రెచ్చిపోతున్న రౌడీమూకలు
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం:
కూటమి ప్రభుత్వం వచ్చాక రౌడీమూకలు రెచ్చిపోతున్నాయి. తప్పతాగి వీరంగం సృష్టిస్తున్నాయి. పేకాట డెన్‌లు, గంజాయి అమ్మకాలు విచ్చలవిడిగా నిర్వహిస్తున్నాయి. తప్పు అని చెప్పేవాళ్లపై దాడులకు తెగబడుతున్నాయి. ఇటీవల జిల్లా కేంద్రంలోని ఓ పెట్రోల్ బంకు ఎదురుగా గంటల తరబడి కారు అడ్డంగా పెట్టారని అడిగినందుకు కొందరు వ్యక్తులు అక్కడ సిబ్బందిని చితక బాదారు. తాజాగా ఆనందమయి ఫంక్షన్ హాల్‌లో టీడీపీ నాయకుడు ఫ్యామిలీ ఫంక్షన్ ముగిశాక మద్యం సేవించి వీరంగం సృష్టించారు. మద్యం తాగొద్దు అన్నందుకు ఫంక్షన్ మేనేజర్‌ను తీవ్రంగా కొట్టి గాయపరిచారు. ఇవన్నీ చూస్తే నగరంలో ప్రశాంత వాతావరణంకు భంగం వాటిల్లే పరిస్థితి ప్రమాదం కనిపిస్తోంది.
గొండు శంకర్ హాజరైన బర్త్‌డే పార్టీ ఆ రోజు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున హల్‌చల్ అయింది. ఎమ్మెల్యే పాల్గొన్నదగ్గ కార్యక్రమమేనా అని టీడీపీ సర్కిల్‌లోనూ చర్చ జరిగింది. ఆ ఫొటో రాష్ట్ర స్థాయిలో వైరల్ అయింది. రాష్ట్రంలో మిగతా చోట్ల జరిగిన ఘటనలను పోల్చుతూ సోషల్ మీడియాలో ట్రోల్ అయ్యింది. ఇప్పుడు ఆ పార్టీలో పాల్గొన్న వ్యక్తే తాజాగా ఆనందమయి ఫంక్షన్ హాల్ మేనేజర్‌పై దాడి చేశారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. దీంతో ఆ ఫొటో మళ్లీ సోషల్ మీడియా లో తెరపైకి వచ్చింది. రకరకాలుగా బేరీజు వేస్తూ...విశ్లేషణ చేస్తూ పోస్టులు నడిచాయి. ఎమ్మెల్యే శంకర్ వారి వెనుక ఉండటం వల్లే రెచ్చిపోతున్నారని విమర్శలు వెల్లువెత్తాయి. ఇదే సమయంలో హోటల్ అసోసియేషన్ ప్రతినిధులు కూడా అదే ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేసి, దాడి చేసిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
నగరంలో భయాందోళన..
ఇటీవల నగరంలోని ఓ పెట్రోల్ బంక్ ఎదుట పార్క్ చేసిన కారును తీయమన్నందుకు ఆ బంకు సిబ్బందిపై కొందరు దాడి చేశారు. దాడుల్లో శివ, కుమార్ అనే ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. దాదాపు 30 మంది వరకు దాడుల్లో పాల్గొనడంతో అక్కడ భయానక వాతావరణం కనిపించింది.
వ్యాపారుల్లో వణుకు..
వరుస ఘటనలతో ప్రజలతో పాటు వ్యాపారులు భయపడుతున్నారు. ఇటీవల జరిగిన రెండు ఘటనల దృష్ట్యా హోటల్ అసోసియేషన్ అప్రమత్తమైంది. మంగళవారం ఆనందమయి ఫంక్షన్ హాల్‌లో జరిగిన ఘటనను సీరియస్‌గా తీసుకుంది. బుధవారం సమావేశం నిర్వహించి మేనేజర్‌పై దాడి చేసిన ఘటనను ఖండించింది. అనంతరం ఎమ్మెల్యేను కలిసి ఫిర్యాదు చేశారు. ఎస్పీకి, ముఖ్యమంత్రికి సైతం ఫిర్యాదు చేయనున్నారు. ఈ ఘటనను తేలికగా తీసుకుంటే భవిష్యత్‌లో మరొకరు బరితెగిస్తారని ఆందోళన చెంది ముందుకెళ్లడానికి సిద్ధమయ్యారు.
