ఊటీలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
– ఆహ్వానం పలికిన గవర్నర్, మంత్రి
సాక్షి, చైన్నె: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నాలుగు రోజుల పర్యటన నిమిత్తం బుధవారం ఊటీకి చేరుకున్నారు. ఇక్కడ జరిగే పలుకార్యక్రమాలలో పాల్గొనడంతో పాటు విశ్రాంతి తీసుకోనున్నారు. ఈ క్మరంలో ఢిల్లీ నుంచి కోయంబత్తూరు సూలూరు విమానాశ్రయానికి రాష్ట్రపతి ఉదయం చేరుకున్నారు. ఇక్కడి నుంచి ఆర్మీ హెలికాప్టర్‌లో ఊటీ వెళ్లారు. ఇక్కడి రాజ్ నివాస్‌లో బస చేశారు. ఊటీకి చేరుకున్న రాష్ట్రపతికి గవర్నర్ ఆర్‌ఎన్ రవి, మంత్రి శివ వి. మెయ్యనాథన్, కలెక్టర్ లక్ష్మీ భవ్య ఆహ్వానం పలికారు. బుధవారం అంతా రాష్ట్రపతి విశ్రాంతి తీసుకున్నారు. గురువారం ఊటీ నుంచి రోడ్డు మార్గంలో కున్నూరుకు వెళ్లనున్నారు. ఇక్కడి వెల్లింగ్ టన్ ఆర్మీ శిక్షణ కేంద్రంలో జరిగే కార్యక్రమానికి హాజరవుతారు. 29వ తేదీన ఊటీ సందర్శనతో పాటు విశ్రాంతి తీసుకోనున్నారు. 30వ తేదీన కోయంబత్తూరుకు చేరుకునే రాష్ట్రపతి, తిరువారూర్ సెంట్రల్ వర్సిటీ స్నాతకోత్సవానికి హాజరు కానున్నారు. ఈ పర్యటన ముగించుకుని కోయంబత్తూరుకు చేరుకుని తిరుపతికి ప్రయాణం అవుతారని తెలిసింది. రాష్ట్రపతి రాకతో ఊటీని నిఘా నీడలోకి తీసుకొచ్చారు. రాజ్ నివాస్ పరిసరాలలో 2 వేల మంది పోలీసులతో, కున్నూరు పరిసరాలలో మరో 1000 మంత్రితో భద్రతను కల్పించారు. తిరువారూర్ సెంట్రల్ వర్సిటీ పరిసరాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. అయితే వర్షాలు పడుతున్న నేపథ్యంలో రాష్ట్రపతి పర్యటన ఇక్కడ సాగేనా అన్నది వేచి చూడాల్సిందే.
Comments
Please login to add a commentAdd a comment