నేడు అక్షయ తృతీయ | Sakshi
Sakshi News home page

నేడు అక్షయ తృతీయ

Published Fri, May 10 2024 6:25 PM

నేడు అక్షయ తృతీయ

సాక్షి, చైన్నె: అక్షయ తృతీయకు బంగారు దుకాణాలు ముస్తాబయ్యాయి. వినియోదారుల్ని ఆకర్షించేందుకు ప్రత్యేక డిజైన్లను కొలువు దీర్చడంతో పాటుగా ప్రత్యేక ఆఫర్లను ప్రకటించాయి. వివరాలు.. ప్రజల్లో రోజురోజుకూ బంగారం (పసిడి)పై మోజు పెరుగుతోంది. భూముల కొనుగోలుపై కన్నా బంగారంపై పెట్టుబడి పెట్టే వారే ప్రస్తుతం అధికం. పసిడి ధర ఆకాశాన్ని అంటుతూ వస్తున్నా కొనేవాళ్లు కొంటూనే ఉన్నారు. ఈ సమయంలో అక్షయ తృతీయ శుక్రవారం రానుండడంతో బంగారం విక్రయాలు మరింత జోరందుకోనున్నాయి. ఈ పర్వదినం వేల కనీసం ఒక్క గ్రాము బంగారాన్ని అయినా కొనుగోలు చేసి తీరాలనే ఆత్రూతతో జనం పరుగులు తీస్తుంటారు. ఈ రోజున బంగారం కొంటే లక్ష్మీదేవి తమ నట్టింట్లో అడుగు పెట్టినట్టేనని ప్రజలు విశ్వసిస్తుంటారు. దీంతో చైన్నెలోని బంగారు వర్తకులు సరి కొత్తగా స్కీలను అమలు చేయడంతో పాటు ప్రజలను ఆకర్షించే విధంగా ముందస్తు ఆర్డర్లు సిద్ధం చేసి ఉంచడం, సరికొత్త ఆఫర్లను ప్రకటించారు. నగరంలోనీ జీఆర్‌టీ, లలిత, ఖజానా, జోయ్‌ అలుకాస్‌, జోష్‌ అలూకాస్‌, కీర్తిలాల్‌, ఎన్‌ఏసీ, భీమా, వీబీజే తదితర షోరూంలు సరికొత్త డిజైన్లతో వినియోగ దారులను ఆకర్షించేందుకు ముస్తాబయ్యాయి. అక్షయ తృతీయ గడియలు శుక్రవారం వేకువ జామున 4.17 నుంచి శనివారం మధ్యాహ్నం 2.30 వరకు కొనసాగనున్నట్లు జ్యోతిష్కులు పేర్కొంటున్నారు. ఇందులోనూ బంగారం, వెండి వంటి ఆభరణాల కొనుగోలుకు ఉదయం 5.33 నుంచి మధ్యాహ్నం 12.18 వరకు శుభగడియలుగా పేర్కొనడం గమనార్హం.

వీబీజేలో ప్రదర్శన

ఉమ్మిడి బంగారు జ్యువెలర్స్‌(వీబీజే) అన్నాసాలై, అన్నానగర్‌లలో శుభకరమైన అక్షయ తృతీయ వేడుక పేరిట ప్రత్యేక బంగారు, వెండి, వజ్రాలు, ప్లాటినం ఆభరనాల సేకరణ ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఈనెల 12వ తేదీ వరకు ఈ ప్రదర్శన జరగనుందని ఆ జ్యువెలర్స్‌ ఎండీ అమరేంద్ర ఉమ్మిడి తెలిపారు. ప్రత్యేకంగా లక్ష్మీదేవి ప్రతిమతో ఆభరణాలు ఆకర్షణీయంగా తీర్చిదిద్దినట్టు పేర్కొన్నారు. ఈ సంవత్సరం అత్యంత పవిత్రంగా, సరికొత్తగా బ్రైడల్‌ అండ్‌ టెంపుల్‌ జ్యువెలరీ, సిల్వర్‌ వేర్‌, ప్లాటినం ఎవారా మల్టీ నీలమణి సేకరణ, విలువైన సాలిటైర్స్‌ నుంచి అనేక మోడళ్లను కొలువు దీర్చామన్నారు.

ప్రత్యేక ఆఫర్లతో

బంగారు షోరూంల ముస్తాబు

వీబీజేలో ప్రత్యేక ప్రదర్శన

Advertisement
 
Advertisement