దసరాకు ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులు
పుట్టపర్తి టౌన్: దసరా పండుగ కోసం ముఖ్యమైన పట్టణాలు, నగరాల నుంచి స్వస్థలాలకు చేరుకునే వారి కోసం జిల్లా వ్యాప్తంగా అన్ని డిపోల నుంచి ప్రత్యేక సర్వీసులు నడుపుతున్నట్లు జిల్లా ప్రజా రవాణా అధికారి (డీపీటీఓ) మధుసూదన్ తెలిపారు. బుధవారం ఆయన కార్యాలయంలో డిపో మేనేజర్లు, ట్రాఫిక్, గ్యారేజ్ సూపర్‌వైజర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, దసరా పర్వదినాన్ని పురస్కరించుకుని హైదరాబాద్, బెంగళూరు, తిరుపతి, చైన్నె నుంచి వచ్చే ప్రయాణికుల సౌకర్యార్థం ఈనెల 9వ తేదీ నుంచి 12 వ తేదీ వరకు 100 ప్రత్యేక సర్వీసులు నడుపుతున్నట్లు వెల్లడించారు. ఇందులో హైదరాబాదుకు 30, బెంగళూరుకు 20, తిరుపతికి 10, చైన్నెకి 5, విజయవాడకు 5 సర్వీసులు తిప్పుతామన్నారు. అలాగే అనంతపురం–పుట్టపర్తి మధ్య 30 లోకల్ సర్వీసులు నడుపనున్నట్లు వెల్లడించారు. ఆయా సర్వీసుల్లో సాధారణ చార్జీలే వసూలు చేస్తారన్నారు. దూరప్రాంత ప్రయాణికులు www.apsrtconline.in వెబ్‌సైట్‌లో టికెట్లు ముందస్తుగా రిజర్వు చేసుకోవచ్చన్నారు. అలాగే తిరుగు ప్రయాణంలో ఈనెల 13వ తేదీ నుంచి 16వ తేదీ వరకు హైదరాబాదుకు 10, బెంగళూరుకు 15, తిరుపతికి 5, విజయవాడకు 5, లోకల్‌సర్వీలు 20 మొత్తంగా 55 ప్రత్యేక సర్వీసులు నడుపుతున్నట్లు డీపీటీఓ వెల్లడించారు. ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
మహాత్ములకు ఘన నివాళి
● ఘనంగా మహాత్మాగాంధీ,
లాల్‌బహదూర్‌శాస్త్రి జయంతి
పుట్టపర్తి టౌన్/ప్రశాంతి నిలయం: మహాత్మాగాంధీ, లాల్‌బహదూర్‌శాస్త్రి జయంతి వేడుకలను బుధవారం జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. కలెక్టరేట్, జిల్లా పోలీసు కార్యాలయాల్లో జరిగిన కార్యక్రమాల్లో కలెక్టర్ టీఎస్ చేతన్, జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్, ఎస్పీ రత్న మహాత్మాగాంధీ, లాల్‌బహదూర్ శాస్త్రి చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. గాంధీజీ బోధించిన శాంతి, అహింసా మార్గంలో నడవాలని పిలుపునిచ్చారు. నిస్వార్థ రాజకీయాలతో తాను అలంకరించిన పదవులకే లాల్ బహదూర్ శాస్త్రి వన్నే తెచ్చారని కొనియాడారు.
Comments
Please login to add a commentAdd a comment