విడతలవారీగా అటవీ గ్రామాలకు రోడ్డు వసతి
వేలూరు: వేలూరు జిల్లా అనకట్టు నియోజక వర్గంలోని అన్ని అటవీ గ్రామాలకు రోడ్డు వసతి ఏర్పాటు చేయాలని గ్రామస్తులు వేడుకున్నారు. అనకట్టు నియోజక వర్గంలో ప్రజలతో ముఖ్యమంత్రి పథకం కలెక్టర్ సుబ్బలక్ష్మి అధ్యక్షతన మంగళవారం జరిగింది. ఈ సందర్భంగా సుమారు నాలుగు గ్రామ పంచాయతీలకు చెందిన ప్రజలు వివిధ సమస్యలపై వినతి పత్రాలు సమర్పించారు. అందులో 445 మంది లబ్ధిదారులను ఎంపిక చేసి వారికి వివిధ శాఖల ద్వారా రూ: 9.16 లక్షలు విలువ చేసే సంక్షేమ పథకాలను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ ప్రాంతంలో అధికంగా అటవీ గ్రామాలో ఉండటంతో విడతల వారీగా అన్ని గ్రామాలకు రోడ్డు వసతి ఏర్పాటు చేస్తున్నామని త్వరలోనే తారు రోడ్డు వేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. గతంలో ఈ ప్రాంతంలోని వారు ఎవరైనా అనారోగ్యానికి గురైతే డోలి కట్టి కొండ కిందకు తీసుకొచ్చి ఆసుపత్రికి తీసుకెల్లే వారన్నారు. ప్రస్తుతం తమ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ప్రస్తుతం కొంత వరకు రోడ్డు సౌకర్యం ఏర్పాటు చేశామన్నారు. అదేవిధంగా ప్రభుత్వం అందజేస్తున్న అన్ని సంక్షేమ పథకాలను కొండ ప్రాంత వాసులకు చేరే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. వీటిని సద్వినియోగం చేసుకొని చిన్న చిన్న వృత్తులు ప్రారంభించి వాటి ద్వారా అభివృద్ధి చేయాలన్నారు. ప్రస్తుతం పథకాలు అందని లబ్దిదారులకు కూడా త్వరలోనే విచారణ జరిపి అందరికీ సంక్షేమ ఫలాలు అందే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో డీఆర్‌ఓ మాలతి, జెడ్పీ ఛైర్మన్‌బాబు, సబ్ కలెక్టర్ బాల సుబ్రమణియన్, తహసీల్దార్ వేండా పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment