యువ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించండి
ప్రశాంతి నిలయం: జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు ముందుకు వచ్చే యువ పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించాలని కలెక్టర్ టీఎస్ చేతన్ పరిశ్రమల శాఖల అధికారులు, బ్యాంకర్లకు పిలుపునిచ్చారు. బుధవారం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో జిల్లా పరిశ్రమలు, ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, అర్హులైన పారిశ్రామిక వేత్తలకు విరివిగా రుణాలు మంజూరు చేయాలని బ్యాంకర్లను ఆదేశించారు. పారిశ్రామిక వాడల్లో కేటాయించిన ప్లాట్లలో పరిశ్రమలు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. జిల్లాలో పరిశ్రమల ఏర్పాటు కోసం అందిన దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి అర్హుల జాబితాను సిద్ధం చేయాలన్నారు. సింగిల్ డెస్కు పోర్టలో పెండింగ్‌లో ఉన్న 10 పరిశ్రమలకు సంబంధించిన అనుమతులు మంజూరు చేయాలని సమావేశంలో తీర్మానించారు. సింగిల్ డెస్క్ పోర్టల్ ద్వారా 3,994 దరఖాస్తులు అందగా, అర్హతక కలిగిన 3,883 ప్రతిపాదనలు ఆమోదించామని కలెక్టర్ వివరించారు. పీఎంఈజీపీ కింద పరిశ్రమలు స్థాపించే వారికి రూ.20 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు కేంద్ర ప్రభుత్వం రుణ సహాయం చేస్తుందన్నారు. కార్యక్రమంలో ఏపీఐఐసీ జోనల్ మేనేజర్ సోనీ సహాని, పరిశ్రమల శాఖ అధికారి సంజీవ్ రాజు, ఎల్డీఎం రమణకుమార్, డీపీఓ సమత, స్కిల్ డెవలప్‌మెంట్ అధికారి రాజేష్, సాంఘిక సంక్షేమ అధికారి శివరంగ ప్రసాద్ తదతరులు పాల్గొన్నారు.
పేరెంట్స్ మీట్‌ను పండుగలా నిర్వహించాలి
జిల్లాలో డిసెంబర్ 7న నిర్వహించనున్న మెగా పేరెంట్స్, టీచర్స్ మీటింగ్‌ను పండుగలా నిర్వహించాలని కలెక్టర్ టీఎస్ చేతన్ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో మెగా పేరెంట్స్, టీచర్స్ సమావేశానికి సంబంధించిన ముందస్తు ఏర్పాట్లపై కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు చేపట్టాల్సిన ఆరోగ్య పరీక్షలపై ఆరా తీసిన కలెక్టర్... విద్యార్థులకు త్వరితగతిన స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించి హెల్త్ కార్డులు జారీ చేయాలని వైద్య, ఆరోగ్యశాఖ అధికారిని ఆదేశించారు. పేరెంట్స్, టీచర్స్ మీటింగ్ నిర్వహణకు సంబంధించి ప్రధానోపాధ్యాయులకు సూచనలు ఇవ్వాలన్నారు. గురువారం నుంచి విద్యార్థులకు డ్రాయింగ్, క్విజ్, వక్తృత్వ, వ్యాసరచన పోటీలు నిర్వహించాలని డీఈఓను ఆదేశించారు. సమావేశంలో డీఎంహెచ్‌ఓ డాక్టర్ మంజువాణి, జిల్లా విద్యాశాఖ అధికారి కిష్టప్ప, బీసీ, గిరిజన సంక్షేమ శాఖల అధికారులు శివరంగ ప్రసాద్, మోహన్ రామ్, డిప్యూటీ డీఈఓ రంగస్వామి, డీపీఓ సమత తదితరులు పాల్గొన్నారు.
విరివిగా రుణాలిచ్చి అండగా నిలవండి
కలెక్టర్ టీఎస్ చేతన్ పిలుపు
Comments
Please login to add a commentAdd a comment