ఎంఈఓలదే గురుతర బాధ్యత
నాగారం: ప్రభుత్వ విద్యావ్యవస్థ బలోపేతానికి సర్కారు యత్నిస్తోంది. ప్రధానంగా ఇటీవల మండలానికి ఒక విద్యాధికారిని నియమించింది. గతంలో నాలుగైదు మండలాలకు ఒక్కరే ఎంఈఓ ఉండటంతో పర్యవేక్షణకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యేవి. మండలాల్లో సీనియర్ ప్రధానోపాధ్యాయులు, నోడల్ అధికారులను ఎంఈఓలుగా నియమిస్తూ వారికి గురుతర బాధ్యతలను అప్పగించింది. కొత్త ఎంఈఓలకు రాష్ట్ర విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి, విద్యాశాఖ సంచాలకుడు ఈవీ నర్సింహారెడ్డి, విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్ర వెంకటేశం హైదరాబాద్‌లో ఇటీవల దిశానిర్దేశం చేశారు.
ఎంఈఓల విధులు..
జిల్లావ్యాప్తంగా 23 మంది ఎంఈఓలు శిక్షణ పూర్తి చేసుకున్నారు. పాఠశాలల అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై ఉన్నతాధికారులు కార్యాచరణ రూపొందించారు. దీని ప్రకారం రోజువారీగా రెండు పాఠశాలలను ఎంఈఓలు తనిఖీ చేయాలి. విద్యార్థుల ముఖ గుర్తింపు హాజరు ద్వారా వంద శాతం హాజరయ్యేలా చొరవ చూపాలి. రోజు పాఠశాల సమయం కంటే పది నిమిషాల ముందే ఉపాధ్యాయులు హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలి. పాఠశాలల వసతులపై ఆరా తీసి అవసరమైన వాటిని సమకూర్చేలా మార్గదర్శకంగా వ్యవహరించాలి. ప్రధానంగా సర్వీస్ బుక్, స్కూల్ కాంప్లెక్స్, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ, పాఠశాలల ప్రధానోపాధ్యాయుల సమావేశాలు, పాఠశాలలకు హాజరై విద్యార్థుల విద్యా ప్రమాణాలు పెంచేలా మార్గనిర్దేశం చేయాలి. మధ్యాహ్న భోజనంలో ఆహారం ఆహారం రుచికరంగా ఉండేలా చూడాలి. భోజనం వండే గదిని శుభ్రంగా ఉంచేలా జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రభుత్వం అందజేసే పాఠ్యపుస్తకాలు, నోట్ పుస్తకాలు, మధ్యాహ్న భోజనం అమలు తీరును పర్యవేక్షించాలి. విద్యార్థుల డ్రాపౌట్స్‌ను తగ్గించాలి. పాఠశాలల స్థితిగతులపై నివేదిక రూపొందించాలి. ఉపాధ్యాయుల హాజరు సక్రమంగా ఉండేలా చూసుకోవాలి. ప్రతిఏడాది విద్యార్థుల సంఖ్య పెరిగేలా చొరవ చూపాలి. సీఆర్పీల పర్యవేక్షణ పెంచాలి.
ఫ శిక్షణ పూర్తి చేసుకున్న
23 మంది ఎంఈఓలు
ఫ పాఠశాలల అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం
నాణ్యమైన విద్య అందుతుంది
నూతన ఎంఈఓల రాకతోపాటు కొత్త ఉపాధ్యాయుల నియామకంతో ప్రభుత్వ పాఠశాలల్లో అభ్యసిస్తున్న విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుంది. ఎంఈఓలకు ఇటీవల పాఠశాలల పర్యవేక్షణ, విద్యా ప్రమాణాల పెంపుదల, పరిపాలన విధానం తదితర అంశాలపై శిక్షణ ఇచ్చారు.
– అశోక్, డీఈఓ, సూర్యాపేట
Comments
Please login to add a commentAdd a comment