కుమరిలో తిరువళ్లువర్ విగ్రహ సిల్వర్ జూబ్లీ వేడుక
● డిసెంబరులో నిర్వహణ ● 14,15 తేదీలలో అరియలూరు, పెరంబలూరుకు సీఎం ● 17 యూనియన్ పంచాయతీలకు భవనాలు
సాక్షి, చైన్నె: కన్యాకుమారి సాగరంలో కొలువై ఉన్న తిరువళ్లువర్ విగ్రహ సిల్వర్‌జుబ్లీ వేడుకలను అత్యంత కోలాహలంగా నిర్వహించేందుకు సీఎం స్టాలిన్ నిర్ణయించారు. ఇందుకు సంబందించిన వీడియోను మంగళవారం సీఎం విడుదల చేశారు. కలైంజ్ఞర్ కరుణానిధి కన్యాకుమారిలో తమిళ మహాకవి తిరువళ్లువర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. సముద్ర కెరటాలు ఎగిసిపడే కుమారి సముద్రం మధ్యలో 133 అడుగుల తిరువళ్లువర్ విగ్రహం 2000 సంవత్సరంలో కొలువైనట్టు వివరించారు. తిరువళ్లువర్ కీర్తికి నిలువెత్తు దర్పణంగా ఉన్న ఈ విగ్రహం సిల్వర్ జుబ్లీ వేడుకలకు సిద్ధమవుతోందన్నారు. ఈ విగ్రహాన్ని ప్రతిష్టించి 25 ఏళ్లు కావస్తుండటంతో డిసెంబరు 31, వచ్చే ఏడాది జనవరి 1వ తేదీ రెండు రోజుల బ్రహ్మాండ వేడుక నిర్వహించాలని నిర్ణయించామని ప్రకటించారు. ఈ సందర్భంగా తిరువళ్లువర్ తిరుక్కురల్‌లోని అంశాలను గుర్తు చేస్తూ, తిరువళ్లువర్‌కు కాషాయం రంగు రుద్దేందుకు జరుగుతున్న ప్రయత్నాలపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తిరువళ్లువర్ తమిళులందరికి చిహ్నం అని వివరిస్తూ, 25 సంవత్సరాల వేడుకకు స్వయంగా తాను హాజరు కాబోతున్నానని ప్రకటించారు. ఈసందర్భాన్ని పురస్కరించుకుని – కళాశాల విద్యార్థుల మధ్య సోషల్ మీడియాలో లఘు చిత్రాలు, వివిధ చిత్రాలు, డిజిటల్ టెక్నాలజీ ద్వారా తిరుక్కురల్ ఘనత చాటే పోటీలను నిర్వహించనున్నామని వివరించారు. ఇదిలా ఉండగా సీఎం స్టాలిన్ క్షేత్ర స్థాయి పర్యటన తదుపరి అరియలూరు, పెరంబలూరు జిల్లాలో జరగనున్నది. ఈనెల 14,15 తేదీలలో ఈరెండు జిల్లాలో ఆయన విస్తృతంగా పర్యటించబోతున్నారు. ఇదిలా ఉండగా, సచివాలయంలో జరిగిన కార్యక్రమంలో మంగళవారం గ్రామీణాభివద్ధి, పంచాయతీ శాఖ నేతృత్వంలో రూ.64.53 కోట్లతో పూర్తి చేసిన 17 పంచాయతీ యూనియన్ కార్యాలయాల భవనాలను సీఎం స్టాలిన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. కడలూర్, ఈరోడ్, కన్యాకుమారి, పుదుకోట్టై, తెన్‌కాశి, తంజావూరు, తేని, తూత్తుకుడి, తిరుచ్చి, తిరుపూర్, విల్లుపురం జిల్లాలో ఈ యూనియన్ పంచాయతీ కార్యాలయాల భవనాలను నిర్మించారు. కాగా, డీఎంకే కార్యకర్తలకు సీఎం స్టాలిన్ ఓ లేఖ రాశారు. ఇందులో ద్రావిడ ప్రజలు మన వెన్నంటే ఉన్నారని, దీనిని చూసి ప్రత్యామ్నాయం అంటూ వస్తున్న వారిలో కలవరం బయలు దేరి ఉందని పరోక్షంగా విజయ్ పార్టీని ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. ప్రత్యామ్నాయం అని వ్యాఖ్యలు చేసే వారికి ద్రావిడ మోడల్ విజయం ఏమిటో, చరిత్ర సృష్టించే విధంగా తెలియచేద్దామని పిలుపు నిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment