తాడేపల్లి, సాక్షి: వైఎస్సార్‌సీపీ సోషల్ మీడియాపై ప్రభుత్వం కక్షకట్టి కేసులు పెడుతోందని వైఎస్సార్‌సీపీ లీగల్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మనోహర్ రెడ్డి అన్నారు. కృష్ణా జిల్లాలో నిన్న( ఆదివారం) ఒక్కరోజే 42 కేసులు పెట్టారని మండిపడ్డారు. వరదల్లో జరిగిన అక్రమాలపై ప్రశ్నించారని కేసులు పెడుతున్నారని తెలిపారు.
ఆయన సోమవారం మీడియాతో మాట్లాడారు. ‘‘మంచిపనుల మీద గత ప్రభుత్వాలు డ్రైవ్ చేసేవి. కానీ కూటమి ప్రభుత్వం ప్రత్యర్థులపై కేసులు పెట్టడానికి డ్రైవ్ చేస్తోంది. సుప్రీంకోర్టు మార్గదర్శకాలను కూడా పక్కనపెట్టి పోలీసులు వ్యవహరిస్తున్నారు. డీజీపీ ద్వారకాతిరుమలరావు అనంతపురం జిల్లాలో ఏఎస్పీగా పని చేసినప్పుడు ఎంతో మంచి పేరు ఉండేది. అలాంటి వ్యక్తేనా ఇప్పుడు డీజీపీగా పని చేస్తున్నదీ?. ప్రభుత్వ పెద్దల మాటలు విని వ్యవస్థను భ్రష్టు పట్టించవద్దు.
డిపార్ట్‌మెంట్‌ను నిర్వీర్యం చేయవద్దని కోరుతున్నాం. 41ఏ నోటీసులు కూడా ఇవ్వకుండా అరెస్టులు చేస్తున్నారు. కుటుంబ సభ్యులకు కూడా సమాచారం ఇవ్వటం లేదు. నాలుగైదు స్టేషన్లు తిప్పి భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. అధికార కూటమికి తలొంచి అక్రమ కేసులు పెడితే ప్రైవేటు కేసులు వేస్తాం. సుప్రీంకోర్టు వరకు వెళ్తాం. రెడ్‌బుక్ రాజ్యాంగం ద్వారా వైఎస్సార్‌సీపీని లేకుండా చేయాలనుకోవటం వారి అవివేకం.
అధికారంలో ఉన్నా లేకపోయినా తప్పులను ప్రశ్నిస్తూనే ఉంటాం. ప్రభుత్వం ఇచ్చిన లెక్కలతో కార్టూన్లు వేసినా కేసులు పెడుతున్నారు. టీవీల్లో వచ్చే వార్తలను పోస్టు చేసినా కూడా కేసులు పెట్టటం ఏంటి? వైఎస్ జగన్ హయాంలో పోలీసులు స్వేచ్చగా పని చేశారు. ఇప్పుడు ఎన్ని అక్రమ కేసులు పెట్టినా మా లీగల్ సెల్ టీమ్ అండగా ఉంటుంది’’ అని అన్నారు.
‘చంద్రబాబుకు ఏ వ్యవస్థ మీద కంట్రోల్ లేదు’
రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా దెబ్బ తిన్నాయని, పోలీసు వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యం అయిపోయిందని మాజీ మంత్రి అప్పలరాజు మండిపడ్డారు. రాష్ట్రంలో ఎలా దాడులు జరుగుతున్నాయో మనం చూస్తూ ఉన్నామని అన్నారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడారు.
‘‘పలాసలో నడి రోడ్డుపై దాడి జరిగితే.. వారిపై ఫిర్యాదు చేసేందుకు వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు పోలీస్ స్టేషన్‌కు వెళ్తే అక్కడ కూడా వారిపై దాడి చేశారు. జిల్లా ఎస్పీ దానిపై చర్యలు తీసుకోవాలని కోరేందుకు వచ్చాం.. ఎస్పీ కూడా ఏమీ చేయలేమంటూ చేతులెత్తేశారు. అధికార దుర్వినియోగానికి పాల్పడిన ప్రతీ అధికారి రాబోయే రోజుల్లో తగిన పరిష్కారం ఎదుర్కొంటారు. సోషల్ మీడియాలో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు చిన్న పోస్ట్ పెడితే పోలీస్ స్టేషన్‌కు పిలిచి వేధిస్తున్నారు.
అత్యాచారాలు, హత్యలు, దౌర్జన్యాలు జరుగుతుంటే ప్రభుత్వం ఒక్కదానిపైనైనా దృష్టి పెడుతుందా?. ఏ కార్యకర్తపై ఎప్పుడు దాడులు చేస్తారో.. ఏ కేసులు పెడతారో తెలియటం లేదు. వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి వేధిస్తున్నారు. గత ఐదు సంవత్సరాలు పలాసను అభివృద్ధిలో పరుగులు పెట్టించాం. కానీ ఇప్పుడు దాడులు, దౌర్జన్యాలు జరుగుతున్నాయి. చంద్రబాబుకు ఏ వ్యవస్థ మీద కంట్రోల్ లేదు?. వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు కొద్దిగా ఓపిక పట్టండి.. ప్రతి ఒక్కరి కష్టాలు మన నాయకుడు వైఎస్ జగన్ దృష్టిలో ఉన్నాయి.
రాబోయే రోజుల్లో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు ప్రజలకు మంచి జరుగుతుంది. చంద్రబాబు హయాంలో ఒక్క పోర్టుకు అయినా ఒక హార్బర్ అయినా శంకుస్థాపన చేశారా? కానీ ఇప్పుడు పోర్టులను ప్రైవేటీకరణ చేయాలని చూస్తున్నారు. అధికారంలోకి వస్తే మత్స్యకారుల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు చేపడతామని హామీ ఇచ్చిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏమైపోయారు. ఇప్పుడు చంద్రబాబు పోర్టులను ప్రైవేటీకరణ చేస్తుంటే. పవన్ ఏం చేస్తున్నారు. ఫిషింగ్ హార్బర్లు ప్రైవేటీకరణపై తీర ప్రాంతంలో ఉన్న ప్రతి మత్స్యకారుడు కూడా ఆలోచించాలి. గిరిజన భూములపై గిరిజనులకు ఎంత హక్కు ఉందో.. సముద్రంపై తీర ప్రాంతంలోని మత్స్యకారుడికి కూడా అంతే హక్కుంది’ అని అన్నారు.
‘హిట్లర్, గడాఫిల తరహా పాలన జరుగుతోంది’
తాడేపల్లి: ఏపీలో హిట్లర్, గడాఫిల తరహా పాలన జరుగుతోందని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్ రెడ్డి ధ్వజమెత్తారు. ప్రతినిత్యం అత్యాచారాలు, హత్యలు జరుగుతున్నాయని సోషల్‌మీడియాలో పోస్టులు పెడితే కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. పుత్తా శివశంకర్‌రెడ్డి సోమవారం మీడియతో మాట్లాడారు.
‘‘చంద్రబాబు పచ్చ మీడియాను మేనేజ్ చేసి అక్రమాలను బయటకు రానీయకుండా చేస్తున్నారు.అందుకే సోషల్ మీడియా ద్వారా తప్పులను వెలికితీస్తున్నాం. ప్రశ్నిస్తూ పోస్టులు పెడితే కూడా అరెస్టులు చేస్తారా?. విజయమ్మ కారు టైర్లు పంక్చర్ అయితే ఆమెను చంపటానికి ప్రయత్నం చేశారంటూ టీడీపీ సోషల్ మీడియా పోస్టులు పెట్టింది. అలాంటి వారిపై కూటమి ప్రభుత్వం ఎందుకు కేసులు పెట్టటంలేదు?
.. ప్రశ్నించటానికే పార్టీ పెట్టాననే వ్యక్తి.. ఇప్పుడు ఎవరైనా ప్రశ్నిస్తే ఒప్పుకోరంట. అక్రమ కేసులు పెట్టేవారిని వదిలేదేలేదు. వైఎస్ జగన్ ప్రభుత్వం హయాంలో పెట్టిన కేసులను విత్ డ్రా చేసుకోవాలని బెదిరిస్తున్నారు. వేలకోట్ల అప్పులు తెచ్చి ఒక్క పథకమూ అమలు చేయటం లేదు. 4వ తేదీ వచ్చినా టీచర్లకు జీతాలు ఇవ్వలేదు. వీటిపై జనంలో చర్చ మొదలవగానే డైవర్షన్ పాలిటిక్స్ మొదలెట్టారు’’ అని అన్నారు.
‘ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది’
అనంతపురం: ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని మాజీ ఎమ్మెల్యే అనంతవెంకటరామిరెడ్డి అన్నారు. రెడ్ బుక్ థర్డ్ చాప్టర్ అమలు చేస్తానని మంత్రి నారా లోకేష్ ప్రకటించడం దుర్మార్గమని మండిపడ్డారు. నారా లోకేష్ హింసా రాజకీయాలు ప్రేరెపిస్తున్నారని ధ్వజమెత్తారు. వైఎస్సార్‌సీపీ సోషల్ మీడియా కార్యకర్తలపై అక్రమ కేసులను ఖండిస్తున్నాని అన్నారు.
‘చంద్రబాబుది.. చేతకాని దద్దమ్మ ప్రభుత్వం’
అనంతపురం: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిది చేతకాని దద్దమ్మ ప్రభుత్వమని మాజీ ఎమ్మెల్యే పీజేఆర్ సుధాకర్ బాబా అన్నారు. ఇచ్చిన హామీలను అమలు చేయడంలో చంద్రబాబు విఫలం అయ్యారని మండిపడ్డారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడారు.
‘‘ఎన్నికలు ఎప్పుడు వచ్చినా టీడీపీ కూటమికి ఓటమి తప్పదు.రుషికొండ భవనాలు.. వైఎస్ జగన్ సొంత భవనాలు కాదన్న విషయాన్ని చంద్రబాబు గుర్తించాలి. రుషికొండ భవనాలు టూరిజం శాఖకు చెందినవి. అమరావతిలో చంద్రబాబు నిర్మించిన తాత్కాలిక భవనాలు నాసిరకంగా ఉన్నాయి. పార్క్ హయత్, లేక్ వ్యూ గెస్ట్ హౌస్‌లకు ఎంత డబ్బు చెల్లించారో చంద్రబాబు చెప్పాలి. చంద్రబాబు ఎన్ని వేధింపులకు గురి చేసినా వైఎస్సార్‌సీపీ శ్రేణులు భయపడవు’’అని అన్నారు.
చంద్రబాబు ఆదేశాలతో దాడులు
కర్నూలు: రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపులో లేవని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి మండిపడ్డారు. సీఎం చంద్రబాబు ఆదేశాలతో వైఎస్సార్‌సీపీ కార్పోరేటర్ కాటరీ పల్లవి కుటుంబ సభ్యులపై మంత్రి అనుచరులు దాడి చేశారని అన్నారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడారు.
‘‘కాటరీ పల్లవిపై దాడి చేసిన వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలి. రాష్ట్రంలో అరాచకాలు మీతిమీరినట్లు స్వయంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు హయాంలో కబ్జాలు, దాడులు అత్యాచారాలు పెరిగిపోతున్నాయి’’ అని అన్నారు.
చదవండి: ఏపీలో ప్రశ్నించే గొంతులపై ఉక్కుపాదం.. సోషల్ మీడియా కార్యకర్తలపై కేసుల పరంపర
Comments
Please login to add a commentAdd a comment