ఆవిన్‌ కేంద్రంలో అవినీతి | Sakshi
Sakshi News home page

ఆవిన్‌ కేంద్రంలో అవినీతి

Published Sat, May 25 2024 12:05 PM

ఆవిన్‌ కేంద్రంలో అవినీతి

తిరువళ్లూరు: కాకలూరులోని ఆవిన్‌ పాలకేంద్రంలో భారీగా అవినీతి జరుగుతున్నట్టు విజిలెన్స్‌కు అందిన సమాచారం మేరకు అధికారులు చేపట్టిన తనిఖీల్లో గుట్టురట్టు అయ్యింది. ఆవిన్‌ కేంద్రం నుంచి రోజుకు 1,620 లీటర్ల పాలను తరలించి సొమ్ము చేసుకుంటున్నట్టు గుర్తించిన విజిలెన్స్‌ అధికారులు షాక్‌కు గురయ్యారు. తిరువళ్లూరు జిల్లా కాకలూరులోని ఆవిన్‌ పాల కేంద్రంలో పాడి రైతుల నుంచి రోజుకు లక్ష లీటర్లు పాలను సేకరించి 90 వేల లీటర్ల పాలను ప్యాకెట్‌ల రూపంలో ప్రజల కోసం వినియోగిస్తున్నారు. మిగిలిన పది వేల లీటర్లలో పెరుగు, మజ్జిగ, స్వీట్లు తయారు చేసి విక్రయిస్తున్నారు. కాకలూరులో ఆవిన్‌పాల కేంద్రంలో తయారయ్యే పాల ప్యాకెట్‌లను 26 నుంచి 30 లారీల ద్వారా వివిధ జిల్లాలకు సరఫరా చేస్తున్నారు. కాగా కాకలూరు ఆవిన్‌ కేంద్రంలో కొద్ది రోజులుగా భారీగా పాలను ఆక్రమంగా తరలించి సొమ్ము చేసుకుంటున్నట్టు విజిలెన్స్‌ ఽఅధికారులకు సమాచారం అందింది. దీంతో డీఎస్పీ సత్యశీలన్‌ నేతృత్వంలోని విజిలెన్స్‌ అధికారులు గురువారం రాత్రి 2 గంటలకు పాల వ్యాన్‌ వెళ్లే మార్గంలో నిఘా వుంచారు. నిఘాలో చెంగల్‌పట్టు, కాంచీపురం వెళుతున్న రెండు లారీలను మనవాలనగర్‌ వద్ద అడ్డుకున్న విజిలెన్స్‌ అధికారులు తనిఖీ చేశారు. తనిఖీల్లో ఇండెక్స్‌లో వున్న సంఖ్య కంటే రెండు లారీల్లో 1,620 లీటర్ల పాలు ఎక్కువగా వున్నట్టు గుర్తించిన అధికారులు లారీని ఆవిన్‌ కేంద్రానికి తీసుకెళ్లి విచారణ చేశారు. విచారణలో రెండు మూడు నెలల నుంచి రోజుకు వెయ్యి లీటర్లకు పైగా పాల ప్యాకెట్‌లు, ఆవిన్‌ వస్తువులను గుట్టు చప్పుడు కాకుండా తరలించి విక్రయిస్తున్నట్టు నిర్ధారించారు. ఇప్పటి వరకు రూ.2కోట్ల మేరకు ఆవిన్‌లోని రెగ్యులర్‌, కాంట్రాక్ట్‌ సిబ్బంది కాజేశారని నిర్ధారించి నివేదికను సిద్ధం చేశామని వీటిని ఆవిన్‌ ఎండీకి సమర్పిస్తామని వివరించారు. అవినీతిపై జనరల్‌ మేనేజర్‌ రమేష్‌కుమార్‌ మాట్లాడుతూ ఆవిన్‌లో అక్రమాలు జరిగినట్టు విజిలెన్స్‌ నిర్ధారించి ఉన్నతాధికారులకు నివేదికను సమర్పించారు. ఈ నివేదిక ఆధారంగా తప్పు చేసిన రెగ్యులర్‌ ఉద్యోగులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు కాంట్రాక్ట్‌ ఉద్యోగులను విధుల నుంచి తొలగిస్తామన్నారు. దీంతో పాటు అక్రమాలకు పాల్పడిన కాంట్రాక్టర్‌లను రద్దు చేస్తున్నట్టు తెలిపారు.

విజిలెన్స్‌ డీఎస్పీ ఆధ్వర్యంలో విచారణ

నాలుగు నెలలుగా సాగుతున్న దందా

అధికారులు కాంట్రాక్ట్‌ సిబ్బందిపై చర్యలు

Advertisement
 
Advertisement
 
Advertisement