ఆశలు సమాధి చేస్తూ..!
శ్రీకాకుళం పాతబస్టాండ్: కొత్త పింఛన్ల కోసం ఎదురుచూస్తున్న వారికి కూటమి ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ఏ ఆర్థిక స్తోమత లేకుండా ఉన్న వృద్ధులు, వితంతువులకు చుక్కలు చూపిస్తోంది. పక్షపాత దోరణితో సర్కులర్ విడుదల చేసి కొంతమందికే ప్రయోజనం చేకూరేవిధంగా వ్యవహరిస్తోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సుమారు ఐదు నెలలు పూర్తి కావస్తున్నా, ఇంతవరకు రాష్ట్రంలో ఒక్క కొత్త పింఛన్ కూడా మంజూరు చేయలేదు. పైగా చాపకింద నీరులా ప్రతినెలా పింఛన్లు తగ్గించుకొస్తోంది. పింఛన్ మొత్తం పెంచామని సంబరాలు చేసిన కూటమి ప్రభుత్వం, కొత్తవారికి ఎందుకు పింఛన్లు ఇవ్వడం లేదో సమాధానం చెప్పడం లేదు. అంతేకాకుండా ఎన్నికల హమీల్లో 50 ఏళ్లకే పింఛన్ ఇస్తామన్న హమీ నేటి వరకు నెరవేర్చలేదు. ఆ మాట ఎక్కడా ఈ ప్రభుత్వం ప్రస్తావన కూడా తీసుకురాకపోవడం గమనార్హం.
సర్కులర్ విడుదల
తాజాగా ఈనెల 22న రాష్ట్ర ప్రభుత్వం ఒక సర్కులర్‌ను విడుదల చేసింది. దీని ప్రకారం నవంబర్ ఒకటి నుంచి డిసెంబర్ ఒకటో తేదీ వరకు పింఛనుదారు మరణించి ఉంటే వారి కటుంబంలో వారికి విడో పింఛన్ అందజేయనున్నట్లు పేర్కొన్నారు. అంటే ఈ సర్కులర్‌తో ఒక నెలలలో పింఛను ఉన్న భర్తను కోల్పోయినవారికి మాత్రమే వితంతు పింఛను ఇవ్వనున్నారు. అంటే అంతకుముందు జనవరి నుంచి పింఛన్ పొందుతున్న భర్తను కోల్పోయిన వితంతువులకు పింఛను మంజూరు అవ్వదు. అంతేకాకుండా వారు పింఛను కోసం దరఖాస్తు చేసుకొనే వెసులుబాటు కూడా కల్పించలేదు.
గత పరిస్థితులు
గుర్తొచ్చేలా..
గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు కొత్తవారికి అంటే వితంతువు, వికలాంగుడు, వృద్ధులు ఎవరికై నా పింఛన్ కావాలంటే అష్టకష్టాలు పడాల్సి వచ్చేంది. అర్హులందరికీ పింఛన్ ఇచ్చేవారు కాదు. ఆ గ్రామంలో ఒక పింఛన్‌దారు మరణిస్తే, ఆ స్థానంలో మరొకరికి పింఛన్ అందజేసేవారు. గ్రామ జనాభా ప్రాతిపదికన పింఛన్లకి సీలింగ్ ఉండేది. దీంతో కొత్త పింఛన్ పొందాలనుకునేవారు ఎవరైనా పింఛనుదారు మరణిస్తారా అని ఎదురు చూసేవారు. మరలా ప్రస్తుతం అటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయని వాపోతున్నారు.
వైఎస్సార్‌సీపీ హయాంలో...
గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో అర్హులందరికీ నిష్పక్షపాతంగా పింఛన్లు అందజేసేవారు. అర్హత ఉంటే ఎటువంటి సిపార్సులు లేకుండా పింఛను కోసం దరఖాస్తును సైతం వాలంటీర్లే పెట్టేవారు. అనంతరం మంజూరైన పింఛన్‌ను ఇంటి వద్దకే తెచ్చి అందజేసేవారు. కానీ కూటమి ప్రభుత్వం కొత్త పింఛన్లు ఇవ్వకపోగా, ఉన్నవాటిని తొలగిస్తోందని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చేనాటికి జిల్లాలో అన్ని రకాల పింఛన్లు 3,24,316 ఉండేవి, అవి నవంబర్ నాటికి 3,15,630కి చేరాయి.
పింఛన్లపై కూటమి కుట్రలు
నవంబర్ తర్వాత మరణించిన
కుటుంబాలకే పింఛన్
అంతకుముందు వారికి
మొండిచేయి
కొత్త పింఛన్ల నమోదుకు
వెసులుబాటు లేదు
అటకెక్కిన హామీ
50 ఏళ్లు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు వృద్ధాప్య పింఛన్ అందజేస్తామని ఎన్నికల ముందు చంద్రబాబు హామీ ఇచ్చారు. ఈ హామీని ఎన్నికల సమయంలో కూటమి నేతలు విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లారు. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆరు నెలలు పూర్తయినా కొత్త పింఛన్లు కోసం ఎటువంటి చర్యలు లేవు, కాగా ఈ హామీపై పాలకులు కనీసం స్పందించడం లేదు. మన జిల్లాలో 50 నుంచి 60 ఏళ్ల మధ్య వయస్సు ఉన్నవారు 3,05,537 మంది ఉన్నారు. వివిధ కారణాల వలన అంటే ఉద్యోగం, ఇన్‌కంటాక్సు, ఇతర ఆదాయ వనరులు ఉన్నవారు వీరిలో 30 శాతం ఉన్నా, మిగిలిన 70 శాతం మందికి పింఛన్ ఇవ్వాల్సింది. అంటే సుమారుగా 2,22,000 మందికి కొత్త పింఛను అందజేయాల్సింది. దీంతో వీరంతా ప్రస్తుతం సచివాలయాలు, ఎంపీడీవో కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. అయితే ఇంకా మార్గదర్శకాలు రాలేదని ఉద్యోగులు వెనక్కి పంపిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment