● తిరుచెందూరులో శర వేగంగా ఆలయ పునరుద్ధరణ పనులు ● మాస్టర
తమిళ్ కడవుల్ మురుగన్‌కు రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన తిరుచెందూరు ఆలయం మాస్టర్ ప్లాన్‌తో కొత్త శోభను సంతరించుకోనుంది. రూ. 300 కోట్లతో చేపట్టిన పనులను 2025 చివరి నాటికి ముగించే విధంగా అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి. ఆలయ ప్రాశస్త్యం, సాంప్రదాయాలు చెక్కు చెదరని రీతిలో కొన్ని పాత నిర్మాణాలకు మెరుగు దిద్దుతున్నారు. అలాగే సముద్రం ముందుకు చొచ్చుకు రాకుండా తీరంలో అడ్డుగోడ పనులు చేపడుతున్నారు.
సాక్షి, చైన్నె: మురుగన్‌కు అత్యంత ప్రీతిపాత్రమైన ఆరుపడై వీడులుగా ప్రసిద్ధి చెందిన ఆలయాలు రాష్ట్రంలో ఉన్నాయి. ఇందులో ఈ భూమి మీద తన అవతారం సంపూర్ణంగా పూర్తయిన ప్రదేశంగా మురుగన్‌ను తిరుచ్చిరలైవాయ్ అని ఒకప్పుడు పిలవబడే నేటి తిరుచెందూరు కూడా ఉంది. ఆరుపడై వీడులలో రెండవదిగా పేరుగడించిన ఈ ఆలయం సాగర తీరంలో గంభీరంగా కనిపిస్తుంటుంది. ఏటా ఇక్కడ స్థల పురాణ వేడుకగా స్కంధ షష్టి ఉత్సవాలు ఆరు రోజులు నిర్వహిస్తున్నారు. ఇందులో సూర సంహార ఘట్టం అద్వితీయంగా సాగుతుంది. అలాగే వైకాశి విశాఖం, తైపూసం, పంగుణి ఉత్తిరం, ఆవణి తిరువిలా, మాసి పెరుం తిరువిళా వంటి వేడుకలు కనుల పండువగా జరుగుతాయి. నిత్యం భక్తులు తాకిడి అధికంగా ఉంటూ వస్తోంది. గంటల తరబడి క్యూలో వేచి ఉండి స్వామివారిని దర్శించుకోవాల్సిన పరిస్థితి. తిరుచెందూరు సుబ్రహ్మణ్య స్వామి ఆలయ పరిసరాల్ని తిరుమల తరహాలో తీర్చిదిద్దేందుకు ఇది వరకు సీఎం ఎంకే స్టాలిన్ ఆదేశించారు. ఇందుకోసం ప్రత్యేక మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసి అమలు చేస్తున్నారు.
శరవేగంగా పనులు..
కుంభాభిషేకానికి మరో ఎనిమిది నెలలే ఉంది. అప్పటిలోపు దాదాపుగా ప్రధాన పనులన్నీ ముగించే విధంగా కార్యాచరణ సిద్ధం చేశారు. ఒకే సమయంలో 600 మంది భక్తులు కూర్చుని ఆహారం తీసుకునే రీతిలో అన్నదాన కేంద్రం, వాణిజ్య సముదాయం, 2400 మంది భక్తులు కూర్చునేందుకు వీలుగా క్యూ కాంప్లెక్స్ తరహాలో వెయిటింగ్ హాల్. గిరి ప్రకారంలో రథం వెళ్లేందుకు ప్రత్యేక నిర్మాణాలు, భక్తులు వళ్లి గృహ ఆలయానికి ఎలాంటి ఆటంకం లేకుండా వెళ్లేందుకు వీలుగా ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టనున్నారు. భక్తులు కుటుంబాలతో సహా బస చేయడానికి వీలుగా గృహాలు, పంచామృతం, విభూది తయారీ కేంద్రాలు, ఉత్సవాలు, వేడుకలు, సంస్కృతి ప్రదర్శనల కోసం ఆడిటోరియాలకు కార్యాచరణ సిద్ధం చేశారు. ఈ పనులన్నింటినీ 2025 చివరి నాటికి ముగించే విధంగా అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి. ఇక్కడ నిర్మాణాలన్నీ పూర్తయిన పక్షంలో తిరుమల వసతులను తలపించే విధంగా భక్తులకు సేవలు ఉంటాయని హిందూ ధర్మాదాయ శాఖ అధికారి ఒకరు పేర్కొన్నారు. భక్తుల కోసం యాత్రీ నివాస్ పను లు, సముద్రం ముందుకు చొచ్చుకు రాకుండా మత్స్య శాఖ నేతృత్వంలో రూ. 19.80 కోట్లతో అడ్డుగోడ నిర్మాణం వంటి పనులు కూడా ఇక్కడ జరుగుతున్నాయని వివరించారు. ఈ మాస్టర్ ప్లాన్ మరో ఏడాది కాలంలో ముగియడం ఖాయమని, ఆ తదుపరి మరింత నవ్యశోభతో తిరుచెందూరు అలరారుతుందని తెలిపారు. శతాబ్దాల నాటి నిర్మాణాలు ఇక్కడ కొన్ని ఉన్నాయని, అవి చెక్కు చెదరకుండా మెరుగులు ఆలయానికి దిద్దేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.
విద్యుత్ వెలుగుల్లో తిరుచెందూరు ఆలయం
మాస్టర్ ప్లాన్‌తో..
హెచ్‌సీఎల్ రూ. 200 కోట్లు, హిందూ ధర్మాదాయ శాఖ రూ. 100 కోట్లతో మాస్టర్ ప్లాన్ అమలుపై దృష్టి పెట్టారు. ఇందులో ప్రస్తుతం ఇక్కడకు వచ్చే భక్తులకు అత్యవసర సేవల నిమిత్తం రెండు ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేసి సేవలకు శ్రీకారం చుట్టారు. అలాగే ఒకే సమయంలో 256 మంది భక్తులు తలనీలాలు సమర్పించేందుకు వీలుగా కాంప్లెక్స్, వాటర్ ట్యాంక్, నీటి శుద్ధీకరణ కేంద్రం పనులు ప్రస్తుతం ముగించి భక్తులకు సేవకు అంకితం చేశారు. 2009లో అష్ట బంధన మహాకుంభాభిషేకం ఇక్కడ 2009లో జరిగింది. 12 సంవత్సరాలకు ఒక సారి ఇక్కడ కుంభాభిషేకం జరగాల్సి ఉంది. ఈ ఘట్టం జరిగి 15 సంవత్సరాలు కావస్తున్న నేపథ్యంలో 2025 జూలైలో ఈ వేడుకకు నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. ఇందుకు సంబంధించిన పనులపై దృష్టి పెట్టారు. ఈ మాస్టర్‌ప్లాన్‌లో భక్తుల కోసం ప్రత్యేక వసతులు, తిరుమల తరహాలో క్యూ కాంప్లెక్స్, కాటేజిలు, అతిథి గృహాలు, వాణిజ్య సముదాయాలు, అగ్నిమాపక వాహనాల కోసం ప్రత్యేక నిర్మాణాలు, ఏనుగుల కోసం ప్రత్యేక షెల్టర్లు, ఆలయ పరిసరాల సుందరీకరణ, నాలుగు దిక్కుల నుంచి చూసినా.. ఆలయ రాజ గోపురం కనిపించే విధంగా ప్రత్యేక నిర్మాణాలు, నాలుగు బావుల ఆధునీకరణ, సూర సంహార ఘట్టం తిలకించేందుకు వీలుగా ప్రత్యేక వేదిక, వివిధ ప్రాంతాలలో ఉన్న ఐదు పడై మురుగన్ ఆలయాలను తలపించే సన్నిధులు, కల్యాణ వేదిక.. అంటూ బ్రహ్మాండంగా తిరుచెందూరును తీర్చిదిద్దే విధంగా రూపకల్పన చేశారు.
Comments
Please login to add a commentAdd a comment