కూటమి ప్రభుత్వంలో నగర ప్రశాంతతకు భంగం
అధికార దర్పంతో రెచ్చిపోతున్న పచ్చమూకలు
తాజాగా ఘటనపై ఉద్యమానికి సిద్ధమైన
హోటల్ అసోసియేషన్
ఇప్పటికే ఎమ్మెల్యే గొండు శంకర్‌కు ఫిర్యాదు
సీఎం, ఎస్పీలకు ఫిర్యాదులు సిద్ధం
ఈ ఫొటో చూడండి. తమ తోటి వ్యాపారి, ఫంక్షన్ హాల్ మేనేజర్‌పై జరిగిన దాడిని ఖండిస్తూ.. దాడి చేసిన రాయితి శ్రీను తదితరులపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే గొండు శంకర్‌కు హోటల్ అసోసియేషన్ ప్రతినిధులు బుధవారం ఫిర్యాదు చేసిన దృశ్యమిది. తక్షణమే చర్యలు తీసుకోవాలని.. ఇలాంటి వారిని ఉపేక్షించొద్దని హోటల్ అసోసియేషన్ ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు.
ఈ చిత్రం ఇటీవల సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. విషయం ఏమిటంటే ఓ వ్యక్తి జరుపుకున్న బర్త్‌డే పార్టీలో ఎమ్మెల్యే గొండు శంకర్ పాల్గొన్న ఫొటో ఇది. ఈ విశేషం పక్కన పెడితే ఇందులో గొండు శంకర్ వెనకున్న వ్యక్తే ప్రస్తుతం చర్చనీయాంశమయ్యారు. శంకర్ వెనకున్న వ్యక్తే తాజాగా ఆనందమయి ఫంక్షన్ హాల్ మేనేజర్‌పై దాడి చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈయన పేరు రాయితి శ్రీను. ఈయనతో పాటు మరికొందరు ఫంక్షన్ హాల్ మేనేజర్‌ను చితకబాదారని వన్‌టౌన్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో కేసు కూడా నమోదైంది.
కేసు నమోదు
శ్రీకాకుళం క్రైమ్ : నగరంలోని ఆనందమయి ఫంక్షన్ హాల్ మేనేజర్ సాధు ధనుంజయరావుపై దాడి ఘటనలో కేసు నమోదు చేసినట్లు శ్రీకాకుళం ఒకటో పట్టణ ఎస్‌ఐ హరికృష్ణ తెలిపారు. ఫంక్షన్ హాలును కొర్ను ప్రతాప్‌కుమార్తె బారసాల కార్యక్రమానికి బుక్ చేసుకున్నారని.. సాయంత్రం నాలుగున్నర ప్రాంతంలో మండంపం టైమింగ్ అయిపోవడంతో మేనేజర్ ధనుంజయ తమ సిబ్బందితో క్లీనింగ్ చేయిస్తున్నారని, అదే సమయంలో వధూవరుల గదిలో కొందరు వ్యక్తులు మద్యం సేవించడంతో వద్దని చెప్పడంతో వారంతా చుట్టుముట్టారని పేర్కొన్నారు. అందులో రాయితి శ్రీను అనే వ్యక్తి మేనేజర్ ధనుంజయపై పిడిగుద్దులతో దాడి చేయడంతో చెవికి గాయమైందని ఎస్‌ఐ తెలిపారు. 323, 324 సెక్షన్ల కింద కేసు నమోదు చేశామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment