విద్యుదాఘాతంతో
ఏనుగు మృతి
● రైతు అరెస్ట్
అన్నానగర్: ఈరోడ్ జిల్లాలోని టీఎన్ పాళయం సమీపంలోని ఎరుమైకుట్టై ఫారెస్ట్ సమీపంలో ఓ చెరకు తోట ఉంది. అటవీ ప్రాంతం నుంచి పంట పొలాలపైకి వచ్చిన మగ ఏనుగు పొలానికి ఏర్పాటు చేసిన విద్యుత్ తీగ తగిలి మృతి చెందింది. దీంతో కరెంటు తీగలు ఏర్పాటు చేసిన పొలం యజమాని శశికుమార్ అనే రైతును అటవీశాఖ అధికారులు సోమవారం అరెస్ట్ చేశారు. అలాగే పరారీలో ఉన్న పెరియసామి కోసం గాలిస్తున్నారు.
కార్మికుడి ఆత్మహత్య
అన్నానగర్: ఎర్నావూరు సునామీ క్వార్టర్స్‌కి చెందిన సురేందర్ (40) కూలి కార్మికుడు. ఇతను మద్యానికి బానిసైనట్లు తెలుస్తోంది. ఈనేపథ్యంలో రెండు రోజులుగా సురేందర్ ఇంటికి తాళం వేసి ఉంది. సోమవారం అతని ఇంటి నుంచి విపరీతమైన దుర్వాసన వచ్చింది. అనుమానించిన ఇరుగుపొరుగు వారు పోలీస్ కంట్రోల్ రూంకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఎన్నూర్ పోలీసులు ఇంటి తలుపులు పగులగొట్టి లోపలికి వెళ్లి చూడగా సురేందర్ ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిసింది. 2 రోజులు కావడంతో అతని మృతదేహం కుళ్లిన స్థితిలో కనిపించింది. ఈమేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
రోడ్డు ప్రమాదంలో
ప్లస్–1 విద్యార్థి దుర్మరణం
అన్నానగర్: నెల్‌లై తాలైయూత్తు నేతాజీ నగర్‌కు చెందిన మారియప్పన్ కుమారులు భువనేష్ రాజు, ఉత్తిరపాలన్(17). ఉత్తిరపాలన్ ఓ ప్రైవేట్ పాఠశాలలో ప్లస్–1 చదువుతున్నాడు. ఆదివారం ఉత్త్తిరపాలన్, అతని సోదరుడు భువనేష్ రాజు తమ స్నేహితులతో కలిసి నెల్‌లై తచ్చనల్లూరు ప్రాంతంలో క్రికెట్ ఆడేందుకు వేర్వేరు బైకులపై వెళ్లారు. అక్కడ క్రికెట్ ఆడి సాయంత్రం ఇద్దరూ ఇంటికి బయలుదేరారు. ఆ సమయంలో వర్షం కురుస్తోంది. చిదంబర నగర్ అడవి ప్రాంతంలో వెళుతుండగా ఉత్తిరపాలన్ నడుపుతున్న బైకు అదుపు తప్పి రోడ్డుపక్కన ఉన్న వర్షపు నీటి ప్రవాహంలోకి దూసుకెళ్లింది. ఆ వాగులో నీరు ప్రవహిస్తుండగా, ఉత్తిరపాలన్ ఓ పైపులో ఇరుక్కుపోయాడు. వెనుకే మరో బైకు పై వచ్చిన భువనేష్ రాజు పైపులో ఇరుక్కుపోయిన తన తమ్ముడు ఉత్తిరపాలను రక్షించేందుకు పరిగెత్తాడు. అయితే అప్పటికి ఉత్తిరపాలన్ మృతి చెందినట్లు తెలిసింది. స్థానిక పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ అస్పత్రికి తరలించి కేసు విచారణ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment