మద్రాసు ఐఐటీలో వర్చువల్ రియాలిటీ సెంటర్
సాక్షి, చైన్నె: జాతీయ స్థాయిలో విద్యా భాగస్వామ్యం లక్ష్యంగా ఐఐటీ మద్రాసులో వర్చువల్ రియాలిటీ సెంటర్‌ఏర్పాటు కానుంది. ఈనెల 16, 17వ తేదీన జరిగే సమ్మిట్‌లో అత్యాధునిక రంగంలో ఎక్స్ ఆర్ స్టార్టప్ ఎకోసిస్టమ్‌ను అందుబాటులోకి తీసుకు రాబోతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఎక్స్ ఆర్ కోర్సులను విస్తరించడానికి దీనిని తొలిమెట్టుగా నిర్ణయించారు. ఎక్స్‌పెరెన్సియల్ టెక్నాలజీ ఇన్నో వేషన్ సెంటర్, వర్చువల్ రియాలిటీ సంబంధిత రంగాలలో ఐఐటీ మద్రాస్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆఫ్ ఎమినెన్స్ సెంటర్, (అకడమిక్ పార్టనర్‌షిప్ ప్రోగ్రామ్)గా ఎక్స్‌టెండెడ్ రియాలిటీని పెంచడానికి నిర్ణయించారు. గ్లోబల్ మార్కెట్ కోసం భారతదేశంలో అత్యంత శిక్షణ పొందిన ఎక్స్ ఆర్ డెవలపర్లు డిజైనర్లను తీర్చిదిద్దడం లక్ష్యంగా ఈ సెంటర్ మీద దృష్టి పెట్టనున్నారు. ఈ విషయంగా మంగళవారం ఐఐటీ మద్రాసు ఫ్యాకల్టీ హెడ్, ప్రొఫెసర్ మణివణ్ణన్ మాట్లాడుతూ భారతదేశం ఎక్స్ ఆర్ కారిడార్‌ను స్థాపించాలనే లక్ష్యాన్ని సాధించడానికి చర్యలు చేపట్టామన్నారు. 2047 నాటికి, హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్ రెండింటిలోనూ అధిక నాణ్యత గల ఎక్స్ ఆర్ సిస్టమ్ డిజైనర్‌లు, డెవలపర్‌ల మానవశక్తి వనరులను ఉత్పత్తి చేయడానికి సిద్ధమైనట్టు వివరించారు. అందుకే ఎక్స్ ఆర్ ఆవిష్కరణలపై దృష్టి సారించే సమ్మిట్‌కు ఏర్పాట్లు చేశామన్నారు. ఈ సమ్మిట్‌లో టాప్ 10 ఎక్స్ ఆర్ స్టార్టప్‌లు, అంతర్జాతీయ ఎక్స్ ఆర్ స్టార్టప్‌లకు అవార్డులు, సోషల్ ఇంపాక్ట్ అవార్డు లు, ఉత్తమ ఎక్స్ ఆర్ సహకార తదితర అవార్డులను ప్రదానం చేయబోతున్నామని పేర్కొన్నారు.
అధిక వడ్డీ ఆశ చూపి 30 మందికి కుచ్చుటోపీ
● సైబర్ నేరగాళ్ల కోసం పోలీసుల విచారణ
కొరుక్కుపేట: ఆన్‌లైన్ యాప్‌లో డబ్బు పెట్టుబడి పెడితే అధిక వడ్డీ వస్తుందని చెప్పి 30 మంది నుంచి కోట్లాది రూపాయలు లూటీ చేశారు. దీంతో 30 మంది బాధితులు సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాలు.. పుదుచ్చేరి, కారైక్కల్‌లలో రోజురోజుకూ ఆన్‌లైన్ మోసాల ముఠాలు ప్రజల నుంచి వివిధ మార్గాల్లో డబ్బులు దండుకుంటున్నాయి. వెబ్‌సైట్లలో ప్రకటనలు, ఆకర్షణీయమైన ఆఫర్‌లపై ఆధారపడి మోసగాళ్లకు ప్రజలు తమ డబ్బును పోగొట్టుకుంటున్నారు. ఈ సందర్భంలో ఆన్‌లైన్ యాప్ వెబ్‌సైట్‌లో డబ్బు పెట్టుబడి పెడితే అధిక వడ్డీ వస్తుందని టెలిగ్రామ్ సహా సోషల్ మీడియా ద్వారా ప్రచారం జరిగింది. దీన్ని నమ్మి కొందరు వ్యక్తులు యాప్‌లో రూ. వెయ్యి నుంచి పది వేల వరకు పెట్టుబడి పెట్టారు. రెండు రోజుల తర్వాత 10 వేలకు రూ. 2,000 వడ్డీ రేటుతో పెట్టుబడి పెట్టిన సాధారణ ప్రజలకు డబ్బు తిరిగి వచ్చింది. దీంతో మరింత మంది రూ.లక్ష నుంచి రూ.5 లక్షల వరకు పెట్టుబడి పెట్టారు. తర్వాత ఎలాంటి వడ్డీ రాకపోవడంతో మోసపోయిన 30 మందికి పైగా బాధితులు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.
చైన్నె సంగీతోత్సవాలకు ప్రపంచవ్యాప్తంగా ఆదరణ
కొరుక్కుపేట: చైన్నెనగరంలో డిసెంబర్‌లో నిర్వహించే మార్గళి సంగీతోత్సవాలకు ప్రపంచ వ్యాప్తంగా విశేష ఆదరణ లభిస్తోందని మ్యూజిక్, డ్యాన్స్ అండ్ డ్రామా సంస్థ సీఈవో కల్యాణ సుందరం తెలిపారు. ఈ మేరకు మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ సంగీత నగరంగా ఐక్యరాజ్యసమితి గుర్తింపు పొందిన చైన్నెకు ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు. ఏటా డిసెంబర్ 1 నుంచి జనవరి 15 తేదీ వరకు దాదాపు ఒకటిన్నర మాసం పాటు చైన్నె నగరంలో వివిధ సభలల్లో మార్గళి సంగీతోత్సవాలు వైభవంగా జరుగుతాయని తెలిపారు. ఈ సంగీత కార్యక్రమాలకు దేశవ్యాప్తంగానే కాకుండా విదేశాల నుంచి సైతం సంగీత ప్రియులు విచ్చేస్తున్నట్లు తెలిపారు. సంగీత ప్రియులకు ఆయా సభల్లో జరిగే సంగీత కార్యక్రమాలకు ఎండీఎన్‌డీ సంస్థ టిక్కెట్‌లను, క్యాటిన్ టోకన్‌లను ఆన్‌లైన్ ద్వారా విక్రయిస్తున్నట్టు తెలిపారు. 2024–25 సంగీతోత్సవాలకు తమ సంస్థ కచేరి టిక్కెట్‌లను బుక్ చేసుకునే సదుపాయాన్ని ప్రారంభించామన్నారు. నగరంలోని 14 సంగీత సభలతో భాగస్వామ్యం చేసుకున్నామని తెలిపారు. ఆయా సభల్లో జరిగే అన్ని కార్యక్రమాలకు టిక్కెట్‌లను బుక్ చేసుకోవచ్చునని పేర్కొన్నారు. టిక్కెట్ల కోసం www.mdnd.in ను చూడవచ్చని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment