31 వరకూ పశు ఆరోగ్య శిబిరాలు
ప్రశాంతి నిలయం: పాడిపశువుల ఆరోగ్యాన్ని కాపాడేందుకు జిల్లాలో ఈనెల 20వ తేదీ నుంచి 31వ తేదీ వరకూ పశు ఆరోగ్య శిబిరాలు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ టీఎస్ చేతన్ తెలిపారు. బుధవారం కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో పశు ఆరోగ్య శిబిరాలకు సంబంధించిన పోస్టర్లను ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, పశువులకు వచ్చే వ్యాధులను నియంత్రించడానికి, పశు పోషణ ఖర్చు తగ్గించడానికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోందన్నారు. ఈ క్రమంలోనే పశు ఆరోగ్య శిబిరాల నిర్వహిస్తోందన్నారు. జిల్లాలోని 32 మండలాల్లో పశు ఆరోగ్య శిబిరాల నిర్వహణకు మండలానికి రెండు బృందాలను ఏర్పాటు చేశామన్నారు. ఒక్కో బృందంలో పశు వైద్యుడు, పారా వెటర్నరీ సిబ్బంది, పశువైద్య సహాయకుడు, గోపాల మిత్ర ఉంటారన్నారు. వీరంతా ఆయా గ్రామాల్లో శిబిరాలు నిర్వహించి పాడిపశువులకు వైద్య చికిత్సలు అందించడంతోపాటు గొర్రెలు, మేకలకు నట్టల నివారణ మందులు అందిస్తారన్నారు. పశుసంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ శుభదాస్ మాట్లాడుతూ, జిల్లాలోని అన్ని గ్రామాల్లో పశు ఆరోగ్య శిబిరాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. అనారోగ్యంగా ఉన్న జీవాలతో పాటు పశువులకూ చికిత్స అందిస్తామన్నారు. పశు ఆరోగ్య శిబిరాల గురించి రైతులకు తెలియజెప్పేందుకు ప్రచారం ముమ్మరం చేశామన్నారు. కార్యక్రమంలో పశు వైద్యుడు డాక్టర్ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment