ఇష్టానుసారం వాడకూడదు
పుట్టపర్తి అర్బన్: సాగులో ఉచిత సలహాలిచ్చేవారు ఎక్కువయ్యారు. రైతుల అమాయకత్వాన్ని ఆసరా చేసుకుంటున్న కొందరు ఫర్టిలైజర్ షాపుల యజమానులు దిగుబడి ఆశ జూపి అదనంగా పురుగు మందులు అంటగడుతున్నారు. దీంతో పెట్టుబడులు భారీగా పెరిగిపోవడంతో రైతులు నిండా మునిగిపోతున్నారు. పైగా అతిగా పురుగుమందులు వాడటం వల్ల భూసారం తగ్గిపోతోంది. ఫలితంగా ఆ తర్వాత వేసిన పంటలూ దారుణంగా దెబ్బతింటున్నాయి. ఆయా భూముల్లో పండిన పంటలు విషతుల్యమవుతున్నాయి.
వాతావరణ మార్పులతో పంటలకు తెగుళ్లు..
జిల్లాలో రైతులు రబీలో 31,205 హెక్టార్లలో వ్యవసాయ పంటలు, 64,359 హెక్టార్లతో ఉద్యాన పంటలు సాగుచేస్తున్నారు. ఒక్క రబీ సీజన్‌లోనే తెగుళ్లనివారణ, దిగుబడి పెరగడం కోసం రూ.350 కోట్లకుపైగా విలువైన ఎరువులు, పురుగుమందులు వాడుతున్నారు. సాధారణంగా ఖరీఫ్ సీజన్ జూన్ నుంచి నవంబర్ మధ్యలో ముగుస్తుంది. అప్పటికే రుతుపవనాలు తిరోగమనంలో ఉండటంతో తుపాను ప్రభావం అంతగా ఉండదు. అయితే ఈ ఏడాది ఖరీఫ్ ముగిసినా జనవరి నెలలో సైతం ఆకాశం మేఘావృతం కావడం, అక్కడక్కడా జల్లులు కురవడం వంటి అనూహ్య పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో రబీ పంటలకు చీడ పీడలు అధికమయ్యాయి. ముఖ్యంగా వేరుశనగ, మొక్కజొన్న, వరి, సజ్జ, పంటలతో పాటు ఉద్యానపంటలైన కళింగర, దోస, ఖర్భూజా, మామిడి, చీనీ, జామ, దానిమ్మ, కూరగాయల పంటలకూ తెగుళ్లు ఎక్కువయ్యాయి. దీంతో రైతులు ఒక్కో పంటకు కనీసం నాలుగైదు సార్లు పురుగు మందులు పిచికారీ చేస్తున్నారు. అలాగే పంట సాగుకు ముందు గడ్డిమందు, దిగుబడి పెరగడానికి మందు అంటూ ఇష్టానుసారం పురుగు మందులు కొడుతున్నారు.
ఫర్టిలైజర్ షాపు నిర్వాహకుల ఇష్టారాజ్యం..
తెగుళ్లు, చీడల నివారణ కోసం కొందరు రైతులు వ్యవసాయాధికారులను సంప్రదిస్తుండగా.. మరికొందరు మాత్రం నేరుగా ఫర్టిలైజర్ షాపుల నిర్వాహకులను సలహా అడుగుతున్నారు. ధనార్జనే ధ్యేయంగా వ్యవహరిస్తున్న కొందరు ఫర్టిలైజర్ షాపుల నిర్వాహకులు రైతులకు వివిధ రకాల మందులు అంటగడుతున్నారు. వ్యవసాయాధికారులు సూచించిన మందులతో పాటు దిగుబడి పెరుగుతుందని రైతులకు ఆశలు కల్పించి మోతాదుమించి రసాయన మందులు ఇస్తున్నారు. దీనివల్ల పెట్టుబడులు పెరుగుతున్నాయి. మరోవైపు ఇష్టానుసారం పురుగు మందులు పిచికారీ చేయడం వల్ల భూసారం తగ్గి దిగుబడి తగ్గిపోతోంది.
జిల్లా రబీసాగు విస్తీర్ణం
(వ్యవసాయ, ఉద్యాన పంటలు)
ఎరువులు, పురుగు
మందుల కోసం చేస్తున్న ఖర్చు
ఫర్టిలైజర్స్ నిర్వాహకుల మాటలు
విని రైతుల వాడే పురుగు మందుల ఖర్చు
జిల్లాలో అనుమతులు
పొందిన ఫర్టిలైజర్ దుకాణాలు
రూ.143.33 కోట్లు
260
ఏ పంటకై నా తెగుళ్లు సోకినప్పుడు వ్యవసాయాధికారుల సూచనలు తప్పక పాటించాలి. అధికారులు పొలం వద్దకు రాలేనప్పుడు తెగులు సోకిన మొక్కను తీసుకువెళ్తే తగు సలహాలు, సూచనలు ఇస్తారు. ఆ మేరకే పురుగు మందులు వాడాలి. అలాకాకుండా సొంతంగా ఇష్టానుసారం పంటపై మందులు పిచికారీ చేస్తే పంటలు దెబ్బ తినడంతో పాటు భూసారం తగ్గిపోతుంది.
– చంద్రశేఖర్, జిల్లా ఉద్యానశాఖ అధికారి
కదిరికి చెందిన గోవిందప్ప వేరుశనగ పంటకు తెగుళ్లు సోకగా వ్యవసాయాధికారులను సంప్రదించాడు. వారు సూచించిన పురుగుమందులు కొనేందుకు ఫర్టిలైజర్ దుకాణానికి వెళ్తే.. దుకాణం యజమాని తెగుళ్ల నివారణతో పాటు దిగుబడికి, చెట్టు పెరిగేందుకు, పూత వచ్చేందుకు అంటూ వివిధ రకాల పురుగుమందులు అంటగట్టి సుమారు రూ.15 వేలు బిల్లు వేశాడు. వ్యవసాయాధికారి చెప్పింది ఒకటే కదా అంటే.. ‘ఇవన్నీ వాడితే మంచిది. పంట దెబ్బతింటే ఇబ్బంది పడతారు’ అని చెప్పేసరికి గోవిందప్ప ఆ మందులన్నీ కొన్నాడు. ఫలితంగా రూ.4 వేలయ్యే పురుగు మందుల ఖర్చు రూ.15 వేలు దాటి పోయింది.
కొత్తచెరువు మండలం బైరాపురం గ్రామానికి చెందిన రైతు రఘునాథ్ రబీ సీజన్ కింద కళింగర సాగు చేశాడు. ఓ ఫర్టిలైజర్ షాపునకు వెళ్లి మూడు ఎకరాల్లో కళింగర సాగుకు ఎరువులు కావాలన్నాడు. అతను ఏకంగా 7, 8 రకాల ఎరువులు భూమిలోకి వేయడానికి ఇచ్చి సుమారు రూ.20 వేలకుపైగా బిల్లు వేశాడు. విత్తనం నాటాక 10 రోజుల మొక్కలకు మందులు పిచికారీ చేయాల్సి రాగా, రూ.8 వేలు బిల్లు వేశాడు. ఇలా పంట చేతికొచ్చే వరకూ ఇష్టానుసారం పురుగుమందులు వాడాడు. ఫలితంగా పెట్టుబడి భారీగా పెరిగిపోయి...తీవ్రంగా నష్టోయాడు.
Comments
Please login to add a commentAdd a comment