మహిళా రోగులకు ఉచిత చికిత్సలు
శ్రీకాకుళం రూరల్: జిల్లా కేంద్రంలోని రాగోలు జెమ్స్ ఆసుపత్రిలో మహిళా రోగులకు ఉచిత క్యాన్సర్ చికిత్సలను గురువారం నిర్వహించనున్నట్లు మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ అశోక్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. అక్టోబర్‌ను రొమ్ముకాన్సర్ అవగాహన మాసంగా, స్క్రీనింగ్ ప్రోగ్రామ్ ఫర్ ఉమెన్ పేరిట నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటలకు వరకూ వైద్య సేవలందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు 6309990630, 7680945332 నంబర్లను సంప్రదించాలని కోరారు.
అనాథలకు అన్ లిమిటెడ్ ఫుడ్
కాశీబుగ్గ: తల్లిదండ్రులతో కలిసి హోటల్‌కు వెళ్లి భోజనం చేయడం.. తర్వాత షాపింగ్ చేయడం.. ఆనందంగా గడపడం.. ఇవన్నీ అనాథలకు అందని ద్రాక్షే. ఆ కలనే నిజం చేసేందుకు ఓ ఎన్‌ఆర్‌ఐ ముందుకొచ్చారు. పలాస మండలం లక్ష్మిపురం గ్రామానికి చెందిన బమ్మిడి కిషోర్ అనాథలకు ఆనందం కలిగించేందుకు చొరవ తీసుకున్నారు. పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీలో ప్రభుత్వం నడుపుతున్న బాలసదనంలో 30 మంది అనాథల పిల్లలను హోటల్‌కు తీసుకెళ్లి కోరుకున్న భోజనం పెట్టారు. ఐస్ క్రీమ్‌లు, స్నాక్స్.. ఇలా ఒకటేమిటి వారు ఏది అడిగితే అది కొనిపెట్టారు. అనంతరం ఓ పెద్ద షాపింగ్ మాల్‌కు తీసుకెళ్లి నూతన వస్త్రాలు కొనుగోలు చేశారు. దీంతో చిన్నారుల ఆనందానికి అవధులు లేకుండాపోయాయి.
పాక్షికంగా కిరణ దర్శనం
అరసవల్లి: ప్రత్యక్ష దైవం అరసవల్లి సూర్యనారాయణ స్వామి మూలవిరాట్టును రెండో రోజు బుధవారం కూడా సూర్యకిరణాలు తాకాయి. అయితే ఆకాశం మేఘవృతం కావడంతో ఉదయం 6.12 నిమిషాల సమయంలో ఓ మూడు నిమిషాల పాటు మాత్రమే పాక్షికంగా తాకినట్లు ఆలయ ప్రధానార్చకులు ఇప్పిలి శంకరశర్మ తెలిపారు. మంగళవారం అద్భుతంగా కిరణ దర్శనం జరగడంతో బుధవారం పెద్ద సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. దూరప్రాంతాల నుంచి వచ్చి వేకువజామున 4 గంటల నుంచి క్యూలైన్లలో వేచి ఉన్నారు. సూర్యోదయ వేళలో అనుమతివ్వడంతో ప్రత్యేక బారికేడ్ల లైన్లలో వేచి చూస్తూ కొద్ది క్షణాల పాటు కనిపించిన కిరణ దర్శనాన్ని చూసి తరించారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ ఈవో వై.భద్రాజీ, సూపరింటెండెంట్ కనకరాజు, సిబ్బంది చర్యలు చేపట్టారు. మళ్లీమార్చిలోనే కిరణ దర్శనం ఉంటుందని ప్రధానార్చకులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment