26 నుంచి భారీ వర్షాలు
సాక్షి, చైన్నె : రాష్ట్రంలో అల్పపీడనం, ఈశాన్యరుతు పవనాల ప్రభావంతో 26వ తేదీ నుంచి భారీ వర్షాలుపడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం ప్రకటించింది. రాష్ట్రంలో ఇప్పటికే పలు జిల్లాలో భారీగా, మరికొన్ని జిల్లాలో మోస్తరు వర్షాలు పడ్డాయి. అయితే, రాష్ట్రంలోని 38 జిల్లాలో 18 జిల్లాలో వర్షపాతం మరీ తక్కువే. ఈ పరిస్థితులలో ఈనెల 26, 27, 28 తేదీలలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలో వర్షాలు పడే అవకాశాలు అధికంగా ఉన్నట్టు వాతావరణ కేంద్రం ప్రకటించింది. తంజావూరు, తిరువారూర్, నాగపట్నం, మైలాడుతురై, పుదుకోట్టై తదితర డెల్టా జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే ఇక్కడ వర్షాలు పడుతుండటంతో రైతన్నల్లో ఆందోళన పెరిగింది. అలాగే కాంచీపురం, చెంగల్పట్టు, విల్లుపురం జిల్లాలోనూ కొన్ని చోట్ల భారీ వర్షాలకు అవకాశాలు ఉన్నాయి. ఇదిలా ఉండగా, రాష్ట్ర వ్యాప్తంగా సముద్ర తీరాలలో కెరటాలు క్రమంగా ఎగసి పడుతున్నాయి. అయితే ఈ పరిస్థితులలో నాగపట్నం జిల్లా వేదారణ్యం సమీపంలోని కోడియకరై పరిసరాలో సముద్రుడు మాత్రం ప్రశాంతంగా ఉండడం అధికారులను, జాలర్లను కలవరపెడుతోంది. శనివారం సముద్రంలో అలలు కరువయ్యాయి. చెరువును తలపించే విధంగా సముద్రం కనిపించడంతో తీర గ్రామాల జాలర్లు సునామీ టెన్షన్‌లో పడ్డారు.
అయ్యప్ప భక్తులకు 5 లక్షల బిస్కెట్ ప్యాకెట్లు
సాక్షి, చైన్నె: శబరిమలై అయ్యప్ప భక్తులకోసం తమిళనాడు హిందూ ధర్మాదాయ శాఖ తరపున 5 లక్షల బిస్కెట్ ప్యాకెట్లను పంపణీ చేయాలని నిర్ణయించారు. ఈ బిస్కెట్లను లారీ ద్వారా శబరి మలైకు పంపించారు. శనివారం ఈ లారీని ఆ శాఖమంత్రి శేఖర్‌బాబు జెండా ఊపిసాగనంపారు. అయ్యప్ప భక్తుల కోసం తమ వంతుగా ఈసేవ చేస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు.
బాలికను గర్భవతిని చేసిన ప్రొఫెసర్
● పోక్సో చట్టం కింద అరెస్ట్
అన్నానగర్: విరుదునగర్ ఆమత్తూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఎదురుగా 14వ తేదీన పుట్టిన ఆడబిడ్డ కొన్ని గంటలపాటు అపస్మారక స్థితిలో పడి ఉంది. విషయం తెలుసుకున్న పోలీసులు చిన్నారిని రక్షించి చికిత్స నిమిత్తం విరుదునగర్ ప్రభుత్వ వైద్య కళాశాలలో చేర్పించారు. పసికందును విసిరేసిన మహిళ ఎవరు? ఆమత్తూరు పోలీసులు సీరియస్‌గా విచారణ చేపట్టారు. ఇందులో అక్రమ సంబంధం వల్లే పాప పుట్టిందని తేలింది. దాని వివరాలు ఇలా ఉన్నాయి.... విరుదునగర్ ప్రాంతానికి చెందిన 17 ఏళ్ల కళాశాల విద్యార్థిని తల్లిదండ్రుల నివసిస్తోంది. ఆ అమ్మాయి అప్పుడప్పుడు ఇంటి యజమాని దగ్గరికి వెళ్లి చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఉండేది. ఈ క్రమంలో ఇంటి యజమాని కొడుకు, 17 ఏళ్ల అమ్మాయికి అలవాటు పడ్డాడు. ఆ వ్యక్తి బాలికపై పలుమార్లు లైంగికదాడికి పాల్పడ్డాడు. దీంతో బాలిక గర్భం దాల్చింది. ఈ స్థితిలో గత 14వ తేదీ సాయంత్రం 4 గంటలకు ఆ ఆడబిడ్డకు జన్మనిచ్చిన బాలిక ఆమత్తూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఎదుట ఆడబిడ్డను వదిలేసింది. పోలీసుల విచారణలో ఈ సమాచారం వెల్లడైంది. తదనంతరం, ప్రమేయం ఉన్న వ్యక్తి గురించి పోలీసులు ఆరా తీస్తే, అతను అదే ప్రాంతంలోని ఒక ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలలో పనిచేస్తున్న 34 ఏళ్ల ప్రొఫెసర్ వివేక్ అని తేలింది. దీంతో పోలీసులు అతడిని శనివారం పోక్సో చట్టం కింద అరెస్టు చేశారు.
పోరాడి ఓడిన భారత జట్టు
కొరుక్కుపేట: చైన్నెలో జరిగిన అంతర్జాతీయ పురుషుల ఫిబా ఆసియా కప్ బాస్కెట్‌బాల్ క్వాలిఫైయర్ మ్యాచ్‌లో భారత జట్టు ఖతార్‌పై పోరాడి ఓడిపోయింది. దీంతో ఖతార్ జట్టు 69–53 స్కోరుతో అద్భుత విజయాన్ని నమోదు చేసింది. చైన్నెలోని నెహ్రూ ఇండోర్ స్టేడియంలో ఫిబా ఆసియా కప్ బాస్కెట్‌బాల్ (2025) సిరీస్‌కు సంబంధించిన క్వాలిఫైయర్‌లను బాస్కెట్‌బాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ ఆధవ్ అర్జున ఘనంగా ప్రారంభించారు. భారతదేశంలో మొదటిసారిగా, అంతర్జాతీయ పురుషుల బాస్కెట్‌బాల్ టోర్నమెంట్ చైన్నెలో జరిగింది. ఇందులో ప్రపంచ ర్యాంక్‌లో 76వ స్థానంలో ఉన్న భారత జట్టు, 101వ ర్యాంక్‌లో ఉన్న ఖతార్ జట్టుతో పోటీ పడింది. పోటాపోటీగా సాగిన ఈ మ్యాచ్‌లో చివరికి 69–53 స్కోరుతో ఖతార్ జట్టు అద్భుత విజయాన్ని నమోదు చేసింది. భారత జట్టు పోరాడి ఓడిపోయింది. ఇదిలా ఉండగా ఈ నెల 25న జరిగే మరో క్వాలిఫయింగ్ మ్యాచ్‌లో భారత జట్టు కజకిస్థాన్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్ 25వ తేదీన చైన్నెలోని నెహ్రూ ఇండోర్ స్టేడియంలో జరగనుంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తేనే భారత జట్టు ఫిబా ఆసియా కప్‌కు అర్హత సాధిస్తుందని అధికారులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment