దళితులను పట్టి పీడిస్తున్నాడు. డబ్బులు అప్పుగా తీసుకుని తిరిగి ఇవ్వకుండా బెదిరిస్తున్నాడు. గట్టిగా నిలదీసిన వారిని రాత్రివేళల్లో కాపుకాచి చితకబాదుతున్నాడు. వివరాల్లోకి వెళితే.. టీడీపీ కార్యకర్త ముమ్మనేని రవి ప్రకాశ్‌నాయుడు మంగళవారం రాత్రి తన స్నేహితుడితో కలిసి వచ్చి దళిత సామాజిక వర్గానికి చెందిన కేశవయ్యను కర్రలతో చితకబాదారు. పోలీసులకు చెబితే అంతు చూస్తానంటూ బెదిరించినట్లు బాధితుడు వాపోయాడు. డబ్బు తిరిగి అడుగుతావా అంటూ దబాయించినట్లు కేశవ భార్య ఆవేదన వ్యక్తం చేసింది.
ఐదేళ్లుగా ముప్పుతిప్పలు
ధర్మవరం మండలం దర్శనమల గ్రామానికి చెందిన కేశవయ్య దంపతులు కొన్నేళ్లుగా పుట్టపర్తిలోని సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి జంక్షన్ వద్ద ఓ ప్రైవేటు ఆస్పత్రిలో పని చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఐదేళ్ల క్రితం వారి వద్ద ఉన్న రూ.80 వేల నగదును టీడీపీ కార్యకర్త రవిప్రకాశ్‌నాయుడు బలవంతంగా తీసుకున్నాడు. తర్వాత తిరిగి ఇస్తానని చెప్పాడు. ఐదేళ్ల నుంచి ఇవ్వకుండా మాట దాటవేస్తూ వచ్చాడు. అప్పు తీసుకుని చాలా రోజులైందని, అవసరం ఉన్నందున తిరిగి ఇవ్వాలని కేశవయ్య దంపతులు నాలుగు రోజుల క్రితం రవిప్రకాశ్‌ను నిలదీశారు. దీంతో వారిపై ఆగ్రహంతో ఉన్న రవిప్రకాశ్ నాయుడు సమయం చూసుకుని మంగళవారం రాత్రి రోడ్డు పక్కన వెళ్తున్న కేశవయ్యను చితకబాదాడు.
ఎవరీ రవిప్రకాశ్?
పుట్టపర్తి మున్సిపాలిటీ పరిధిలోని కమ్మవారిపల్లికి చెందిన ముమ్మనేని రవిప్రకాశ్‌నాయుడు వివాదాస్పద వ్యక్తి. నాలుగైదు పెళ్లిళ్లు అయినట్లు స్థానికులు చెబుతున్నారు. ఏడాదికో మహిళను తెచ్చి ఇంట్లో పెట్టుకోవడం.. ఉన్న వారిని తరిమేయడం అలవాటుగా మార్చుకున్నాడు. అడ్డు మాట్లాడిన వారిపై తిరగబడతాడు. ఇతనిపై ఇప్పటికే పోలీస్ స్టేషన్లలో కేసులు ఉన్నాయి. గతంలోనూ దౌర్జన్యాలకు దిగిన సందర్భాలున్నాయి. మహిళలను మోసం చేసిన ఘటనలూ ఉన్నాయి. ఎవరిదగ్గర అప్పు తీసుకున్నా వెనక్కి ఇవ్వడని. నిలదీస్తే దాడులకు దిగుతాడని స్థానికులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే కేశవయ్యపై కూడా దాడి చేశాడని చెబుతున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రోజున రవిప్రకాశ్ నాయుడు వేట కొడవలి తీసుకుని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వద్ద వీరంగం చేసినట్లు స్థానికులు చెబుతున్నారు.
అప్పుగా తీసుకున్న డబ్బు అడిగినందుకు దౌర్జన్యం
పోలీసులను ఆశ్రయించిన బాధితులు
ఐదేళ్ల క్రితం రూ.80 వేలు
ఇచ్చామన్న దళితులు
Comments
Please login to add a commentAdd a comment