మా గోడు పట్టదా బాలయ్యా?
హిందూపురం అర్బన్ : ఎప్పుడో చుట్టపుచూపుగా నియోజకవర్గానికి వచ్చే ఎమ్మెల్యే బాలకృష్ణ ప్రజల గోడు పట్టించుకోవడం లేదు. వారే వచ్చి అర్జీలిద్దామనుకున్నా అవకాశం కల్పించడం లేదు. తాజాగా బుధవారం ఇళ్లు లేని నిరుపేద మహిళలు వందలాది మంది ప్రజా సంఘాల నేతలతో కలిసి ఎమ్మెల్యే బాలకృష్ణ ఇంటికి వద్దకు వచ్చారు. అర్జీలు పట్టుకుని గంటల తరబడి ఎదురు చూశారు. అయినా ఫలితం లేకపోయింది. ఎమ్మెల్యే బాలకృష్ణ వారిని కనీసం పట్టించుకోకుండా ‘డాకు మహారాజ్’ విజయోత్సవంలో పాల్గొనేందుకు అనంతపురం వెళ్లిపోయారు. ఆ వెంటనే అక్కడే ఉన్న టీడీపీ నేతలు మహిళలను అక్కడి నుంచి గెంటేశారు. దీనిపై మహిళలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో తమ ఇళ్ల వద్దకు వచ్చి వంగివంగి దండాలు పెట్టిన బాలకృష్ణకు..ఇప్పుడు తమ బాగోగులు పట్టించుకునే తీరికే లేకుండా పోయిందన్నారు. ప్రజా సమస్యలకన్నా ఆయనకు సినిమా విజయోత్సవాలే ప్రధానమయ్యాయని, అలాంటప్పుడు ఇక్కడి నుంచి ఎందుకు పోటీ చేశారని ప్రశ్నించారు. కనీసం తాము తెచ్చిన అర్జీలు కూడా తీసుకోలేనంత బిజీగా ఉన్న ప్రజాప్రతినిధి తమకు వద్దని, తగిన సమయంలో ఆయనకు తప్పక గుణపాఠం చెబుతామన్నారు. కార్యక్రమంలో సీపీఎం నాయకులు నరసింహులు, రమణ, ఎస్‌ఎఫ్‌ఐ నాయకుడు బాబావలి, ఇళ్ల స్థలాల పోరాట నాయకులు రాయుడు, సరస్వతి, గంగమ్మ, ఆదిలక్ష్మి, రామాంజినప్ప ఉన్నారు.
ఇంటి పట్టాల కోసం బాలకృష్ణ
ఇంటి వద్దకు భారీగా వచ్చిన మహిళలు
‘డాకు’ ఫంక్షన్ కోసం హడావుడిగా
వెళ్లిపోయిన ఎమ్మెల్యే
బాలకృష్ణ తీరుపై మహిళల మండిపాటు
ఓటేసిన మమ్మల్ని పట్టించుకోకుండా విజయోత్సవాలేంటని ఆగ్రహం
Comments
Please login to add a commentAdd a comment