జీబీఆర్ నిర్వాసితులకు పరిహారం అందించండి
పుట్టపర్తి: నిర్మాణంలో ఉన్న జిల్లేడుబండ రిజర్వాయర్ (జీబీఆర్) ముంపు బాధితులకు పరిహారం అందించాలని కలెక్టర్ చేతన్‌కు రామసాగరం గ్రామ రైతులు విన్నవించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కలెక్టర్‌ను నిర్వాసిత రైతుల తరఫున పాముదుర్తి విజయభాస్కర్‌రెడ్డి కలిసి వినతిపత్రం అందజేసి, మాట్లాడారు. రిజర్వాయర్ నిర్మాణం పూర్తయితే ముదిగుబ్బ, బుక్కపట్నం మండలాల్లోని సర్వే నంబర్ 283, 278, 280, 281లోని 32 మంది రైతులకు సంబంధించిన పట్టా భూములు ముంపునకు గురవుతాయన్నారు. నిర్వాసిత రైతులకు పరిహారం అందించేందుకు గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీకి సిద్ధం కాగా, ఎన్నికల కోడ్ రావడంతో ఈ ప్రక్రియ కాస్త ఆగిపోయిందన్నారు. తాజాగా కూటమి ప్రభుత్వం స్పందించి నోటిఫికేషన్ జారీ చేసి నిర్వాసిత రైతులకు పరిహారం చెల్లించేలా చర్యలు చేపట్టాలని కోరారు.
భవన నిర్మాణ కార్మిక
సంఘం అధ్యక్షుడిపై దాడి
ధర్మవరం అర్బన్: భవన నిర్మాణ కార్మిక సంఘం అధ్యక్షుడు ముక్తం ఈశ్వరయ్యపై దాడి జరిగింది. వన్‌టౌన్ పోలీసులు తెలిపిన మేరకు.. ధర్మవరంలో నూతనంగా ఏర్పాటైన బేల్దారి సంఘం అధ్యక్షుడు కత్తె నాగరాజు, ప్రశాంత్, రఘు, లక్ష్మణ్, ముక్తం ఈశ్వరయ్య సోమవారం దుర్గమ్మ ఆలయం సమీపంలో సంఘం పుస్తకాలు, రికార్డుల నిర్వహణ విషయంగా గొడవపడ్డారు. వాగ్వాదం చేసుకుంటూ చివరకు ఈశ్వరయ్యపై దాడి చేశారు. ఘటనలో ఈశ్వరయ్య చెవికి తీవ్ర గాయాలయ్యాయి. ఈశ్వరయ్య అనుచరుల దాడిలో ప్రశాంత్‌కు స్వల్పగాయాలయ్యాయి. ఇరువురి పరస్పర ఫిర్యాదుల మేరకు వన్‌టౌన్ పోలీసులు విచారణ చేపట్టారు.
కుమారుడికి పెళ్లి కాలేదని తల్లి ఆత్మహత్య
రొళ్ల: కుమారుడికి పెళ్లి కాలేదన్న దిగులుతో తల్లి ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు... రొళ్ల మండలం శివబాలయోగినగరం గ్రామానికి చెందిన భాగ్యమ్మ (50), పుట్టతిమ్మప్ప దంపతులు తమ ఏకై క కుమారుడు కాంతరాజుతో కలసి వ్యవసాయ పనులతో పాటు కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో కుమారుడికి పెళ్లి ప్రయత్నాలు చేపట్టారు. అయితే పెళ్లి సంబంధాలు ఏవీ కుదరలేదు. వయస్సు మీద పడడంతో ఇక తమ కుమారుడికి పెళ్లి కాదన్న బెంగతో కుంగిపోయిన భాగ్యమ్మ ఆదివారం రాత్రి గన్నేరు చెట్టు ఆకులను మిక్సీ పట్టి రసం తీసి తాగింది. విషయాన్ని గుర్తించిన కుటుంబసభ్యులు వెంటనే రొళ్ల పీహెచ్‌సీకి తీసుకెళ్లారు. పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యుల సూచన మేరకు కర్ణాటకలోని తుమకూరులో ఉన్న ప్రభుత్వాస్పత్రికి తరలించారు. చికిత్సకు స్పందించక సోమవారం తెల్లవారుజామున భాగ్యమ్మ మృతి చెందింది. ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment