హోసూరులో అంతర్జాతీయ విమానాశ్రయం
● కసరత్తు ముమ్మరం చేసిన అధికారులు ● ఐదు చోట్ల స్థలం గుర్తింపు
సాక్షి, చైన్నె : విమానాశ్రయం కోసం హోసూరులో ఐదు చోట్ల రాష్ట్ర ప్రభుత్వం స్థలాల్ని గుర్తించి ఉంది. ఇందులో ఓ స్థలాన్ని సమగ్ర పరిశీలనలో ఎంపిక చేసి కేంద్ర విమానయాన శాఖకు పంపించేందుకు అధికారులు కసరత్తు చేపట్టారు. రాష్ట్రంలో చైన్నె, కోయంబత్తూరు, తిరుచ్చి, మదురైలలో అంతర్జాతీయ విమానాశ్రయాలు ఉన్న విషయం తెలిసిందే. అలాగే సేలం, తూత్తుకుడి స్వదేశీ విమానాశ్రయ టెర్మినల్స్ ఉన్నాయి. కడలూరు జిల్లా నైవేలిలో స్వదేశీ టెర్మినల్ ఒకటి, కృష్ణగిరి జిల్లా హోసూరులో అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణానికి కసరత్తు జరుగుతూ వస్తోంది. ఇటీవల రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ హోసూరులో విమానాశ్రయం ఏర్పాటుకు సంబంధించిన స్పష్టమైన ప్రకటన చేశారు. ఇందుకు కారణం హోసూరు పారిశ్రామికంగా దూసుకెళ్తుండటమే. ఇక్కడ 3 వేలకు పైగా పరిశ్రమలు ఉన్నాయి. వివిధ విడి భాగాలు, గడియారం, బంగారు ఆభరణాలు, ద్విచక్ర, హెవి వెహికల్స్ ఉత్పత్తి జరగడమేకాకుండా విదేశాలకు ఎగుమతులు జరుగుతున్నాయి. అయితే, ఇక్కడి నుంచి కర్ణాటక రాష్ట్రం బెంగళూరు విమానాశ్రయాన్ని విదేశీ ఎగుమతుల నిమిత్తం ఆశ్రయించాల్సి ఉంది. ఇక్కడ ఓ ప్రైవేటు విమానాశ్రయం ఉన్నా, దానిని పెద్దగా ఉపయోగించడం లేదు. ఈ పరిస్థితులలో రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటుతో ఒక్క కృష్ణగిరి జిల్లానే కాదు, పొరుగున ఉన్న ధర్మపురి జిల్లాను పారిశ్రామికంగా ఉన్నత స్థానంలో నిలబెట్టడం, అభివృద్ధి పథంగా ముందుకు తీసుకెళ్లడం లక్ష్యంగా హోసూరులో విమానాశ్రయానికి నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన కసరత్తు గత కొన్ని నెలలుగా జరుగుతూ వస్తున్నాయి. అదే సమయంలో హోసూరు కార్పొరేషన్‌గా సైతం ప్రకటించారు. ఈ పరిస్థితులలో విమానాశ్రయం కోసం ఐదు చోట్ల స్థలాలను ఎంపిక చేసి ఉన్నారు.
కసరత్తు..
హోసూరు ప్రైవేటు విమానాశ్రయం, పరిసరాలు, ఇక్కడి నుంచి దక్షిణ దిక్కున 2 కి.మీ దూరంలో ఉన్న ప్రాంతాలు, 10 కి.మీ దూరంలో ఉన్న తోగరై అగ్రహారం, ఆగ్నేయం దిశలో 27 కి.మీ దూరంలో ఉన్న ఉలగం గ్రామం పరిసరాలు, 16 కి.మీదూరంలోని దాసపల్లి పరిసరాలలో ఈ స్థలాలను ఎంపిక చేశారు. ఈ స్థలాలను కేంద్ర విమానాయాన శాఖ అధికారులు, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు పరిశీలిస్తున్నారు. ఇందులో ఒకటి ఎంపిక చేయనున్నారు. ఆ తదుపరి రాష్ట్ర ప్రభుత్వం, విమానయాన శాఖలు విమానాశ్రయానికి స్థల కేటాయింపు, పనులకు సంబంధించిన కసరత్తుల మీద దృష్టి పెట్టనున్నారు. ఇదిలా ఉండగా, ఇప్పటికే చైన్నెకు ప్రత్యామ్నాయంగా పరందూరులో మరో విమానాశ్రయానికి చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే. ఇక్కడి స్థల సేకరణకు వ్యతిరేకంగా 13 గ్రామాలు పోరాటాలు చేస్తూ వస్తున్నాయి. శనివారం కూడా జరిగిన గ్రామ సభలో పరందూరు విమానాశ్రయానికి వ్యతిరేకంగా పదోసారి తీర్మానం చేశారు. ఈపరిస్థితులో హోసూరులో విమానాశ్రయానికి స్థల సేకరణ ఎలాంటి వివాదాల నడుమ సాగనుందో వేచి చూడాల్సిందే.
Comments
Please login to add a commentAdd a comment