బందోబస్తు నడుమ ఆక్రమణల తొలగింపు
తిరువళ్లూరు: పట్టణంలోని వేర్వేరు ప్రాంతాల్లో అక్రమ కట్టడాలను గుర్తించి నోటీసులు జారీ చేసిన క్రమంలో బుధవారం అధికారులు భారీ పోలీసు బందోబస్తు నడుమ ఆక్రమణలను తొలగించారు. వివరాలు.. తిరువళ్లూరు పట్టణంలోని పత్తియాల్పేటతో సహా వేర్వేరు ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగేలా కొందరు భవనాలు, షెడ్లను ఏర్పాటు చేసినట్టు కలెక్టర్ డాక్టర్ ప్రభుశంకర్‌కు ఫిర్యాదులు అందాయి. ఆక్రమణలను తొలగించి రోడ్డు నిర్మాణం చేయాలని కోరుతూ వినతి పత్రం అందించారు. ఈ వినతులపై కలెక్టర్ స్పందిస్తూ అక్రమ కట్టడాలను గుర్తించి వాటిని తొలగించి రోడ్డు విస్తరణ పనులను చేపట్టాలని మున్సిపల్ కమిషనర్‌ను ఆదేశించారు. ఇందులో భాగంగానే బుధవారం భారీ పోలీసు బందోబస్తు నడుమ అధికారులు పత్తియాల్పేటలో అక్రమ కట్టడాలను కూల్చివేశారు. కట్టడాలను కూల్చే సమయంలో కొందరు అధికారులతో వాగ్వాదానికి దిగడంతో ఉద్రిక్తత నెలకొంది. అయితే పోలీసుల సహకారంతో కట్టడాలు, ప్రహరీగోడలను అధికారులు కూల్చివేశారు.
Comments
Please login to add a commentAdd a comment