ప్రాణాలు బలిగొన్న అతివేగం
హిందూపురం అర్బన్: అతి వేగం ఇద్దరి ప్రాణాలు బలిగొంది. రోడ్డు భద్రత నిబంధనలు పాటించకపోవడం... వేగాన్ని నియంత్రించుకోలేక పోవడమే ఇందుకు కారణంగా పోలీసుల ప్రాథమిక విచారణలో నిర్ధారణ అయింది.
ట్రాక్టర్ ట్రాలీ కిందకు దూసుకెళ్లిన స్కూటీ..
హిందూపురం పట్టణానికి చెందిన షేక్ దాదాపీర్ (36), పవన్‌కుమార్ (26) గురువారం ఉదయం వ్యక్తిగత పనిపై కర్ణాటకలోని గౌరిబిదనూరుకు వెళ్లారు. అక్కడ పని ముగించుకుని సాయంత్రం స్కూటీపై తిరుగుప్రయాణమైన వారు హిందూపురం మండలం తూమకుంట ఎకై ్సజ్ చెక్‌పోస్టు వద్దకు చేరుకోగానే మలుపు తిరుగుతున్న ట్రాక్టర్‌ను ఢీకొన్నారు. ట్రాలీ కిందకు స్కూటీ దూసుకెళ్లింది. ఘటనలో ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు.
హెల్మెట్ ఉండి ఉంటే...
ప్రమాదానికి అతి వేగమే కారణంగా తెలుస్తోంది. మలుపు తిరుగుతున్న ట్రాక్టర్‌ను గమనించగానే ద్విచక్ర వాహనదారులు నియంత్రిచుకోలేక నేరుగా వెళ్లి ఢీకొన్నారు. ఘటనలో తలలు పగిలి దుర్మరణం పాలయ్యారు. శరీరంపై చిన్నపాటి గాయాలయ్యాయి. ద్విచక్రవాహన చోదకులు హెల్మెట్ ధరించి ఉంటే ప్రమాద తీవ్రత ఇంతగా ఉండేది కాదని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. కాగా, హిందూపురంలోని త్యాగరాజనగర్‌కు చెందిన పవన్‌కుమార్... స్థానిక బెంగళూరు రోడ్డులోని ఓ ల్యాబ్‌లో టెక్నీసియన్‌గా పనిచేస్తున్నాడు. రెండు నెలల క్రితమే ఆయనకు వివాహమైంది. అదే ప్రాంతానికి చెందిన షేక్‌దాదాపీర్ కార్పెంటర్ పనితో కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
మిన్నంటిన రోదనలు..
ప్రమాదం జరిగిన వెంటనే హిందూపురం సీఐ ఆంజనేయులు, సిబ్బంది అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను హిందూపురంలోని జిల్లాస్పత్రికి తరలించారు. వాహనాలను తొలగించి ట్రాఫిక్ పునరుద్ధరించారు. విషయం తెలుసుకున్న మృతుల కుటుంబీకులు, బంధువులు పెద్ద సంఖ్యలో ఆస్పత్రికి చేరుకున్నారు. మృతదేహాలను చూసి బోరున విలపిస్తున్న వారిని ఓదార్చడం ఎవరి తరం కాలేదు. ఘటనపై హిందూపురం పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.
తూముకుంట చెక్‌పోస్టు వద్ద ఘటన
ట్రాక్టర్‌ను ఢీకొన్న ద్విచక్ర వాహనం
ఇద్దరి దుర్మరణం
Comments
Please login to add a commentAdd a comment