మెడికో ఆత్మహత్య
● హాస్టల్‌లో ఉరేసుకుని బలవన్మరణం
అనంతపురం (మెడికల్): అనంతపురం బోధనాస్పత్రిలో జి.వీరరోహిత్ (23) అనే విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలకలం రేపింది. వైద్య కళాశాల వర్గాలు, టూటౌన్ సీఐ శ్రీకాంత్ యాదవ్ తెలిపిన వివరాల మేరకు.. ఉరవకొండకు చెందిన ఉపాధ్యాయ దంపతులు జి.శారద, శివప్రసాద్‌కు వీరరోహిత్ (23), లోకేశ్వరి సంతానం. వీరరోహిత్ 2019 బ్యాచ్ విద్యార్థి. తోటి విద్యార్థులు ప్రస్తుతం హౌస్‌సర్జన్లుగా విధులు నిర్వర్తిస్తున్నారు. వీరరోహిత్ పిన్ని కుమారులు ధీరజ్‌సాయి, విశాల్ ఇదే వైద్య కళాశాలలోనే విద్యనభ్యసిస్తున్నారు.
ఇంటికి వస్తానని ఫోన్‌చేసి..
వీరరోహిత్ బుధవారం తన తండ్రి శివప్రసాద్‌కు ఫోన్‌చేసి ఇంటికి వస్తానని చెప్పాడు. సరేనన్న తండ్రి తాను అనంతపురం వస్తున్నానని, సాయంత్రం తిరిగి ఫోన్ చేస్తానని చెప్పారు. సాయంత్రం తండ్రి ఫోన్ చేయగా వీరరోహిత్ నుంచి ఎటువంటి స్పందనా రాలేదు. దీంతో ఆయన ధీరజ్, విశాల్‌కు ఫోన్‌చేసి వీరరోహిత్ రూమ్‌కు వెళ్లి చూడాలని చెప్పారు. వారిద్దరూ తలుపు తట్టగా.. లోపలి నుంచి ఎటువంటి సమాధానం రాలేదు. తోటి విద్యార్థులు, హౌస్‌సర్జన్లకు సమాచారం ఇవ్వడంతో వారంతా వచ్చి కిటికీలోంచి చూడగా.. వీరరోహిత్ ఫ్యాన్ కొక్కేనికి నైలాన్ తాడుతో ఉరికి వేలాడుతూ కనిపించాడు. దీంతో తలుపులు పగులగొట్టి లోనికి వెళ్లి అతన్ని సర్వజనాస్పత్రి ఎమర్జెన్సీ వార్డుకు తరలించారు. అప్పటికే అతడు మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు.
అయోమయంగా ఉందని నోట్‌రాసి..
టూటౌన్ సీఐ శ్రీకాంత్ యాదవ్ విచారణ చేపట్టగా హాస్టల్‌లో సూసైడ్ నోట్ లభించింది. ‘ఐయాం రెస్పాన్సిబుల్ ఫర్ మై డెత్. ఈ ఆలోచనల నుంచి బయటకు రాలేకపోతున్నా. అయోమయంగా ఉండి.. కాన్సన్‌ట్రేషన్ చేయలేకపోతున్నా’ అని సూసైడ్ నోట్‌లో వీరరోహిత్ పేర్కొన్నట్లు టూటౌన్ సీఐ తెలిపారు. ఒత్తిడితోనే తన కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడని తండ్రి శివప్రసాద్ తెలిపారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment